మా గురించి

టెలివిజన్ పరిశ్రమలో పలువురి మన్ననలందుకున్న కేబుల్ సమాచారమ్ మాసపత్రికకు డిజిటల్ రూపమే కేబుల్ సమాచార్ పోర్టల్. నాలుగేళ్లకు పైగా నెలనెలా ప్రచురితమైన పత్రిక స్థానిక ఆపరేటర్లను, ఎమ్మెస్వోలను, డిటిహెచ్, హిట్స్, ఐపిటీవీ ఆపరేటర్లతోబాటు బ్రాడ్ కాస్టర్లను కూడా ఎంతగానో ఆకట్టుకోగలిగింది. వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు, పరిశ్రమలోని ధోరణులు అందించటంలో పత్రిక విజయం సాధించింది. డిజిటైజేషన్ జరుగుతున్న సమయంలో పరిశ్రమలోని అందరికీ అవసరమైన సమాచారం, చట్ట పరమైన అంశాలు, నిబంధనలు వివరించటం ద్వారా అవగాహన పెంచటం కూడా ఈ విజయానికి మరో ప్రధాన కారణం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో  విషయ జ్ఞానం పంచుతూ  అందరినీ ఆకట్టుకోగలిగింది.
సాంకేతిక అంశాలు సైతం సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ కేబుల్ పరిశ్రమను డిజిటైజేషన్ విషయంలో అన్ని విధాలా ముందుంచగలిగింది. అదే విధంగా కేబుల్ టీవీ డిజిటైజేషన్ పేరుతో ఒక సవివరమైన పుస్తకం ప్రచురించటం ద్వారా పరిశ్రమలోని వారందరికీ మార్గదర్శకమైన సమాచారం అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు సాంకేతిక అభివృద్ధిని, డిజిటల్ విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని కేబుల్ రంగ దార్శనికుడైన శ్రీ సుభాష్ రెడ్డిగారి నాయకత్వంలోని  పత్రిక యాజమాన్యం అత్యంత వేగంగా పరిశ్రమలోని వారందరికీ సమాచారం చేర్చాలనే నిర్ణయం తీసుకుంది. కేబుల్ సమాచారం పత్రికకు ఈ-మాగజైన్ రూపమిచ్చి ఉచితంగా అందజేయాలని ఒక వెబ్ సైట్/ యాప్ రూపొందించింది. జరిగింది జరిగినట్టు తక్షణమే అందించటం దీని లక్ష్యం. అందరికీ అందుబాటులో ఉండేందుకు రెండు భాషల్లోనూ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అందువలన తెలుగు వారితోబాటు జాతీయ స్థాయిలో పాఠకులకు కూడా కేబుల్ సమాచారం అందుబాటులో ఉంటుంది.
పాఠకులు ఈ వేదికను సద్వినియోగం చేసుకుంటారని కేబుల్ సమాచార్ ఆశిస్తోంది. పరిశ్రమకు సంబంధించిన తాజా సమాచారం, వార్తలు, విశ్లేషణలు, అనుభవజ్ఞుల పరిశోధనాత్మక కథనాల ద్వారా అందరిలో అవగాహన పెంచటం, అనుభవాన్ని పంచటం దీని లక్ష్యం. మరిన్ని సలహాలు, సూచనల ద్వారా ఈ పోర్టల్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం.
శ్రీ ఎం. సుభాష్ రెడ్ది, ఎడిటర్ ఇన్ చీఫ్
శ్రీ ఎం. సుభాష్ రెడ్డి కేబుల్ టీవీ రంగం తొలితరపు మార్గదర్శి. పాతికేళ్ళకు పైగా ఈ పరిశ్రమలో లీనమై అనేక ఆటుపోట్లను స్వయంగా పరిశీలించారు. ఒక స్థానిక కేబుల్  ఆపరేటర్ గా ప్రారంభమై, అద్భుతమైన సేవల ద్వారా చందాదారుల అభిమానం చూరగొంటూ తన నెట్ వర్క్ ను విస్తృతం చేయగలిగారు. ఆయన కష్టపడే తత్వం,  అంకితభావం సానుకూల ఫలితాలివ్వటంతో మల్టీ సిస్టమ్ ఆపరేటర్ (ఎమ్మెస్వో) గా మారి చందాదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగారు.
ప్రస్తుతం తెలంగాణలో అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్స్ లో ఒకటైన బ్రైట్ వే కమ్యూనికేషన్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటూ అత్యాధునిక ఫీచర్లతో కూడిన డిజిటల్ హెడ్ ఎండ్ నిర్వహిస్తున్నారు. కేబుల్ పరిశ్రమ ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ స్థానిక ఆపరేటర్లు, ఎమ్మెస్వోల సంక్షేమం కోసం కృషిచేస్తారు. ఆ విధంగా ఏర్పడిన సుహృద్భావ వాతావరణంలో అందరినీ కలుపుకుపోవటం ఆయన స్వభావం. ఆపరేటర్ల, ఎమ్మెస్వోల ప్రయోజనాలు కాపాడటానికి అవసరమైతే బ్రాడ్ కాస్టర్లతో పోరాటానికి వెనుదీయని నైజం ఆయన సొంతం.
తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత డిజిటైజేషన్ సమయంలో పరిశ్రమకోసం ఎంతగానో కృషి చేశారు. ఆపరేటర్లు, ఎమ్మెస్వోల క్షేత్రస్థాయి సమస్యలు దృష్టిలో ఉంచుకొని కోర్టులకు సైతం వెళ్ళి విజయాలు సాధించి తెచ్చిపెట్టిన ఘనత ఆయనది. సమస్యలను సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయటం కోసం వినతి పత్రాలు అందజేయటం, వాటి పరిష్కారానికి కృషి చేసి పరిశ్రమ లబ్ధిపొందేలా చూడటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం.
పరిశ్రమ భాగస్వాములకు తాజా పరిణామాల పట్ల అవగాహన ఉందాలన్న సదుద్దేశంతో శ్రీ సుభాష్ రెడ్డి దాదాపు ఐదేళ్ళకిందట కేబుల్ సమాచారమ్ అనే మాస పత్రికకు శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లకు పైగా ఆ పత్రికను నడిపిన మీదట సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే పత్రిక స్థానంలో ఈ-మాగజైన్ కు రూపకల్పన చేశారు. వేగవంతమైన డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చారు.
శ్రీ సుభాష్ రెడ్డి ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోని ఉదాత్త స్వభావి. ఏ మాత్రం సమయం దొరికినా తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ సేదతీరటం ఆయన ప్రవృత్తి. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపన కారణంగానే ఆయన ఒక ట్రస్టు ఏర్పాటుచేసి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. తాను చదువుకున్న స్కూలుకు సౌకర్యాలు కల్పిస్తూ ఏటా అక్కడి విద్యార్థులలో చైతన్యం తీసుకు రావటం ఒక అలవాటుగా తయారైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న పోలీసులకోసం శానిటైజర్ స్టాండ్స్ పంపిణీ చేయటం, విద్యార్థులకు చదువు నిలిచిపోకూడదన్న సదుద్దేశంతో రెండు చానల్స్ ను  స్కూళ్ళకోసం కేటాయించి ఇంటింటికీ పాఠాలు అందేలా చూడటం లాంటి పనులు ఆయనకు సమాజం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనాలు.
తోట భావనారాయణ, వార్తాంశాల సమన్వయకర్త
మీడియా వ్యవహారాలలో అనుభవజ్ఞుడైన తోట భావనారాయణ గత ముప్పయ్యేళ్ళకాలంలో అనేక మీడియా సంస్థల్లో పనిచేశారు. పత్రికలు, టీవీ, డిజిటల్ రంగాల్లో పనిచేసిన ఆయన  కేబుల్ సమాచారమ్ ఈ-మాగజైన్ కు వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు అందించే వారిలో ఒకరు. ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీ సుభాష్ రెడ్ది సూచనల మేరకు కేబుల్ రంగానికి అవసరమైన అంశాలను ఎంపిక చేసి కథనాలుగా మార్చటంలో ఆయనకు సహకారం అందిస్తారు. గతంలో కేబుల్ సమాచారమ్ పత్రికకు పనిచేసిన అనుభవాన్నే ఇప్పుడు డిజిటల్ వేదికకూ కొనసాగిస్తున్నారు.
జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన భావనారాయణ ఆంధ్రప్రభతో మీడియా కెరీర్ ప్రారంభించారు.  రిపోర్టర్ గా, ఉప సంపాదకునిగా పనిచేసిన తరువాత వార్త దినపత్రిక ఆరంభకాలంలో చెన్నై లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తూ సన్ నెట్ వర్క్ వారి తెలుగు చానల్ జెమినీ టీవీలో వార్తా విభాగం ప్రారంభమైనప్పుడు అందులో చేరి చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సత్య టీవీలోను, మా టీవీ లోను, హెచ్ ఎం టీవీ ( అప్పట్లో టి చానల్) లోను పనిచేశారు. లోకల్ టీవీ లోను, మేఘా ఇంజనీరింగ్ వారి ఆర్టీసీ మీడియా ప్రాజెక్టులోను పనిచేశాక తులసి టీవీ చీఫ్ ఎడిటర్ గా కూడా కొంతకాలం ఉన్నారు. 10 టీవీ ( తెలుగు), పుదియ తలైమురై ( తమిళం), ఇంద్రధనుష్ (కన్నడ) చానల్స్ కు కన్సల్టెంట్ గా పనిచేశారు.
ఈ రంగంలో తొలినాళ్లలో పనిచేసిన  అనుభవంతో టెలివిజన్ జర్నలిజం అనే పుస్తకం రాశారు. ఆ  తరువాత శ్రీ సుభాష్ రెడ్ది గారిప్రోత్సాహంతో కేబుల్ టీవీ డిజిటైజేషన్ అనే పుస్తకం కూడా రాశారు. ఉస్మానియా విశ్వ విద్యాల్కయంలోను, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోను జర్నలిజం శాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా ఉన్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కోర్సులకు పాఠాలు రాశారు.

RNI No. TEL BIL / 60362/2014

Postal Reg.No : H/SD/493/2018-20