కేబుల్ దెబ్బకు దిగివచ్చిన ‘డిస్నీ స్టార్’

0
13633

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కాకముందే జియో, డిస్నీ స్టార్ మధ్య పోటీ మొదలైంది. డిజిటల్ ప్రసార హక్కులు సొంతం చేసుకున్న జియో ఈ క్రికెట్ ప్రసారాలతో ఎక్కువమంది ప్రేక్షకులను చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. అదే సమయంలో టీవీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి డిస్నీ స్టార్ కూడా విశ్వ ప్రయత్నం చేసింది.
ఇరు పక్షాలూ ప్రమోషన్ కోసం హాలీవుడ్ తారలను, క్రికెట్ ఆటగాళ్లను రంగంలో దించాయి. టీవీలో ఐపీఎల్ చూడవలసిందిగా స్టార్ తరఫున రణవీర్ సింగ్, అజయ్ దేవ్ గణ్ , విరాట కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పటేల్ రంగంలో దిగారు. డిజిటల్ లో చూడమంటూ జియో తరఫున సచిన్, ధోనీ, సూర్యకుమార్ యాదవ్ ప్రచారం హోరెత్తించారు.
ఇలా మొదటిసారిగా రెండు వేదికల మీద వేరువేరుగా ఐపీఎల్ ప్రసారం కావటం, ఐపీఎల్ హక్కుల కోసం భారీ మొత్తాలు పెట్టుబడిన రెండు సంస్థలూ పోటీ పడటం ఆసక్తికరంగా తయారైంది. డిజిటల్ హక్కులు స్టార్ పరిధి దాటిపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి గట్టి పోటీ వలన మొత్తంగా ప్రేక్షకాదరణ కూడా పెరిగింది. ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులోకి రావటం మరో కారణం. గతంలో పురుష ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకున్న ఐపీఎల్ ఇప్పుడు మొత్తం కుటుంబాలనే ఆకట్టుకోగలుగుతోంది.
ఇలా ఉండగా డిస్నీ స్టార్ ను దెబ్బకొట్టటానికి జియో తన ప్రయత్నాలు ప్రారంభించింది. తన పెట్టుబడులున్న హాత్ వే, జీటీపీఎల్, డెన్ సంస్థల ద్వారా డిస్నీ స్టార్ ను హెచ్చరించింది. ధర తగ్గించకపోతే డిస్నీ స్టార్ చానల్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ ఎమ్మెస్వోలు తేల్చి చెప్పారు. దాదాపు 3 కోట్ల కనెక్షన్లున్న మూడు పెద్ద ఎమ్మెస్వోలు స్టార్ కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ధరలు మార్చటానికి స్టార్ సిద్ధం కావటం తన విజయంగా జియో భావిస్తోంది. అదే విధంగా, అదను చూసి స్టార్ మెడలు వంచగలిగామని కేబుల్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. మొత్తంగా ఎన్టీవో 3.0 నుంచి మొదలైన పోరులో పాక్షికంగానైనా కేబుల్ రంగానికి ఇది విజయమే.
అయితే, స్టార్ మాత్రం దీన్ని ఇంకో విధంగా చూస్తోంది. వేలకోట్లు పోసి హక్కులు కొనుక్కున్నప్పుడు ప్రేక్షకాదరణకు పెద్దపీట వేయాలన్నది. అందుకే, ఎక్కడ తగ్గాలో తెలిసి జాగ్రత్తపడింది. ప్రారంభానికి ముందు ప్రసారం చేసిన కార్యక్రమాలకు నిరుటితో పోల్చుకుంటే 142% ప్రేక్షకాదరణ లభించినట్టు స్టార్ ప్రకటించింది.
అదే సమయంలో జియో కూడా మొదటిరోజునే 2.5 కోట్లమంది జియోసినిమా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రకటించింది. మొదటిరోజునే వ్యూస్ 50 కోట్లు దాటినట్టు కూడా వెల్లడించింది. అయితే కొన్ని సార్లు బఫరింగ్ సమస్య ఎదుర్కున్నట్టు, యాప్ క్రాష్ అయినట్టు ఫిర్యాదులు రాగా, అలాంటి పరిస్థితి ఏర్పడినందుకు చింతిస్తున్నట్టు జియో స్పందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here