జీ తెలుగు న్యూస్ ప్రసారాల ప్రారంభ తేదీ ఖరారు

0
1287

జీ గ్రూప్ లో ఎంటర్టైనెంట్ చానల్స్ అన్నీ ‘జీ ఎంటర్టైనెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్’ (ZEEL) సంస్థ ఆధ్వర్యంలోనూ, న్యూ స్ చానల్స్ అన్నీ ‘జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్’ (ZMCL ) కింద నడుస్తూ ఉండగా మీడియా సంస్థ తాజాగా మూడు చానల్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అందులో ఇప్పటికే స్టాండర్డ్ డెఫినిషన్ లో ప్రసారం చేస్తున్న జీ న్యూస్ ను హెచ్ డి చానల్ గా కూడా అందించటం ఒకటైతే జీ కన్నడ న్యూస్, జీ తెలుగు న్యూస్ పేరుతో మరో రెండు చానల్స్ కూడా ప్రారంభిస్తోంది.
వారం కిందటే ఈ విషయాన్ని ఈ వెబ్ సైట్ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా వాటి ప్రారంభ తేదీ కూడా తెలిసింది. జీ కన్నడ న్యూస్, జీ తెలుగు న్యూస్ పేరుతో రెండు చానల్స్ ను మే 1 నుంచి ( సరిగ్గా ఏప్రిల్ 30 అర్థరాత్రి 12 గంటలు దాటి మే 1 వ తేదీలోకి అడుగుపెట్టిన వెంటనే) అందిస్తున్నట్టు జీ మీడియా సంస్థ ఎమ్మెస్వోలకు, డీటీహెచ్ ఆపరేటర్లకు రాసిన లేఖను కేబుల్ సమాచారమ్ సంపాదించింది. ఆ చానల్స్ సిగ్నల్స్ అందుకోవటానికి అవసరమైన పరికరాలు, తదితర సమాచారం ఎవరినుంచి తీసుకోవాలో కూడా ఆ లేఖలో తెలియజేశారు.
ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రెండు ప్రాంతీయ భాషా చానల్స్ నూ పే చానల్స్ గా ప్రకటించారు. తెలుగు న్యూస్ చానల్స్ లో ఇప్పటివరకూ ఈటీవీ మాత్రమే తన రెండు న్యూస్ చానల్స్ నూ పే చానల్స్ గా ప్రకటించింది. ఒక్కో దానికి నెలకు రూ. 2 గరిష్ఠ చిల్లర ధరగా ప్రకటించి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జీ మాత్రం కన్నడ, తెలుగు న్యూస్ ఛానల్స్ కు ఒక్కోదానికి నెలకు 10 పైసలుగా నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here