జియో దెబ్బకు కేబుల్ టీవీ ఉక్కిరిబిక్కిరి

0
28986

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను అవకాశంగా తీసుకొని రిలయెన్స్ జియో తన అసలు వ్యూహం అమలు చేయటం మొదలుపెట్టింది. ఇది కేబుల్ టీవీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్పొరేట్ వ్యూహాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో కేబుల్ పరిశ్రమకు ఇప్పుడు అర్థమవుతోంది. ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్, ఓటీటీ, లైవ్ టీవీ చానల్స్ ను తగ్గింపు ధరలకే ఇవ్వజూపటం ద్వారా కేబుల్ టీవీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

నెలకు 198 రూపాయల బ్రాడ్ బాండ్ బాక్ అప్ ప్లాన్ తో బాటు జియో ఇప్పుడు తాజాగా 10 ఎంబీపీస్ బ్రాడ్ బాండ్ ప్లాన్స్ ను నెలకు రూ.298 కి ఇవ్వటం మొదలుపెట్టింది. పే టీవీ ధరల పెరుగుదల కారణంగా కేబుల్ కనెక్షన్ల నుంచి చందాదారులు ఓటీటీ వైపు వెళుతున్న సమయంలో జియో ఈ రంగాన్ని ధ్వంసం చేసే పనికి పూనుకుంది. అందుకు తగినట్టుగానే ప్రేక్షకులను ఉచ్చులోకి లాగే విధంగా పాకేజీలు ప్రకటించింది. ఆ విధంగా వైర్ లెస్ టెలికాం సేవలకు, ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సేవలమధ్య కన్వర్జెన్స్ సాధించే పనిలో పడింది.

ఇప్పటిదాకా కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లు భయపడుతున్నది జియో సినిమా వేదికమీద ఐపీఎల్ ఉచిత స్ట్రీమింగ్ గురించే. కానీ కాస్తాలో కాస్త ఊరట ఏంటంటే, డేటా రేటు ఎక్కువ కాబట్టి ఐపీఎల్ కోసమే దాని జోలికి వెళ్ళరని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జియో కేవలం నెలకు రూ.198 కే ప్రారంభ స్థాయిలో 10 ఎంబీపీస్ వేగంతో ఇంటర్నెట్ ప్రకటించటంతో అటు కేబుల్ టీవీ ఆపరేటర్లతోబాటు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్లు డిస్నీ స్టార్ సైతం ఇరకాటంలో పడింది. పైగా సచిన్ టెండూల్కర్ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్ గా అందరినీ డిజిటల్ లో ఐపీఎల్ చూసి సరికొత్త రికార్డు సృష్టించాలంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు.

తాజాగా, రిలయెన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉన్న ఎమ్మెస్వోలు హాత్ వే, డెన్ నెట్ వర్క్స్, జీటీపీఎల్ కు దాదాపు 2 కోట్ల కేబుల్ కనెక్షన్లు ఉండగా అవి తమ బేస్ ప్లాన్స్ నుంచి స్టార్ స్పోర్ట్స్ సహా అన్నీ స్టార్ చానల్స్ ను తొలగించాయి. దీంతో, సరిగ్గా ఐపీఎల్ ముందు కేబుల్ టీవీ చందా ధరలు 15 నుంచి 20% దాకా పెరగక తప్పలేదు. ఎన్టీవీ 3.0 కారణంగా చందా పెరిగి, చానల్స్ తగ్గిన నేపథ్యంలో రిలయెన్స్ జియో సరికొత్త ప్లాన్ వలన ఎక్కువ చానల్స్ తక్కువ ధరకు చూడగలిగే అవకాశం కలిగింది.

నెలకు రూ.198 బ్రాడ్ బాండ్ బాక్ అప్ ప్లాన్ కు తోడు జియో 10 ఎంబీపీఎస్ బ్రాడ్ బాండ్ ప్లాన్స్ ను రూ.298 కి ఇస్తూ, ఆరు ఓటీటీలు కూడా జోడించింది. అదే రూ.398 ప్లాన్ అయితే, అందులో 14 ఓటీటీలు ఉచితం. కొన్ని ఎంటర్టైన్మెంట్ అప్ గ్రేడ్ ప్లాన్స్ ను నెలకు రూ.100, రూ.200 కి ప్రకటిస్తూ ఉచిత సెట్ టాప్ బాక్స్ సైతం ఇవ్వజూపుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్, ఫ్రీ డిష్ పోటీ కారణంగా గత మూడేళ్ళకాలంలో ఒక్కొక్కరు 15,000 మంది చందాదారులను పోగొట్టుకున్నట్టు స్థానిక కేబుల్ ఆపరేటర్లు కేమడరా సమాచార, ప్రసార శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ కు విన్నవించారు. కేబుల్ ఆపరేటర్ల సంఖ్య కూడాగడిచిన 3-4 ఏళ్లలో గణనీయంగా తగ్గింది. గతంలో 12 లక్షల మంది ఆపరేటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గింది. చాలామంది ఇతర వ్యాపారాలకు వలస వెళ్ళి కేబుల్ వ్యాపారాన్ని వదిలేశారు.

సగటున ఒక టీవీ చానల్ బొకే బిల్లు దాదాపు రూ.400 గా ఉంటుంది. అదే జియో ప్రారంభస్థాయిలో 10 ఎంబీపీస్ రూ. 298 కి రావటంతోబాటు ఆరు ఓటీటీలు, 400 లైవ్ టీవీ చానల్స్ కూడా ఇవ్వజూపుతోంది. రూ.300-400 నెలవారీ కేబుల్ బిల్లు కట్టేవారికి జియో పాకేజ్ కొంత ఆకర్షణీయంగా కనబడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మార్కెట్ ను గుప్పిట్లో పెట్టుకోవటమన్న లక్ష్యంతో ఈ ధర దూకుడుతో వెళుతున్నట్టు భావిస్తున్నారు. ఓటీటీ చందాదారుల సంఖ్యను పెంచుకోవటంతోబాటు జియో తన ఎఫ్ టీ టీ హెచ్ కనెక్షన్లను 5 కోట్లకు పెంచుకోవటం మీద కూడా దృష్టి సారించింది. ఈ సంస్థకు డిసెంబర్ చివరినాటికి 77 లక్షల మంది హోమ్ బ్రాడ్ బాండ్ చందాదారులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here