అలా మొదలైంది

0
920

సన్ టీవీ కరుణానిధి మేనల్లుడు మురసొలి మారన్. డీఎంకే పార్టీ పత్రిక మురసొలి (తెలుగు అర్థం ‘శంఖారావం’) నిర్వాహకుడు కావటంతో అదే ఆయన పేరు ముందు చేరింది. మురసొలి మారన్ పెద్దకొడుకు సన్ టీవీ అధిపతి కళానిధి మారన్, చిన్నకొడుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్. మేనల్లుడి కొడుకు కళానిధి మారన్ అంటే కరుణానిధికి వల్లమాలిన ప్రేమ. ముద్దుగా ‘పుగళ్’ (కీర్తి, యశస్సు) అని పిలిచేవారు.

మద్రాసు లో డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్న కళానిధి ఫ్రెండ్స్ మళ్ళీ లయోలాలో కూడా కలిశారు. అప్పటికే తాత ముఖ్యమంత్రిగా, తండ్రి ఎంపీగా ఉండటం వలన రాజకీయ రక్తం కళానిధిని ఉద్యమాలవైపు లాగింది. లయోలా విద్యార్థులతో శ్రీలంక తమిళులకు సంఘీభావంగా చెన్నైలో భారీ రాలీ జరిపారు. లయోలా యాజమాన్యం ఉలిక్కి పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా, చాలా గుంభనంగా నడిచే లయోలాలో ఇదేంటని అందరూ అనుకుంటున్నారు.

అదే సమయంలో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రెసిడెంట్ గా కళానిధి బరిలో దిగితే, ఆయన మిత్రబృందం ప్రచార బాధ్యతలు చేపట్టింది. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారి, అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. మొత్తానికి కళానిధి గెలిచారు. ఆయనమీద పోటీ చేసి ఓడిపోయిన ఏకే విశ్వనాథన్ ఆ తరువాత కాలంలో కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్ అయ్యారు. కళానిధి గెలవటం సంగతేమోగాని లయోలా యాజమాన్యం ఎంతగా భయపడిందంటే, ఆ తరువాత రెండేళ్లకు అదే కాలేజ్ లో చేరటానికి వచ్చిన దయానిధికి సీటివ్వటానికి ఒప్పుకోలేదు. మురసొలి మారన్ బ్రతిమాలినా ససేమిరా అనటంతో, స్టూడెంట్స్ యూనియన్ జోలికి పోడని రాతపూర్వకంగా ఇచ్చి మరీ చేర్పించాల్సి వచ్చింది. చిత్రమేంటంటే, కాలేజ్ లో చదువుకున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా, అదే దయానిధి మారన్ ఎంపీగా పోటీచేసినప్పుడు వోట్ల లెక్కింపు జరిగిందీ, ఎలక్షన్ సర్టిఫికెట్ అందుకున్నదీ ఇదే లయోలా కాలేజ్ లో.

శరద్ కుమార్ కు అమెరికన్ యూనివర్సిటీలో ఎంబీయే సీటొచ్చింది. కళానిధికి రాలేదు. మిత్రుడి కోసం శరద్ ఒక సంవత్సరం ఆగారు. మరుసటి సంవత్సరం ఇద్దరూ స్క్రాన్టన్ యూనివర్సిటీలో ఎంబీయే చదవటానికి అమెరికా వెళ్లారు. శాక్స్ మాత్రం మద్రాసులోనే టాటా గ్రూప్ వాళ్ళ ఆయిల్ మిల్స్ లో చేరారు. ఆ తరువాత టాటా టీ డీలర్ షిప్ తీసుకున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చాక మురసొలి గ్రూప్ పత్రికల్లో సర్క్యులేషన్ విభాగంలో చేరారు కళానిధి. తనకు తెలిసిన శివశంకరన్ అనే స్టెర్లింగ్ కంప్యూటర్స్ యజమానికి శరద్ కుమార్ ను పరిచయం చేసారు. ఆలా ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా చేరారు శరద్. ( ఇదే శివశంకరన్ ఆ తరువాత కాలంలో ఎయిర్ సెల్ అనే టెలికాం కంపెనీ పెట్టటం, దాన్ని ఒక మలేసియా కంపెనీకి బలవంతంగా అమ్మించారంటూ ఆయన మారన్ సోదరులమీద సీబీఐకి ఫిర్యాదు చేయటం, ఈ డీల్ లో మారన్ సోదరులకు 700 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందంటూ సీబీఐ చార్జ్ షీట్ వేయటం, ఆ తరువాత కేసు కొట్టేయటం ప్రస్తుతానికి అప్రస్తుతం). ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన మాత్రం వదల్లేదు. అప్పట్లో ‘న్యూస్ ట్రాక్’ పేరుతో ఇండియా టుడే ఒక వీడియో మాగజైన్ నడిపేది. వీడియో కాసెట్ ప్లేయర్లు (వీసీపీలు) బాగా ప్రాచుర్యం పొందిన ఆ రోజుల్లో జనం అలాంటి వీడియో క్యాసెట్లు కొని ఇళ్ళలో వీసీపీలో పెట్టుకొని చూసేవారు. అలాంటిదే తమిళంలో తీసుకు రావాలని కళానిధి మారన్, శరద్ కుమార్ నిర్ణయించుకున్నారు. శరద్ ఆ ఉద్యోగం మానేశారు. శాక్స్ ఉద్యోగం వదిలేసి వచ్చి తన మిత్రులతో చేయి కలిపారు.

రాజకీయాలు, సినిమాలు సహా రకరకాల అంశాలతో ఆకట్టుకునే విధంగా ‘పూమాలై’ పేరుతో ఆలా ఒక మంత్లీ వీడియో మాగజైన్ తమిళ మార్కెట్లో ప్రవేశించింది. అప్పుడు ముఖ్యమంత్రి కరుణానిధి. అందుకే చాలా అట్టహాసంగా ఆవిష్కరణ జరిగింది. అదే స్థాయిలో ఆదరణ కూడా కనిపించింది. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ కాసెట్ల అమ్మకాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. లోతుగా శోధిస్తే అసలు విషయం అర్థమైంది. వీళ్ళు అమ్మిన కాసెట్లకు పది రెట్లు పైరేటెడ్ కాసెట్లు మార్కెట్లో తిరుగుతున్నాయని. ఆ విధంగా పైరసీ దెబ్బకు ‘పూమాలై’ మూతబడింది.

అప్పుడప్పుడే భారతదేశంలో స్టార్ ప్రసారాలు అందటం, అది చూసి సుభాష్ చంద్ర హిందీలో చానల్ కోసం ప్రయత్నించి పెద్దమొత్తం చెల్లించటానికి సిద్ధపడిశాటిలైట్ ట్రాన్స్ పాండర్ లో చోటు సంపాదించుకోవటం జరిగిపోయాయి. ఆలా జీ టీవీ మొదలైంది. అందులో కొంత సమయం (స్లాట్) తీసుకొని తమిళ ప్రసారాలు అందిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన వచ్చింది. ఆలా ఆలోచన వచ్చిందే తడవుగా ఈ ఇద్దరు మిత్రులు బొంబాయి వెళ్ళారు. సుభాష్ చంద్ర అపాయింట్ మెంట్ దొరకలేదు. అమెరికాలొ ఎంబీయే చదువుకొని వచ్చిన ఇద్దరికీ పాలుపోలేదు. కనీసం అపాయింట్ మెంట్ కూడా అయివ్వక పోవటమేంటని మథనపడ్డారు. విజిటింగ్ కార్డ్స్ లేకపోవటం వల్లనే ఖాతరు చేయలేదేమోనన్న నిర్థారణకు వచ్చారు. ఈ సారి విజిటింగ్ కార్డ్స్ వేయించుకొని వెళ్లారు. అయినా సరే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అతి కష్టం మీద ఒక సాధారణ ఉద్యోగితో మాట్లాడే అవకాశమిచ్చారు. ప్రాంతీయ భాషలో శాటిలైట్ ప్రసారాలు చూసే వాళ్ళే ఉండరని, అందువలన స్లాట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ ఉద్యోగి తేల్చి చెప్పాడు.

నిజానికి జీ అధిపతి సుభాష్ చంద్ర కూడా తన శాటిలైట్ చానల్ కోసం సింగపూర్ లో స్టార్ అధిపతి రిచర్డ్ లీ చుట్టూ ఇలాగే తిరిగారు. తనను అవమానిస్తున్నారని బాధపడ్డారు. కొనలేనంత ధర చెప్పి వెనక్కి పంపిద్దామనుకుంటే మొండిగా వాదించి వాళ్ళ బేరానికి ఒప్పుకొని మరీ చానల్ పెట్టారాయన. కానీ తన దేశంలో మరో భాషలో స్లాట్ కోసం వస్తే సుభాష్ చంద్ర కూడా అలాగే వ్యవహరించారు. తాను ఆ రోజు ఆలా చిన్న చూపు చూడకపోతే, దక్షిణాదిన ఒక పోటీ సామ్రాజ్యం విస్తరించేది కాదని ఆ తరువాత కాలంలో ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. సరే, ఉసూరుమంటూ వెనక్కి వచ్చిన ఈ మిత్రులిద్దరూ శాటిలైట్ చానల్ ఆలోచన మాత్రం మానలేదు. పైగా అవమాన భారం కూడా వాళ్ళలో మరింత కసి పెంచింది. ఆలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మొదలైన జైన్ టీవీ గుర్తొచ్చింది. ఒక రష్యన్ శాటిలైట్ లో ట్రాన్స్ పాండర్ లీజుకు తీసుకున్న జైన్ టీవీ దగ్గర సమయం అందుబాటులో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ సమయం కొనుక్కుంటే తమిళ ప్రసారాలు అందించవచ్చునన్నది వీళ్ళ ఆలోచన. కానీ ట్రాన్స్ పాండర్ లో సమయం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి మూడు గంటలతో ప్రారంభించి ఆ తరువాత పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏమైతేనేం, బేరం కుదిరింది. ఒక సినిమాతో బాటు కొన్ని పాత సినిమా పాటలు కలిపి మొత్తం మూడు గంటల ప్రసారాలు అందించాలని నిర్ణయించారు.

1993 ఏప్రిల్ 14 న తమిళ ఉగాది నాడు తొలి తమిళ శాటిలైట్ ఛానల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.( ఏప్రిల్ 9 న టెస్ట్ సిగ్నల్ ఇచ్చి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్థారించుకున్నారు). ఒక్కొక్కటి గంటన్నర వ్యవధి ఉండే రెండు బీటా కాసెట్లలో కార్యక్రమాలు నింపి విమానంలో పంపితే, అక్కడ మాస్కోలో టెలిపోర్ట్ ఉద్యోగి వాటిని వరుసగా ప్లే చేస్తాడు. అదీ ఏర్పాటు. ఆ రోజు మద్రాసులో పత్రికాప్రతినిధులు డీఎంకే కార్యాలయం ‘అన్నా అరివాలయం’ లో సన్ టీవీ ఆఫీస్ ఉన్న మూడో అంతస్తుకు చేరుకున్నారు. తమిళంలో ఒక ప్రైవేట్ శాటిలైట్ చానల్ ప్రసారాలు ప్రారంభమవుతున్న చరిత్రాత్మక ఘట్టాన్ని రిపోర్ట్ చేయటానికి వచ్చారు. ఆశీస్సులు అందించటానికి అప్పటికే కలైంజ్ఞర్ కరుణానిధి, మురసొలి మారన్ కూడా అక్కడున్నారు. కళానిధి మారన్, శరద్ కుమార్ సహా 16 మంది లయోలా సహాధ్యాయులు ఉత్కంఠతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.

ఒక్కసారిగా టీవీ తెరమీద బొమ్మ కనబడగానే చప్పట్లు మారుమోగాయి. మనవడు కళానిధి మారన్ మెడలో దండవేసి స్వీట్ తినిపించారు కరుణానిధి. వెంటనే పత్రికలవాళ్ళకూ స్వీట్స్ పంచారు. ఐదు నిమిషాలు గడవకముందే కరుణానిధి “పుగళ్!” అని గట్టిగా పిలిచారు. ఒక్కసారిగా హాల్లో నిశ్శబ్దం. టీవీ తెరవైపే చూస్తున్న కరుణానిధి, “అరే , సినిమా సెకండ్ పార్ట్ వస్తున్నది, చూడు” అన్నారు. ఆయన సినిమా జ్ఞానం అలాంటిది. అప్పటిదాకా ఎవరూ అది పట్టించుకోలేదు. బొమ్మలు మాత్రమే చూశారు. ఆయన మాటతో నిర్ఘాంతపోయి అసలు విషయం అర్థమై కిందికి పరుగెత్తి రోడ్డు అవతల ఉన్న టెలిఫోన్ బూత్ లో రష్యాకు ఐఎస్ డీ కాల్ బుక్ చేసి కాసెట్ మార్చవల్సిందిగా చెప్పి మళ్ళీ మొదటి భాగం వేయించటానికి అరగంట పట్టింది. ఈరోజు 33 చానల్స్ కు ఎదిగిన సన్ టీవీ తొలిరోజు అనుభవమది. టీవీలో సినిమాలు మాత్రమే వేస్తే చాలదు. చాలా ప్రోగ్రామ్స్ చేయాలి. కానీ ఒక టీవీ ఛానల్ ఎలా నడుస్తుందో ఈ మిత్ర బృందంలో ఎవరికీ, ఏ మాత్రమూ అవగాహన లేదు. తెలుసుకోవటమెలా? జీటీవీ చూసినంత మాత్రాన తెరవెనుక జరిగే శ్రమ గురించి తెలిసే అవకాశం లేదు. ఆ బాచ్ లో ఇంగ్లిష్, తెలుగు, తమిళంతోబాటు హిందీ తెలిసిన వాడు హన్స్ రాజ్ సక్సేనా (తండ్రి ఉత్తరాది, తల్లి రాజమండ్రి వాసి) ఒక్కడే. అంతా ముద్దుగా శాక్స్ అని పిలుచుకునే సక్సేనాను ఎలాగైనా జీటీవీకి పంపాలన్నది వాళ్ళ ఆలోచన. సన్ టీవీ అని చెబితే చేర్చుకోరు కాబట్టి ఏదో విధంగా ఒక చిన్న ఉద్యోగం సంపాదించి రెండు మూడు నెలలు అక్కడ ఉండి సాధ్యమైనన్ని విషయాలు తెసుసుకొని రావటం శాక్స్ పని. నిజంగానే శాక్స్ జీటీవీలో చేరి చాలా విషయాలు నేర్చుకొని రావటమే కాదు, సన్ టీవీకి ప్రోగ్రామింగ్ హెడ్ అయ్యాడు.

*****లయోలా కాలేజ్ లో చదువుకున్న 16 మంది మిత్రులూ సన్ టీవీ కోసం బాగా కష్టపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో విభాగానికి అధిపతి. 1993 లో సన్ టీవీ మొదలైనప్పుడు వాళ్ళందరూ 29 ఏళ్ల వయసువాళ్ళే. మొదలైన ఏడాదిన్నరలోనే 24 గంటల ప్రసారాలకు ఎదిగింది సన్ టీవీ. ఈ వ్యాపారంలో శాటిలైట్ ట్రాన్స్ పాండర్ అద్దెకు తీసుకోవటంలోనే విజయ రహస్యం ఉందని గుర్తించింది. ఆలా తీసుకున్న ట్రాన్స్ పాండర్ లోనే జెమినీ (తెలుగు), ఉదయా (కన్నడ) టీవీలకు ఫ్రీక్వెన్సీ అద్దెకు ఇచ్చి, బకాయిలకు బదులు వాటా కొనుక్కొని క్రమంగా ఆ చానల్స్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత మలయాళంలో సూర్య టీవీ మాత్రం సొంతగానే పెట్టుకుంది. సన్ టీవీ మొదటినుంచీ ప్రోగ్రామ్స్ ఎంచుకున్న పద్ధతి భిన్నంగా ఉండేది. మొదలైన మూడు నెలల తరువాత ఆదివారం పగలు మరో నాలుగు గంటల ప్రసారాలు కూడా మొదలయ్యాయి. దూరదర్శన్ లో ఉన్నత వర్గాలను ఆకట్టుకునే శాస్త్రీయ సంగీతం లాంటి కార్యక్రమాలు వస్తూ ఉంటే, సామాన్యులకు చేరువయ్యే జానపద గీతాలు ప్రసారం చేసేది సన్ టీవీ. రవి బెర్నార్డ్ ( తరువాత కాలంలో జయలలిత ఆయనను రాజ్యసభకు పంపారు) అనే జర్నలిస్ట్ హోస్ట్ గా ‘నేరుక్కు నేర్’ (ముఖాముఖి) కార్యక్రమం, పట్టిమన్రం పేరుతో ఆసక్తికరమైన చర్చా కార్యక్రమం లాంటివి ఆదివారం పగటిపూట విశేషంగా ఆకట్టుకునేవి. 1995 జనవరి నాటికి సొంత ట్రాన్స్ పాండర్ తీసుకోవటం, మనీలా (ఫిలిప్పైన్స్) నుంచి అప్ లింకింగ్, ఆ తరువాత న్యూస్ బులిటెన్స్ చేర్చటం చకచకా జరిగిపోయాయి. తమిళంలో రాజ్ టీవీ వచ్చినా, జయా టీవీ వచ్చినా సన్ టీవీ ప్రేక్షకాదరణలో 20 శాతం కూడా సంపాదించుకోలేక పోయాయి.కంటెంట్ పరంగా, ఉద్యోగుల పరంగా వ్యూహ రచనలో సన్ టీవీ ఎప్పుడూ ముందుంటుంది. జయా టీవీ మొదలవుతున్న సమయంలో ‘త్వరలో రాబోయే శాటిలైట్ చానల్ కోసం ఉద్యోగులు కావాలి’ అనే ఫుల్ పేజ్ ప్రకటన వచ్చింది. సహజంగానే సన్ టీవీ వాళ్ళు చాలామంది పోలోమంటూ దరఖాస్తు చేశారు. బాక్స్ నెంబర్ ఇచ్చి, పోస్టాఫీసుకు వచ్చిన నాలుగు గోనె సంచుల దరఖాస్తులను ఆఫీసుకు తెచ్చేదాకా అది సన్ టీవీ ఇచ్చిన ప్రకటన అని సన్ సిబ్బందికి తెలియదు. గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళెవరో కనిపెట్టటానికి సన్ టీవీ వేసిన ఎత్తుగడ ఇది. ఆలా పక్క చూపులు చూస్తున్నారనుకున్నవాళ్లకు ఆ సంవత్సరం ఇంక్రిమెంట్లు వేయలేదు. ఎలాగూ తెలిసిపోయిందని చాలామంది ఆ తరువాత జయా టీవీలో చేరటం వేరే విషయం. ఇలాంటి చావు తెలివితేటలు చాలా వాడింది సన్. ఏమైతేనేం, సన్ టీవీకి మొన్నటి ఏప్రిల్ 14 తో ముప్పయ్యేళ్ళు నిండాయి. ఇప్పుడు సన్ గ్రూప్ ఆధ్వర్యంలో 33 చానల్స్, 45 ఎఫ్ ఎం రేడియోలు, సుమంగళి కేబుల్ విజన్ పేరుతో ఎమ్మెస్వో, మూడు దినపత్రికలు, నాలుగు వార పత్రికలు, ఒక డీటీహెచ్ (సన్ డైరెక్ట్), ఒక ఓటీటీ (సన్ నెక్స్ట్) ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు, ఒక సినీ నిర్మాణ సంస్థతోబాటు కొంతకాలం స్పైస్ జెట్ విమాన సంస్థ కూడా ఈ గ్రూప్ లో ఉన్న సంగతి తెలిసిందే. *****(ఇదంతా సరే గాని, స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా, పూమాలై నుంచి జెమినీ, ఉదయా ఛానల్స్ నిర్వహణ దాకా ఉన్న శరద్ కుమార్ సన్ నెట్ వర్క్ నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పట్లో మూడు కోట్లు ఇచ్చిన కరుణానిధికి తగినంత సొమ్ము ఇచ్చే బైటికి పంపారా? దయానిధి మారన్ కమ్యూనికేషన్ల శాఖామంత్రి అయ్యాక మారన్ సోదరుల మీద కేసులెందుకు పడ్డాయి? సన్ టీవీ ఉండగా కరుణానిధి సొంత చానల్స్ పెట్టుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ప్రభుత్వ కేబుల్ టీవీని కరుణానిధి బెదిరింపు అస్త్రంగా మార్చుకున్నారా? కరుణానిధి చానల్స్ లో ఎండీ అయినందుకు శరద్ కుమార్ జైలుకెళ్లాల్సి రావడమేంటి ? కళానిధి మళ్ళీ తాతతో కాళ్ళబేరానికి వచ్చారా? ఇంతకూ, జీటీవీలో చేరి టీవీ మెలకువలు నేర్చుకుని వచ్చి సన్ గ్రూప్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ సీవోవోగా ఎదిగిన శాక్స్ ను కూడా ఆ తరువాత ఎందుకు బైటికి పంపారు? అతణ్ణి ఎవరు అరెస్ట్ చేయించారు? ఇప్పుడెక్కడున్నారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇంకోసారి ) ఫోటోలు: ఎడమవైపు కళానిధి మారన్, కుడి వైపు పైన శరద్ కుమార్, కింద హన్స్ రాజ్ సక్సేనా (శాక్స్)-

తోట భావనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here