బ్రాడ్ కాస్టింగ్, టెలికాం రంగాలలో వ్యాపారాన్ని సులభతరం చేయటానికి సూచనలు కోరిన ట్రాయ్

0
649

బ్రాడ్ కాస్టింగ్, టెలికాం రంగాలలో వ్యాపారాన్ని సులభతరం చేసేలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలివ్వాలని ఈ రంగానికి సంబంధించినవారికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చర్చకు ప్రాతిపదికగా ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసింది. ఈ రంగాలలో భాగస్వాములైన టెలికాం ఆపరేటర్లు, బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలు, వినియోగదారులు తమ తమ అభిప్రాయాలు తెలియజేయటానికి 2022 జనవరి 5 వ తేదీని గడువుగా పేర్కొంది. ఈ అభిప్రాయాల మీద స్పందించటానికి జనవరి 19 వరకు సమయం ఇచ్చింది.
దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ రంగాలు కీలకమైన చోదక శక్తులుగా మారి ఈ వ్యాపారాలలో పెట్టుబడులకు భారతదేశం అనుకూలమైనదిగా చాటి చెబుతున్నాయని ట్రాయ్ అభిప్రాయపడింది. వీటి వ్యాపార వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చగలిగితే మరింత మంది ఈ రంగాల వైపు ఆకర్షితులు కావటానికి, పెట్టుబడులు పెరగటానికి మరింత అవకాశముంటుందని ట్రాయ్ భావిస్తోంది.
నియమనిబంధనలను సరళతరం చేయటం ద్వారా వ్యాపారాన్ని సులభతరం చేసే దిశలో వివిధ మంత్రిత్వశాఖలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాల్సిందిగా ఈ చర్చా పత్రం ద్వారా కోరుతోంది. అందులో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, టెలికమ్యూనికేషన్లశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ రకరకాల అనుమతులు మంజూరు చేయటంలో ఇమిడి ఉన్న నేపథ్యంలో సులభంగా ఆ అనుమతుల మంజూరుకు చర్యలు సూచించాలని ట్రాయ్ కోరింది.
ఇప్పుడున్న విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వాటిని ఏ విధంగా సవరించటం ద్వారా వ్యాపారం సులభతరం అవుతుంది, నిబంధనల పరంగా ఎలాంటి సంస్కరణలు అవసరం, ప్రస్తుతమున్న ఆచరణ విధాలలో అవసరమైన మార్పులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ భారత వ్యాపార వాతావరణంలో విధానపరమైన మార్పులను సూచించవలసిందిగా వివిధ భాగస్వాములను ట్రాయ్ కోరుతోంది.
దరఖాస్తులను సరళతరం చేయటం, వాటిని ఆమోదించటానికి నిర్దిష్టమైన కాలపరిమితుల రూపకల్పన, సందేహాలకు తగిన సమాధానాలు సకాలంలో ఇవ్వటం ద్వారా అనుమతులను వేగవంతం చేయటం, వివిధ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం సాధించటం ద్వారా అనవసర జాప్యాన్ని నిరోధించటం, కొత్త టెక్నాలజీలను అనుసరించటం లాంటి అంశాలమీద అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్ కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here