టీవీలో ప్రకటనలమీద నియంత్రణ లేదా?

0
619

టీవీల్లో మనం రకరకాల అడ్వర్టయిజ్మెంట్లు చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు మనలో చాలామందికి రకరకాల అనుమానాలు రావటం సహజం. విసుగుపుట్టేంత ఎక్కువ సేపు వస్తున్నప్పుడు వీటికి అడ్డూ అదుపూ ఉండదా అని అనుమానం రావచ్చు. మరికొన్ని సార్లు మనల్ని నమ్మించటానికి అతిగా చెబుతున్నారనే అనుమానం రావచ్చు. పే చానల్స్ వాళ్ళు మన దగ్గర నెలకి ఇంత అని చందా తీసుకుంటున్నప్పుడు మళ్ళీ మన మీద ఈ అడ్వర్టయిజ్మెంట్స్ రుద్దటం ఏంటనే ప్రశ్న కూడా రావచ్చు. ఇదంతా ఒక వంతయితే, మనల్ని తప్పుదారిపట్టించే ప్రకటనలు మరికొన్ని. అలాంటి ప్రకటనలను నియంత్రించటానికి అవకాశం ఉందా, వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చా, ఎలాంటి చర్యలుంటాయి అనేవి సహజంగానే వచ్చే అనుమానాలు. వీటికి సమాధానాలు పరిశీలించాలి.
ఏదైనా వస్తువు గాని, సేవగాని ప్రజల్లోకి వెళ్ళి అమ్ముడుపోవాలంటే ముందుగా దాని గురించి ప్రజలకు తెలియాలి. తెలిసిన తరువాత నమ్మకం కలిగితే కొనటం మొదలవుతుంది. ఎంత ఎక్కువమంది కొంటే అంత ఎక్కువ లాభం కాబట్టి ప్రజలకు తెలియజేయటానికి వీలున్న మార్గాలన్నిటినీ అమ్మకందారులు వెతుక్కుంటారు. అది టీవీ కావచ్చు, పత్రిక కావచ్చు, వాల్ పోస్టర్ కావచ్చు, హోర్డింగులు కావచ్చు, ఆటోలు, బస్సులు, రైళ్ళు లాంటి ప్రయాణ సాధనాలు కావచ్చు. ఎక్కడ జనం కళ్ళు పడతాయో అక్కడ ప్రచారం కోసం ప్రయత్నించటం మామూలైపోయింది. రోజుకు సగటున్న మూడున్నర గంటల సేపు మనం ఇంట్లో టీవీ ముందు కూర్చుంటాం కాబట్టి టీవీలో ప్రకటనలివ్వటానికి పోటీ పడేవాళ్లు బాగానే ఉంటారు.
టెలివిజన్ అనేది మనకు వినోదం, సమాచారం, విజ్ఞానం అందించే ఒక సాధనం. వాటి ద్వారా మనల్ని ఆకర్షించి మనకు టీవీ ఒక బలహీనతగా మార్చి అప్పుడు మెల్లగా మనకు మధ్యమధ్యలో ప్రకటనలు చూపించి ఆదాయం పొందటం టీవీల పని. అయితే, కొన్ని సార్లు మరీ మనకు విసుగుపుట్టేంతగా యాడ్స్ వేస్తూ ఉండటం కూడా గుర్తుండే ఉంటుంది. చివరికి అది ఎలా తయారైందంటే అసలు మనం ప్రోగ్రామ్స్ మధ్య యాడ్స్ చూస్తున్నామా, యాడ్స్ మధ్య ప్రోగ్రామ్స్ చూస్తున్నామా అని అనుమానించే దాకా వెళ్ళింది. అలా అని చానల్ మారిస్తే అక్కడా ఇదే పరిస్థితి కనబడేది. ఈ పరిస్థితుల్లో 2012 లో ట్రాయ్ చైర్మన్ గా వచ్చిన రాహుల్ ఖుల్లర్ అప్పటికే యాడ్స్ మీద ఉన్న పరిమితిని అమలు చేయటానికి పూనుకున్నారు.
నిబంధనల ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాలపాటు వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాలపాటు సొంత కార్యక్రమాల గురించి ప్రేక్షకులకు తెలియజేసే ప్రకటనలు వేసుకోవచ్చు. దీన్నే స్థూలంగా 10+2 రూల్ అని పిలుచుకుంటారు. దీన్ని చానల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. అయితే, ఇక్కడే చానల్స్ అతి తెలివి ప్రదర్శించాయి. గంటకు 12 నిమిషాల అవకాశం ఇచ్చారు కాబట్టి 24 గంటలకు 288 నిమిషాలపాటు యాడ్స్ వేసుకోవచ్చునని అర్థం చెప్పుకున్నాయి. అందుకే ప్రైమ్ టైమ్ లో యాడ్స్ సమయం ఎక్కువ సేపు వాడుకొని అర్థరాత్రి దాటాక జనం చూడని సమయంలో తక్కువ యాడ్స్ లెక్కచూపటం మొదలుపెట్టాయి.
ఇది గమనించిన ట్రాయ్ మరింత స్పష్టంగా ఆదేశించి ఏ గంటకు ఆ గంట 10+2 నియమం వర్తిస్తుందని, రోజు మొత్తానికి కాదని చెప్పింది. దీని ప్రకారం అరగంట ఎపిసోడ్ లో కనీసం 24 నిమిషాల పాటు ప్రోగ్రామ్ రావాల్సిందే. కానీ యాడ్స్ వేసుకోవటం మా హక్కు, మా వ్యాపారానికి అవసరం కాబట్టి ట్రాయ్ జోక్యం చేసుకోవటానికి వీల్లేదు అని కొన్ని చానల్స్ కోర్టుకెళ్లాయి. దీనిమీద స్టే వచ్చింది.
అయితే, ఈ లోపు ప్రతి రోజూ ఏ చానల్స్ ఈ నియమాన్ని ఉల్లంఘించి ఎంత సేపు ప్రకటనలు వేస్తున్నాయో నెలనెలా జాబితాలు విడుదల చేయటం మొదలుపెట్టింది ట్రాయ్. సరిగ్గా ఆ సమయంలో ముందుగా జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ముందుకొచ్చి కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా 10+2 నిబంధనకు కట్టుబడి ఉంటామని చెప్పింది. అలా తక్కువ యాడ్స్ వస్తుంటే ప్రేక్షకులు అటువైపు వెళ్ళే అవకాశం ఎక్కువ కాబట్టి మిగిలిన ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా తప్పనిసరిపరిస్థితుల్లో ఈ రూల్ కి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. అందువలన ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ గంటకు 10 నిమిషాల వాణిజ్యప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రకటనలకు పరిమితమయ్యాయి.
కానీ న్యూస్ చానల్స్ మాత్రం ఈ నియమాన్ని పాటించటం లేదు. వీళ్ళ ప్రధానమైన వాదన ఏంటంటే, అత్యధికశాతం ఎంటర్టైన్మెంట్ చానల్స్ పే చానల్స్ కాబట్టి వాటికి ప్రేక్షకులు నెలవారీ చందా కడతారు.ఆ విధంగా వాటికి యాడ్స్ మీద ఆదాయంతోబాటు చందా ఆదాయం వస్తుంది, న్యూస్ చానల్స్ లో 95% చానల్స్ ఫ్రీ చానల్స్ కాబట్టి యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మీదనే బతకాలి. అందువలన “ మాకు ఈ రూల్ నుంచి మినహాయింపు ఇవ్వండి. యాడ్స్ ఎక్కువైతే జనం ఇంకో చానల్ కు మారతారు కదా, జనం అలా వెళ్లిపోకుండా ఎంత వరకు యాడ్స్ ఇవ్వాలనే విషయం మాకు తెలుసుగదా ?” అని ట్రాయ్ ని ప్రశ్నిస్తూ న్యూస్ చానల్స్ కూడా కోర్టుకెళ్ళాయి. ప్రభుత్వం కూడా న్యూస్ చానల్స్ కోరికను పరిశీలిస్తున్నట్టు కోర్టుకు చెప్పింది. ఎనిమిదేళ్ళు దాటినా ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.
సరే, న్యూస్ చానల్స్ కు యాడ్స్ ద్వారా వచ్చేదే ఆదాయం కాబట్టి వాటి సంగతలా ఉంచితే మన దగ్గర చందా తీసుకునే ఎంటర్టైన్మెంట్ చానల్స్ మళ్ళీ యాడ్స్ తో విసిగించటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న వస్తుంది. ఈ మధ్య చానల్స్ చందారేట్లు పెంచినప్పుడు కూడా యాడ్స్ వేసే పే చానల్స్ ను బహిష్కరిస్తామంటూ తాత్కాలికంగా పుట్టుకొచ్చిన టీవీ ప్రేక్షకుల సంఘాలు నానా హడావిడి చేశాయి. కానీ సామాన్య ప్రేక్షకులు ఆ అరుపులను పట్టించుకోలేదు. దీన్ని మనం రెండు వైపులనుంచీ చూడాలి. కేవలం యాడ్స్ మీద వచ్చే ఆదాయం గాని కేవలం చందాల ద్వారా వచ్చే ఆదాయంతోగాని చానల్స్ తమ ఖర్చులన్నీ రాబట్టుకోవటం సాధ్యం కాదన్నది నిజం. పదేళ్ల కిందట ఒక్కో కార్యక్రమం ఏపాటి నాణ్యతతో ఉండేది, ఇప్పుడెలా ఉంటున్నది అనేది గమనిస్తే కచ్చితంగా ఖర్చులు పెరిగాయని అర్థమవుతుంది. అంతమాత్రాన అడ్డగోలుగా రేట్లు పెంచవద్దని ప్రేక్షకుల తరఫున ట్రాయ్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.
టీవీ యాజమాన్యాలు చెప్పే ఇంకో విషయమేంటంటే “చందాలు, యాడ్స్ తీసుకోవటం టీవీ చానల్స్ కు మాత్రమే కొత్త కాదని, పత్రికలు కూడా ధరపెట్టి కొనుక్కుంటూనే అందులో యాడ్స్ కూడా పాఠకులు భరిస్తున్నారు కదా, టీవీ విషయంలో అభ్యంతరం చెబితే ఎలా? ”అనేది వాళ్ళ ప్రశ్న. అయితే, దీనికి కూడా జనం వైపు నుంచి సమాధానం ఉంది. పత్రికలో యాడ్ కనిపిస్తే అది చదవటానికి అడ్డంరాదు. చదవాల్సిందే చదువుతాం. కానీ టీవీ అయితే ఆ యాడ్ పూర్తయ్యేదాకా వేచి ఉండక తప్పదు. అందువలన టీవీ యాడ్ కచ్చితంగా మన సమయాన్ని వాడుకుంటుంది కాబట్టి ఇబ్బందికరమే. ఈ విధంగా చూసినప్పుడు టీవీకీ, పత్రికకూ తేడా ఉంది.
ఏమైనా, టీవీ చానల్స్ లో యాడ్స్ ఎంత సేపు రావచ్చునో పరిమితి పెట్టే అధికారం మాత్రమే ప్రభుత్వానికి లేదా నియంత్రణ సంస్థ అయిన ట్రాయ్ కి ఉంది తప్ప అసలు యాడ్స్ అనేవి ఉండకూడదని చెప్పే హక్కులేదు. యాడ్స్ విసిగిస్తున్నాయనుకున్నప్పుడు ఎలాగూ మనం రిమోట్ కి పనిచెప్పి పక్క చానల్స్ వైపు వెళుతున్నాం. పూర్తిగా యాడ్స్ లేని చానల్స్ రావాలనుకుంటే కనీసం రెట్టింపు నెలవారీ చందా కట్టటానికి మనం సిద్ధం కావాల్సిందే. బహుశా అలాంటి అవకాశం ముందు ముందు రావచ్చు. అప్పటిదాకా యాడ్స్ ఎంత సేపు వచ్చినా భరించాల్సిందే. లేదంటే రిమోట్ కి పనిచెప్పి ఇంకో చానల్ వైపు వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అరగంటకు రెండు సార్లు బ్రేక్ ఇచ్చే క్రమంలో కాస్త అటూ ఇటుగా అన్ని చానల్స్ లో యాడ్స్ ఒకే సారి ప్రసారమవుతాయి. అందువలన తప్పించుకునే అవకాశం చాలా తక్కువ.
ఇక ప్రకటనల తీరుతెన్నులు ప్రజలను తప్పుదారిపట్టించేలా ఉండటం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది. మూఢనమ్మకాలను పెంచిపోషించేవి కొన్నయితే, వాస్తవదూరమైన అంశాలతో ప్రలోభానికి గురి చేసేవి మరికొన్ని. మోసపూరితమైన ప్రకటనలు, పోటీ సంస్థలను కించపరచటం ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకునే ప్రకటనలు, అతిశయోక్తులతో నమ్మించటానికి ప్రయత్నించి ప్రేక్షకులను మోసపుచ్చేవి ఇంకొన్ని. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ చట్టం ప్రకారం కార్యక్రమాలు, ప్రకటనలు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అలా కట్టుబడని పక్షంలో చర్య తీసుకోవటానికి అవకాశముంది.
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ అనే సంస్థ సిబ్బంది అన్ని చానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను, ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. వాటిలో నియమాల ఉల్లంఘన జరిగినట్టు అనుమానం వస్తే నిశితంగా పరిశీలించిన మీదట మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువస్తారు. దీన్ని అంతర్-మంత్రిత్వశాఖల కమిటీ పరిశీలించిన తరువాత తప్పని తేలితే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించటం, క్షమాపణలు చెప్పించటం తదితర శిక్షలు విధించే అవకాశముంటుంది.
నిజానికి అడ్వర్టయిజర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల మీద ప్రభుత్వ నియంత్రణకంటే వాటికి అవే స్వీయనియంత్రణకు చొరవ తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఆ విధంగా 1985లో అడ్వర్టయిజింగ్ స్టాండర్ద్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అనే సంస్థ ఏర్పాటైంది. ప్రకటనల్లో నిజాయితీ ఉండాలని, ప్రజలను తప్పుదారి పట్టించకూడదని, ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రచారం చేయకూడదని, పోటీదారుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలని ఈ సంస్థ నియమాలు చెబుతున్నాయి.
వీటిని ఉల్లంఘించినట్టు భావిస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా 7710012345 నెంబర్ కు, మెయిల్ ద్వారా contact@ascionline.org కి ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా ప్రకటన ప్రాథమికంగా నియమాలను ఉల్లంఘిస్తున్నట్టు. ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే దాని ప్రసారం నిలిపివేయాలని ఆ ప్రకటన ప్రసారం చేయిస్తున్న సంస్థను, ప్రసార మాధ్యమాన్ని ఆదేశించవచ్చు. కన్స్యూమr కంప్లెయింట్స్ కౌన్సిల్ (సిసిసి) 30 రోజుల్లోగా తుది నిర్ణయం ప్రకటిస్తుంది.
2020-21 ఆర్థిక సంవత్సరపు మూడో త్రిమాసికం ( అక్టోబర్-డిసెంబర్ 2020) లో 1230 ప్రకటనలమీద 1885 ఫిర్యాదు వచ్చినట్టు ఆస్కీ తెలియజేయగానే 251 ప్రకటనలను ఉపసంహరించుకోవటమో, సవరించుకోవటమో జరిగింది. 902 కేసులలో తప్పు తేలింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో 582 ప్రకటనలు విద్యారంగానికి సంబంధించినవి కాగా 128 ఆరోగ్యరంగానికి సంబంధించినవి. ఆహారం, శీతలపానీయల ప్రకటనలు 64, మిగిలిన 124 వివిధ రకాలకు చెందినవి. 81 ప్రకటనలు మాత్రమే నిబంధనలు ఉల్లంఘించలేదని తేలింది. తప్పుతేలిన కేసులలో వినియోగదారులనుంచి వచ్చిన ఫిర్యాదులు 51 మాత్రమే ఉండగా ఆస్కీ సుమోటోగా తీసుకున్నవి 845. దీన్నిబట్టి వినియోగదారుల చైతన్యం నామమాత్రంగానే ఉన్నట్టు అర్థమవుతోంది.
ఎక్కువమందికి అందుబాటులో ఉండే మాధ్యమం కాబట్టి టీవీలో ప్రకటనలివ్వటానికి, వాటి ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవటానికి సంస్థలు పెద్దమొత్తాల్లో ఖర్చు చేస్తూనే ఉంటాయి. ఆ క్రమంలో హద్దుమీరుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండి ఫిర్యాదు చేయటం ద్వారా మిగిలిన వినియోగదారులను కూడా కాపాడటం సమాజంలోని అందరి బాధ్యత. అదే సమయంలో ఏదైనా ప్రకటన అలా హద్దుమీరిందనో, అనైతికంగా ఉన్నదనో తేలినప్పుడు కేవలం ప్రకటనను ఉపసంహరించటం లాంటి శిక్షతో సరిపెట్టకుండా, ఆ సంస్థ ప్రకటనలమీద కొంత కాలమైనా నిషేధం విధించటం లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అన్ని సంస్థలూ అప్రమత్తంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల ప్రకటనలలోనే తప్పుదారిపట్టించే ప్రకటనలు ఎక్కువగా ఉండటం సమాజానికి మరింత ప్రమాదకరం.

  • తోట భావనారాయణ ( సౌజన్యం: నమస్తే తెలంగాణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here