వయాకామ్18 లో ఉదయశంకర్ వ్యూహాత్మక ప్రవేశం

0
484

స్టార్ ఇండియాకు దేశంలో తిరుగులేని నెంబర్ వన్ స్థానం సంపాదించిపెట్టిన ఉదయ్ శంకర్ ఇప్పుడు మళ్ళీ టీవీ వైపు దృష్టిసారించారు. దేశంలోని నాలుగు ప్రధాన నెట్వర్క్స్ (స్టార్, జీ, సోనీ, వయాకామ్ 18) లో ఆఖరిస్థానంలో ఉన్న వయాకామ్18 లో రూ.12,000 కోట్ల పెట్టుబడులు పెట్టటానికి మీడియా రారాజు రూపర్ట్ మర్దోక్ కొడుకు జేమ్స్ మర్దోక్ తో కలిసి సమాయత్తమయ్యారు.
వయాకామ్18 లో 49 శాతం వాటా ఉన్న వయాకామ్ సిబిఎస్ సంస్థ తన వాటాను 10 శాతానికి పరిమితం చేసుకోవాలని నిర్ణయించటంతో ఈ అవకాశాన్ని జేమ్స్ మర్దోక్, ఉదయ శంకర్ వాడుకోవాలనుకున్నారు. అయితే, ఇప్పటికే మెజారిటీ వాటా ఉన్న రిలయెన్స్ సంస్థ తన్మ మెజారిటీ వాటాను అదే విధంగా కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ రూ.30,000 కోట్లు ఉంటుందని అంచనావేస్తుండగా అందులో 12,000 కోట్లు పెట్టటం ద్వారా 40% వాటా తీసుకోవటానికి మర్దోక్, ఉదయ్ శంకర్ సిద్ధమయ్యారు. ఈ డీల్ 2-3 వారాల్లో పూర్తయ్యే అవకాశముంది.
కొత్తగా వచ్చే నిధులతో బాటు ఉదయ్ శంకర్ కు కీలకపాత్ర ఇవ్వటం ద్వారా వయాకామ్ 18 సంస్థ స్పోర్ట్స్ బ్రాడ్ కాస్ట్ లో మరింత ఉద్ధృతంగా దూసుకుపోయే అవకాశం ఉంది. నిజానికి తగిన వ్యూహం కొరవడటం వల్లనే ఇంతకాలంగా నాలుగో స్థానానికే పరిమితమైందన్నది నిజం. స్టార్ ను విజయపథంలో నడపటంలో ఉదయ్ శంకర్ దూకుడు, స్పోర్ట్స్ ప్రసార హక్కులు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
జీ-సోనీ విలీనం వలన మార్కెట్లో వాటి అధిపత్యానికి తిరుగుండదని భావిస్తున్న సమయంలో వయాకామ్ కూడా స్పోర్ట్స్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలోనే ఎన్ బి ఏ, ఫీఫా వరల్డ్ కప్ 2022, ఇటలీ, స్పానిష్, ఫ్రెంచ్ ఫుట్ బాల్ లీగ్ పోటీల హక్కులు, ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ హక్కులు, అబుధాబీ టీ 10 క్రికెట్ హక్కులు కొనుగోలు చేసింది, ఇప్పుడు ప్రధానమైన స్పోర్ట్స్ హక్కులకు వేలం జరగాల్సి ఉన్న సమయంలో ఉదయ్ శంకర్ ప్రవేశం మీడియా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here