గతం మరచిన జెమినీ : కేబుల్ వ్యవస్థ ధ్వంసానికి సిద్ధం

0
1696

తొలి తెలుగు శాటిలైట్ చానల్ జెమినీ ఈ మధ్యనే 28 వ జన్మదినం పూర్తి చేసుకుంది. దాదాపు 20 ఏళ్లపాటు నెంబర్ వన్ స్థానంలో ఉంది. సన్ టీవీ యాజమాన్యం తన ప్రధాన చానల్ సన్ టీవీని పే చానల్ గా మార్చక ముందే జెమినీ, తేజా టీవీ చానల్స్ ను పే చానల్స్ చేసింది. అప్పుడు కేబుల్ పరిశ్రమ అండగా నిలిచి ప్రజలను ఒప్పించి కోట్లాది రూపాయల చందాలు వసూలు చేసి ఇచ్చింది. కేబుల్ ఆపరేటర్ల అంకిత భావాన్ని, తెలుగు ప్రజల అభిమానాన్ని అలా సొమ్ము చేసుకున్న సన్ యాజమాన్యం ఇప్పుడు అదే కేబుల్ వ్యవస్థను ధ్వంసం చేయటానికి పూనుకుంది. తన సన్ డైరెక్ట్ అనే డీటీహెచ్ వ్యవస్థ ద్వారా చౌక ధరల పాకేజ్ లు ప్రకటించి ప్రజలను ఊరిస్తోంది. కేబుల్ చందాదారులకు వల వేసి తాత్కాలిక తగ్గింపు ధరలు చూపి కేబుల్ రంగాన్ని శాశ్వతంగా దెబ్బతీయటానికి రంగంలో దిగింది. ‘ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగిన తరువాత బోడి మల్లయ్య ‘ అన్నట్టు కేబుల్ ఆపరేటర్ల సాయంతో ఎదిగి ఇప్పుడు ఆ వ్యవస్థను నీరుగారచి, కేబుల్ పరిశ్రమ మీద ఆధారపడినవారిని వీధిపాలు చేయటానికి సన్ గ్రూప్ సిద్ధమైంది.

డబ్బింగ్ సీరియల్స్ ఇచ్చినా, ప్రజలకు నచ్చజెప్పి చానల్ ఎదుగుదలకు సహాయపడింది కేబుల్ పరిశ్రమ. పే చానల్ చేసినా సహకరించింది కేబుల్ పరిశ్రమ. ఆపరేటర్లకు అందరికీ జెమినీ, తేజా సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపరేటర్ల మధ్య గొడవలు పెట్టి, ఎక్కువ కనెక్టివిటీ డిక్లేర్ చేయించి, సగం మంది కేబుల్ ఆపరేటర్లు ఈ వ్యాపారాన్ని వదులుకునేట్టు చేసింది కూడా సన్ యాజమాన్యమే. చందాదారులనుంచి అరకొర వసూలైనా జెమినీ. తేజా టీవీకి మాత్రం లేని కనెక్టివిటీకి కూడా డబ్బు కట్టి వ్యాపారం నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి రావటం కేబుల్ ఆపరేటర్లందరికీ అనుభవమే.

అయితే, ఆ తరువాత కాలంలో కార్యక్రమాల నాణ్యత పెంచుకోలేకపోవటం జెమినీ టీవీ వెనుకబడుతూ వచ్చింది. కన్నాడలో ఉదయా టీవీది, మలయాళంలో సూర్యాటీవీదీ అదే పరిస్థితి. చివరికి తమిళంలో సన్ టీవీకి కూడా ఈ మధ్య కాలంలో స్టార్ విజయ్ నుంచి గట్టిన పోటీ కనబడుతూనే ఉంది. తెలుగులో జెమినీ టీవీ అయితే ఆరో స్థానానికీ దిగజారింది. తాజా రేటింగ్స్ గమనిస్తే వరుసగా రాంకుల పరంగా స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్ తరువాత ఆరో స్థానంలో జెమినీ మెయిన్ చానల్ ఉంది.

అయినా సరే, తన జెమినీ బొకే ధర పెంచి చందాదారులకు అంటగట్టటానికి సన్ యాజమాన్యం ఎంతమాత్రమూ వెనకడటం లేదు. ఒకవైపు కేబుల్ ఆపరేటర్ల ద్వారా తన బొకేలను ప్రజల్లోకి పంపి చందా వసూలు చేసి ఇవ్వాలని కేబుల్ ఆపరేటర్లను కోరుతూనే ఇంకోవైపు కేబుల్ ఆపరేటర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తూ సన్ యాజమాన్యం గోతులు తవ్వుతోంది. సన్ డైరెక్ట్ పాకేజీల పేరుతో చందాదారులకు డిస్కౌంట్ ఎర వేసి లాక్కోవాలని తాత్కాలికంగా తక్కువ ధరలకు ఇవ్వజూపుతున్నది.

ఇలాంటి బూటకపు డిస్కౌంట్లకు ఆకర్షితులు కాకుండా చందాదారులకు నచ్చజెప్పాల్సిన బాధ్యత కేబుల్ ఆపరేటర్లమీద ఉంది. అప్పుడే కేబుల్ ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని కాపాడుకోగలుగుతారు. అదే విధంగా సన్ యాజమాన్యపు అడ్డగోలు ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే జెమినీ బొకే లేకుండా చందాదారులకు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే ఆరో స్థానంలో ఉన్న చానల్ కాబట్టి జనం కూడా ఆడగారు. ఇది సన్ యాజమాన్యానికి తెలియాలంటే వాళ్ళ జెమినీ బొకేని ప్రచారం చేయకూడదు. చూడని చానల్స్ కు చందా కట్టనక్కర్లేదని చందాదారులకు నచ్చ జెప్పాలి. సన్ యాజమాన్యం దిగివచ్చి సన్ డైరెక్ట్ పాకేజీల పేరుతో కేబుల్ వ్యవస్థను దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన అవసరం కేబుల్ ఆపరేటర్ల మీద ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here