పే చానల్స్ ధరల పెంపుతో రేపటి నుంచి కేబుల్ బిల్లు భారం

0
10280

ఏప్రిల్ 1 నుంచి కేబుల్ టీవీ బిల్లు పెరగబోతోంది. టెలివిజన్ రంగాన్ని నియంత్రించాల్సిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా పే చానల్స్ వైపు నిలబడటంతో బిల్లు పెరగక తప్పలేదు. కోర్టు ద్వారా కూడా ప్రయత్నించిన ఎమ్మెస్వోలు ఈ ధరల పెరుగుదలను ఆపలేకపోయారు. దీంతో చందాదారులమీద అదనపు భారం అనివార్యంగా మారింది.

టారిఫ్ నిర్ణయించి అమలు చేయించాల్సిన ట్రాయ్, పే చానల్ యాజమానుల ఒత్తిడికి తలొగ్గి ధరల పెంపుకు అనుమతించింది. ఒక్కో పే చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ. 12 గా నిర్ణయించిన ట్రాయ్ ఆ తరువాత రూ. 19 కి పెంచుకోవటానికి అవకాశమిచ్చింది. దీనివల్ల 20 కోట్లకు పైగా కుటుంబాల మీద నెలకు అదనంగా రూ. 50 మేరకు భారం పడింది. అంటే, పే చానల్ యజమానులకు ఏడాదికి రూ. 12 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం కట్టబెట్టినట్టయింది. ట్రాయ్ ఎన్టీవో 3.0 పేరుతో ఈ విధమైన టారిఫ్ అమలు చేయటానికి సిద్ధమైనప్పుడు ఎమ్మెస్వోలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉద్యమాలు నడిచాయి. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. చందాదారుల మీద ఈ విధమైన భారం మోపటం వలన కేబుల్ పరిశ్రమ కుప్పకూలుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. అందుకే, ఒకవైపు ఆందోళనలు చేస్తూనే న్యాయపోరాటం కోసం కోర్టు మెట్లెక్కారు. కేరళ, తెలంగాణ సహా అనేక చోట్ల హైకోర్టులలో కేసులు పడ్డాయి.

పే చానల్ యాజమాన్యాల తరఫున ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గట్టిగా పట్టుబట్టి, పెరిగుణ ధరలు అమలు చేయాల్సిందేనంటూ భీష్మించుకుంది. దీంతో పెద్ద ఎమ్మెస్వోలు సభ్యులుగా ఉన్న ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ కూడా న్యాయపోరాటానికి దిగింది. కానీ, ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోగా, గడువులోగా బ్రాడ్ కాసటర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య ఒప్పందాలు జరిగి తీరాల్సిందేనని ట్రాయ్ పట్టుబట్టటంతో బ్రాడ్ కాస్టర్లు విజయం సాధించినట్టయింది. ఒక దశలో బ్రాడ్ కాస్టర్లు తమ చానల్స్ ప్రసారాలు ఎమ్మెస్వోలకు ఇవ్వటం నిలిపేశారు. పెరిగిన కొత్త ధరలకు ఒప్పందం చేసుకుంటే తప్ప ప్రసారాలు అందించటం సాధ్యం కాదని తేల్చి చెప్పటంతో ప్రేక్షకుల అవసరాలకు తలొగ్గక తప్పలేదు.

నిజానికి, పెరిగిన ధరలకు కారణం కేబుల్ ఆపరేటర్ అని చందాదారులు అపార్థం చేసుకుంటారన్నది ఎమ్మెస్వోల అభిప్రాయం. పైగా, ఈ కారణంగా కేబుల్ కనెక్షన్ తీసేస్తారేమోననే భయం కూడా ఉంది. పరిశ్రమ సాఫీగా సాగాలంటే చందాదారులమీద భారం పడకూడదని ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు భావించారు. కానీ, చందాదారులకు ఈ విషయం మీద సరైన అవగాహన లేకపోవటంతో ప్రసారాలు నిలిపివేయటాన్ని తట్టుకోలేకపోయారు. ఈ పరిస్థితిలో ఎమ్మెస్వోలు పెరిగిన ధరలకే ఒప్పందాలు చేసుకొని పంపిణీకి సిద్ధమయ్యారు. ఆ విధంగా ఏప్రిల్ 1 నుంచి కేబుల్ బిల్లు పెరగక తప్పటం లేదు.

డిజిటైజేషన్ అమలు చేసినప్పుడు ఏంటీవో 1.0 వలన బ్రాడ్ కాస్టర్ల ఆదాయం 200% పెరిగిందని, 3 కోట్లమంది కేబుల్ చందాదారులను పరిశ్రమ కోల్పోయిందని ఎమ్మెస్వోలు తేల్చారు. సర్దుబాటు చేయటానికి మరో చర్చా పత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పిన ట్రాయ్ బొకే ధరలను నియంత్రిస్తున్నట్టు చెప్పుకుంది. చందారులమీద ఏడాదికి 5,000 కోట్ల నుంచి 8,000 కోట్ల దాకా అదనపు భారం పడుతున్నట్టు అప్పట్లో ట్రాయ్ స్వయంగా ఒప్పుకుంది. ఈ కొత్త టారిఫ్ ఆర్డర్ మీద కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే ఎమ్మెస్వోలకు బ్రాడ్ కాస్టర్లు లీగల్ నోటీసులు పంపుతూ, 48 గంటలలోగా ఒప్పందాలు చేసుకోకపోతే ప్రసారాలు నిలిపివేస్తామని హెచ్చరించటంతో అనివార్యంగా ధరలకు ఒప్పుకోవాల్సి వచ్చింది. మొత్తంగా తేలిందేమంటే పే చానల్స్, ట్రాయ్ తోడు దొంగలని. దీనివల్ల అదనపు భారం పడేది ప్రేక్షకుల మీద. కొంతమంది ప్రేక్షకులు ఈ భారం వద్దనుకుంటే మొత్తం కేబుల్ కనెక్షన్ తీసేస్తే ఆపరేటర్ నష్టపోతాడు. పే చానల్స్ ధరలను నియంత్రించకపోతే ప్రేక్షకులు, కేబుల్ వ్యాపారులు నష్టపోతారని గతంలో చెప్పిన ట్రాయ్ మూడేళ్లపాటు మొసలి కన్నీరు కార్చిందని ఇప్పుడు అర్థమైంది. మొత్తానికి ట్రాయ్ మూడేళ్లపాటు ఆడిన నాటకానికి తెరపడింది. చందాదారులను, కేబుల్ రంగాన్ని నట్టేట ముంచుతూ, బ్రాడ్ కాస్టర్లకే లాభం కలిగేలా పే చానల్ ధరలు పెంచుకోవటానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలకు అలవాటు పడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here