ఓటీటీలో రోత: తప్పనిసరిగా మారిన కోర్టు జోక్యం

0
4390

ఒక చట్టమంటూ ఉంటే ఎవరైనా దాన్ని పాటిస్తారు. యునైటెడ్ కింగ్ డమ్ లో సినిమాల తరహాలోనే ఓటీటీ కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా సెన్సార్ అయ్యాకే ప్రసారమవుతాయి. వయసుల వారీగా ప్రసారాలను విభజించి మరీ అనుమతులిస్తారు. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బీ బీ ఎఫ్ సి) ఈ బాధ్యత చేపడుతుంది. ఈ పద్ధతిలో ఇమడటానికి ఒప్పుకోని ఒకే ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్. కానీ ఇప్పుడు అది కూడా తలొగ్గి ఆ నిబంధనలకు కట్టుబడతానని చెప్పింది. మొత్తం 29 వీడియో ఆన్ డిమాండ్, ఓటీటీ వేదికలు యుకె లో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో సినిమాల సెన్సార్ బ్రిటిష్ వాళ్ళ వారసత్వమే. నిజానికి ఓటీటీ ప్రారంభమైనప్పుడు దాని ఉద్దేశాలు వేరే. వ్యతిరేకంగా అనిపించినప్పుడు ప్రభుత్వం అడ్డుకునేది. భారత ప్రభుత్వం ప్రజల నైతిక రక్షణగా సినిమాల సెన్సార్ షిప్ చేపట్టి కొనసాగిస్తూ వచ్చింది. పర్యాటకులను ఆకర్షిస్తూ, మైథునం శిల్పకళ ప్రదర్శించే గుహలను చూపటానికి అభ్యంతరం ఉండదు.. వాత్స్యాయన కామసూత్రాల గడ్డ మనది. అయినా సరే, సినిమాలలో అసభ్యతను మాత్రం నియంత్రిస్తున్నామనే విమర్శలు తప్పలేదు. మొత్తంగా భారతదేశంలో సెన్సార్ ప్రధానంగా హింసను నియంత్రిస్తోంది.
భారత అధికారులు సినిమాల విషయంలో ఎంత కఠినంగా ఉంటారో, ఓటీటీల విషయంలో అంతఉదాసీనంగా ఉంటున్నారు. శాసనసభల్లో ప్రజాప్రతినిధులు సెక్స్ సైట్స్ చూస్తున్న మన దేశంలో అలాంటి సైట్స్ ను నిషేధించారు. కానీ ఓటీటీలో మాత్రం ఎలాంటి అడ్డంకులూ లేవు. ఎప్పటికప్పుడు కొన్ని దృశ్యాలను తొలగిస్తున్నామంటూనే ఏడో విధంగా భాషలో కూడా అసభ్యత చొప్పిస్తున్నారు. స్పెషల్ ఆప్స్, స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ, ది ఫామిలీ మాన్, పంచాయత్, క్రిమినల్ జస్టిస్ లాంటివి ప్రేక్షకాదరణ పొందాయి. అసభ్యత లేనందుకు మాత్రమే కాదు, విషయపరంగా కూడా బాగున్నందుకు.
ప్రతి విషయంలో కోర్టు జోక్యం చేసుకోవటాన్ని ప్రభుత్వాలు సహించటం లేదుగాని వాటి అలసత్వం వలన కోర్టులు జోక్యం చేసుకోక తప్పటం లేదు. సినిమాలకు ఏ, యూఏ, యు సర్టిఫికెట్లు ఇస్తుండగా ప్రధానంగా నగరాలలో మాత్రమే దీన్ని పాటిస్తున్నారు. ఓటీటీ విషయానికొస్తే, అది అన్నీ ఇళ్లకూ చేరుతుంది. దాని మీద నియంత్రణ ఉండదు. పిల్లలకూ అందుబాటులో ఉంటుంది.
మొత్తానికి కోర్టు జోక్యం చేసుకోక తప్పలేదు. ఈ వారం ఢిల్లీ హైకోర్టు దీనిమీద దృష్టిపెట్టింది. సోనీ ఓటీటీ వేదికలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ కాలేజ్ రొమాన్స్’ చాలా అసభ్యంగా ఉంది. అలాంటి వేదికలమీద ప్రసారమయ్యే కార్యక్రమాలు, వాటిలో భాష మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. చుట్టూ అందరూ ఉన్నప్పుడు తాను ఇయర్ ఫోన్స్ వాడుతూ వినాల్సి వచ్చినట్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ వ్యాఖ్యానించటాన్నిబట్టి ఆ భాష ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద డైరెక్టర్ సిమర్ ప్రీత్ సింగ్, నటుడు అపూర్వ అరోరా కూడా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే వెబ్ సిరీస్ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉండటం వలన వయో భేదం లేకుండా దేశంలో అందరూ చూడగలుగుతున్నారన్నారు.
ఏమైతేనేం, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవటం ఒక ముందడుగు. ప్రభుత్వం తనంతట తానుగా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టకపోతే మరిన్ని కేసులు కోర్టుకు రావటం, కోర్టు సమయం వృధా కావటం తప్పకపోవచ్చు.
ఓటీటీ అసభ్యత మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది: మంత్రి
ఓటీటీ ప్రసారాలలో అసభ్యత పెరుగుతూ ఉండటం మీద ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అనురాగ ఠాకూర్ స్పష్టం చేశారు. సృజనాత్మకత పేరుతో స్వేచ్ఛను దుర్వినియోగం చేసి అసభ్యత చూపితే క్షమించబోమన్నారు. నియమ నిబంధనలలో మార్పులు అవసరమైతే మార్చటానికి కూడా వెనకాడబోమన్నారు. ఇప్పటికే మూడంచేలా వ్యవస్థ ద్వారా ఓటీటీ ప్రసారాలమీద నిఘా ఉన్నదని, ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవటానికి ఐటీ చట్టంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here