రిపబ్లిక్ భారత్ కు బ్రిటిష్ నియంత్రణ సంస్థ జరిమానా

0
518

బ్రిటిష్ టీవీ నియంత్రణా సంస్థ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఆఫ్ కామ్) రిపబ్లిక్ టీవీ హిందీ చానల్ రిపబ్లిక్ భారత్ కు 20 వేల పండ్లు ( భారత కరెన్సీలో సుమారు రూ.20 లక్షలు) జరిమానా విధించింది. నిరుడు సెప్టెంబర్ 6న ప్రసారమైన ఒక కార్యక్రమంలో అసహనం ప్రదర్శిస్తూ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకు రిపబ్లిక్ భారత్ కు ఈ శిక్ష విధిస్తున్నట్టు స్పష్టం చేసింది.
రిపబ్లిక్ భారత్ లో సాయంత్రం పూట ప్రైమ్ టైమ్ లో పూఛ్ తా హై భారత్ పేరుతో ఆర్ణబ్ గోస్వామి తాను నిర్వహించే కార్యక్రమంలో తమ దేశ బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించటం వల్లనే ఈ చర్య తీసుకుంటున్నట్టు పేర్కొంది. అభ్యంతరకరమైన భాష వాడటం, పాకిస్తాన్ మీద, ఆ దేశ ప్రజలమీద చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేటట్టు ఉండటం మీద బ్రిటన్ లో ప్రజలనుంచి ఎన్నో పిర్యాదులు కూడా వచ్చినట్టు ఆఫ్ కామ్ వెల్లడించింది.
భారతదేశపు చంద్రయాన్ గురించి చెబుతూ పాకిస్తాన్ ను అవహేళన చేయటం విమర్శలకు దారితీసినట్టి ఆఫ్ కామ్ చెప్పింది.పాకిస్తాన్ ప్రజలను వారి జాతీయత ఆధారంగా ఎగతాళి చేయటం తమ దేశపు సమానత్వ చట్టం, 2010 ప్రకారం నేరమని ఆఫ్ కామ్ ఈ సందర్భంగా ఉటంకించింది. అలాంటి వ్యాఖ్యలు చేయటం అక్కడ ఉండే భారతీయులకు సైతం ఇబ్బందికరమని భావిస్తున్నట్టు బ్రిటిష్ నియంత్రణా సంస్థ అభిప్రాయపడింది.
ప్రజలనుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులను పరిశీలించిన మీదట ఈ చానల్ ను ఇంగ్లండ్ లో ప్రసారం చేస్తున్న వరల్డ్ వ్యూ మీడియా నెట్ వర్క్ లిమిటెడ్ ను కూడా హెచ్చరించినట్టు ఆఫ్ కామ్ చెప్పింది. బ్రాడ్ కాస్టింగ్ నియమావళిని ఉల్లంఘించటం వల్లనే ఈ జరిమానా విధించినట్టు స్పష్టం చేసింది. ఈ జరిమానా విషయాన్ని కూడా వరల్డ్ వ్యూ మీడియా ప్రసారం చేయాలని ఆఫ్ కామ్ ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here