నిబంధనలు ఉల్లంఘించిన బ్రాడ్ కాస్టర్ల మీద చర్యలు తీసుకోవాలి: కేబుల్ ఆపరేటర్ల డిమాండ్

0
299

1995 నాటి కేబుల్ టీవీ చట్టాన్ని, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన డౌన్ లింకింగ్ మార్గదర్శకాలను ప్రధాన బ్రాడ్ కాస్టర్లయిన డిస్నీ స్టార్, జి ఎంటర్టైన్మెంట్, వయాకామ్ 18, వార్నర్ మీడియా సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని కేబుల్ ఆపరేటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విధంగా నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ బ్రాడ్ కాస్టర్లు డిజిటల్ అడ్రసిబుల్ సిస్టం లైసెన్స్ లేనివారికి ప్రసారాలు అందిస్తున్నారంటూ బ్రాడ్ కాస్టర్ల మీద కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేయటంతోబాటు వారిమీద తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

           1995 నాటి  కేబుల్ టీవీ చట్టంలోని సెక్షన్ 4 ఏ ప్రకారం ఛానల్ కేవలం డిజిటల్ అడ్రసిబుల్ సిస్టమ్ లైసెన్స్ పొందిన వారి  ద్వారా మాత్రమే చందాదారులకు ప్రసారాలు అందించాల్సి ఉంటుంది. అయితే, భారత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్రాడ్కాస్టర్లు డిజిటల్ లైసెన్స్ పొందిన పంపిణీ వేదికల ద్వారా కాకుండా, నేరుగా ఇతర వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నారు.  దీన్ని వెంటనే నిలిపివేయాలని ఎమ్మెస్వోలు  ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎమ్మెస్వో  లైసెన్స్ లేకుండా జీ  ఎంటర్టైన్మెంట్ సంస్థ తన తనదైన జి5 అనే  యాప్ ద్వారా ప్రేక్షకులకు  అక్రమంగా ప్రసారాలు అందజేస్తోంది. అదేవిధంగా సోనీ పిక్చర్స్ సంస్థ కూడా సోనీ లైవ్ ద్వారా ప్రసారాలు అందిస్తుండగా డిస్నీ స్టార్ సంస్థ  డిస్నీ హాట్ స్టార్ ద్వారా, వయాకామ్  18 సంస్థ ‘వూట్’ ద్వారా ప్రసారాలు అందిస్తున్నాయి.  

ఈ విధంగా బ్రాడ్ కాస్టర్లు తమ అక్రమ ప్రసార పద్ధతికి ఓటీటీ ( ఓవర్ ది టాప్) అనే పేరు పెట్టుకున్నారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ విధించిన నిబంధనలకు నీళ్ళొదిలి వ్యవహరిస్తున్నారు. కేబుల్ టీవీ నియంత్రణ నిబంధనల ప్రకారం టీవీ చానల్ సిగ్నల్స్ ను డీకోడర్ బాక్సుల ద్వారాగాని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా గాని పునః ప్రసారం చేయాలి. అలాంటి పంపిణీ దారు కచ్చితంగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొంది ఉండాలి. అయితే, ఈ బ్రాడ్ కాస్టర్లు మాత్రం మంత్రిత్వశాఖ జారీ చేసిన నిబంధనలను తుంగలో తొక్కి నేరుగా ఓటీటీల ద్వారా చం దారులకు ప్రసారాలు అందజేస్తున్నారు.

ఇంకోవైపు ఈ బ్రాడ్ కాస్టర్లు అందరూ కుమ్మక్కై తమ చానల్స్ చందాలను పెంచుతున్నారు. దానివలన పంపిణీ సంస్థలు ఆ పెరిగిన ధరలను అమలు చేసే బాధ్యతలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఇంకో వైపు తమ ఓటీటీ వేదికల ధరలను బాగా తగ్గించటం ద్వారా ప్రేక్షకులు కేబుల్ టీవీని వదిలేసి ఓటీటీల వైపు వెళ్ళటాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెస్వోలకు ప్రసారాలు ఇవ్వాలంటే రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాలు చేసుకోవాల్సి ఉండగా ఓటీటీలకు మాత్రాం అలాంటి నిబంధనలేవీ లేవు. అందువలన ధరల విషయంలో ఎమ్మెస్వోలకు, తద్వారా కేబుల్ ఆరేటర్లకూ అన్యాయం జరుగుతోంది.

టారిఫ్ ఆర్డర్ అమలు చేయటంలో నిబంధనలు పట్టించుకోకుండా, ఓటీటీ ద్వారా లబ్ధిపొందుతూ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను దెబ్బతీస్తున్న బ్రాడ్ కాస్టర్ల మీద చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here