సన్ నెట్వర్క్ కథ రెండో భాగం

0
187

సన్ సామ్రాజ్యం: మిత్రులు శత్రువులైన వేళ

సన్ నెట్వర్క్ తొలిదశ ఎదుగుదలలో శరద్ కుమార్, కళానిధి మారన్ ఇద్దరిదీ దాదాపు సమానమైన పాత్ర. ఎప్పుడు కొత్త కార్లు కొన్నా, ఒకే మోడల్. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఆస్తిపరుడైన శరద్ ఎంత పెట్టుబడి పెట్టిందీ అప్పటి మిత్రులకు బాగా తెలుసు. అయితే, రాజకీయ కుటుంబం కావటం వల్ల సహజంగానే మారన్ కు ఎక్కువ పేరొచ్చింది. జెమిని (తెలుగు), ఉదయ (కన్నడ) కూడా వచ్చి చేరాక ఆ రెండు చానల్స్ బాధ్యత శరద్ కుమార్ కి అప్పగించారు. గ్రూప్ లో భాగమే అయినా, వాటికి ఎండీగా వ్యవహరించింది శరద్ కుమార్. సన్ టీవీ వ్యవహారాలు, ఆ తరువాత ప్రారంభించిన సూర్య (మలయాళం) చానల్ బాధ్యతలు కళానిధి మారన్ చూసేవారు. సన్ టీవీకి చాలా పెద్ద టీమ్ ఉండేది. వాళ్ళంతా కళానిధికి, శరద్ కి స్నేహితులే అయినా మారన్ టీమ్ అనే అనుకోవాలి. దీనికి కారణం జెమినీ, ఉదయా చానల్స్ కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరులో జరుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రమే చెన్నైలో ఉండేది. ఆ విధంగా చెన్నై నుంచే శరద్ ఆ రెండు చానల్స్ నూ మానిటర్ చేసేవారు.

తెలుగులో ఈటీవీ, కన్నడలో ‘ఈటీవీ కన్నడ’ నెంబర్ వన్ చానల్స్ గా ఉన్నరోజుల్లో జెమినీ, ఉదయా పగ్గాలు తీసుకున్న శరద్ కుమార్ ఏడాదిలోనే వాటిని నెంబర్ వన్ స్థానంలోకి తీసుకు రాగలిగారు. అది సంతోషించాల్సిన విషయమే అయినా ఒక సారి జెమినీ రేటింగ్స్, సన్ టీవీని కూడా మించి పోవటం సన్ టీమ్ తట్టుకోలేకపోయింది. కళానిధి మారన్ తన టీమ్ ని చనువుతోనే మందలించారు. సన్ టీవీ, జెమినీ టీవీ రేటింగ్స్ ను పోల్చే గ్రాఫ్ ను జెమినీ ప్రోగ్రామింగ్ హెడ్ తన డెస్క్ టాప్ స్క్రీన్ మీద పెట్టుకోవటం ఆ టీమ్ కు పుండుమీద కారం చల్లినట్టయింది. ఆలా మొదలైన ఈర్ష్య చివరికి ఆ ప్రోగ్రామింగ్ హెడ్ జెమినీ టీవీని వదిలి వెళ్ళేట్టు చేసింది.

ఆలా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సన్ నెట్ వర్క్ చానల్స్ తిరుగులేని నెంబర్ వన్ స్థానాల్లో ఉండగా రెండో స్థానం కూడా ఇంకొకరికి దక్కకూడదనే అభిప్రాయంతో తమిళంలో కే టీవీ (కళానిధి పేరు మీద), తెలుగులో తేజా టీవీ, కన్నడలో ఉషే టీవీ పెట్టారు. ఆ తరువాత వాటన్నిటినీ పే చానల్స్ చేయటం మీద దృష్టిపెట్టారు. తమిళనాట అప్పటికే సన్ గ్రూప్ వారి సుమంగళి కేబుల్ విజన్ అనే ఎమ్మెస్వో పరిధిలో దాదాపు 80 శాతం ఇళ్ళు ఉండటం వలన సన్ టీవీని పే చానల్ గా మార్చటం కష్టమేమీ కాదు. కానీ సన్ టీవీని కొంత కాలం ఉచిత ( ఫ్రీ టు ఎయిర్) చానల్ గానే ఉంచి, ఆంధ్రప్రదేశ్ ను టెస్ట్ మార్కెట్ గా వాడుకున్నారు. మొత్తానికి తెలుగులో తేజ, జెమినీ చానల్స్ ను ముందుగా పే చానల్స్ గా మార్చే బాధ్యత శరద్ కుమార్ మీదనే పడింది. ఆ పని కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఆ విధంగా అటు ప్రకటనల ఆదాయం, ఇటు పే చానల్ ఆదాయం తెప్పించి భారీ లాభాలు ఆర్జించి పెట్టటంలో శరద్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు మిగిలిన సన్ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ పే చానల్స్ అయ్యాయి.

సన్ టీవీ మొదలైన పదేళ్లకల్లా సన్ గ్రూప్ చానల్స్ అన్నీ విజయవంతంగా ఆర్జించి పెడుతున్నాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ముందు అందులో పెట్టుబడి పెట్టిన శరద్ కుమార్ ను, ఆ తరువాత కరుణానిధిని బైటికి పంపాలని కళానిధి నిర్ణయించుకున్నారు. వాటాల విషయంలో కళానిధికి, శరద్ కు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు తారస్థాయికి చేరిన సమయంలో ఒకరోజు శరద్ ఆఫీసుకు వచ్చేసరికి ఆయన కాబిన్ మూసేసి ఉంది. ఆయన స్థానాన్ని ఎదురుగా రోడ్డు అవతల ఉన్న మరో భవనంలోకి మార్చారని తెలిసింది. పరిస్థితి అర్థమైంది. తన వాటాకు తక్కువ మొత్తం విలువకట్టి ఇచ్చినా శరద్ కుమార్ ఆశక్తుడయ్యారు. ఆ విధంగా తన చిన్ననాటి మిత్రుడు, తొలి భాగస్వామిని కళానిధి విజయవంతంగా బైటికి పంపారు. ఆ మాటకొస్తే కరుణానిధికి, ఆయన భార్య దయాళు అమ్మాళ్ కి వాళ్ళ వాటా కింద ఇచ్చిన 100 కోట్లు కూడా తక్కువే. కొడుకు అళగిరి అదే విషయం కరుణానిధికి చెప్పిన తరువాత గాని, ‘పుగళ్’ అని పిలుచుకునే మనవడు కళానిధి మోసం చేశాడనే అనుమానం మొదలు కాలేదు.

ఒకరోజు తెల్లవారు జామున 4 గంటలప్పుడు స్టాలిన్ నేరుగా శరద్ కుమార్ ఇంటికి వెళ్ళి తలుపుతట్టారు. ఆశ్చర్యపోయినా, కలైంజ్ఞర్ రమ్మన్నారని చెబితే మారుమాట్లాడకుండా కారెక్కారు శరద్. మహాబలిపురం రోడ్డులో ఉన్న ఒక రిసార్ట్ లోకి వెళ్ళిందాకారు. అప్పటికే అక్కడ కరుణానిధి ఎదురు చూస్తున్నారు. నేరుగా విషయంలోకి వస్తూ, సన్ టీవీలో ఎవరికి ఎంత వాటా రావాలి, ఎంత వచ్చింది అనే విషయం ఆరా తీశారు. తనకు తెలిసిన లెక్క తాను చెప్పారు శరద్. వెంటనే పక్క గదిలో ఉన్న సన్ టీవీ ఆడిటర్ ను పిలిచారు కరుణానిధి. అప్పటికే ఆయన అక్కడ ఉన్నట్టుగాని మాట్లాడినట్టుగాని అప్పటిదాకా శరద్ కు తెలియదు. మళ్ళీ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తరువాత గాని ఇద్దరూ ఒకే విధంగా చెబుతున్నట్టు కరుణానిధికి అర్థం కాలేదు.

ఒక నిర్ణయానికి వచ్చిన కరుణానిధి అక్కడ ఉన్న ఆడిటర్ ను పంపించి, శరద్ తో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు. “నేను చానల్ పెడదామనుకుంటున్నా. నువ్వు ఎండీగా ఉండాలి” అన్నారు. శరద్ అభ్యంతరం చెప్పటానికేమీ లేదు. కానీ తన భయాలు తనకున్నాయి. దాదాపు 80 శాతం కేబుల్ నెట్ వర్క్ సన్ టీవీ చేతిలో ఉంది. అందులో ఇవ్వకపోతే జనాన్ని చేరటం కష్టం. పోటీగా చానల్ పెడితే సన్ టీవీ సహకరించే పరిస్థితి ఉండదు. మౌనంగా ఉన్న శరద్ ను కరుణానిధి మళ్ళీ అడిగితే, ఇదే అనుమానం ఆయనకు చెప్పేశారు. “ అప్పటికి ఇవ్వకపోతే చూద్దాం” అన్నారు కరుణానిధి. స్క్రీన్ ప్లే లో దిట్ట అయిన కరుణానిధి ఏదో ఒక పాచిక వేస్తారని శరద్ కుమార్ నమ్మకం.

ఈ ప్రయత్నాలు తెలియటంతో శరద్ కుమార్ ను పూర్తిగా శత్రువుగా లెక్కవేసుకున్నారు కళానిధి. అదే సమయంలో వాటాకు రావాల్సినంత డబ్బు రాలేదని కరుణానిధిని రెచ్చగొట్టిన ఆయన పెద్దకొడుకు అళగిరి మీద కూడా కళానిధికి కోపముంది. సన్ గ్రూప్ దినపత్రిక ‘దినమలర్’ అప్పుడే ఒక సర్వే చేసింది. “కరుణానిధి రాజకీయ వారసునిగా ఎవరు సరైనవారని అనుకుంటున్నారు?” అనేది ఆ సర్వేలో ప్రధానమైన ప్రశ్న. అలాంటి సర్వేలతో లేనిపోని గొడవలు పెట్టొద్దని కరుణానిధి సున్నితంగా చెప్పిచూసినా ఫలితం కనబడలేదు. దినమలర్ సర్వే ఫలితాలు ప్రకటించింది. 70 శాతం మంది స్టాలిన్ ను కోరుకుంటున్నారని, అళగిరిని 2% మాత్రమే కోరుకుంటున్నారన్నది ఆ సర్వే సారాంశం. దక్షిణ తమిళనాడులో ముఖ్యమైన మదురై నగరంలో అళగిరికి అనుచరగణం ఎక్కువే. సర్వే ప్రచురించిన ‘దినమలర్’ ఆఫీసు మీద 2007 మే 9 న జరిగిన దాడిలో ఆ కార్యాలయం సిబ్బంది ముగ్గురు చనిపోయారు. అది అళగిరి మనుషుల పనేనన్నది అందరి అనుమానం. వద్దన్నా వినకుండా సర్వే వేశారని కరుణానిధికి కోపమొచ్చింది. పైగా. ఈ దుర్మార్గాన్ని అరికట్టలేకపోయారంటూ జర్నలిస్ట్ సంఘాలు కరుణానిధి ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి.

ఇంకోవైపు కలైంజ్ఞర్ పేరుమీద జనరల్ ఎంటర్టైన్మెంట్, న్యూస్, మూవీస్, మ్యూజిక్ చానల్స్ పెట్టటానికి ఏర్పాట్లు చురుగ్గా మొదలయ్యాయి. అందులో దయాళు అమ్మాళ్, కరుణానిధి కూతురు కనిమొళి కలిసి 80% పెట్టుబడి పెట్టగా 20% వాటా ఉన్న శరద్ కుమార్ ఎండీ బాధ్యతలు చేపట్టారు. 2007 సెప్టెంబర్ 15 న ఈ చానల్స్ ప్రారంభమయ్యాయి. అప్పటికే కరుణానిధికి, కళానిధి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పార్టీలో కూడా అందరూ దయానిధి మారన్ మీద గుర్రుగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేశారు. ఆశించింది కాకపోయినా, ఊహించిందే జరిగింది. కలైంజ్ఞర్ చానల్స్ కు పంపిణీ సమస్య ఎదురైంది.

అప్పుడు ముఖ్యమంత్రి కరుణానిధి బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. అసలు ప్రభుత్వమే ఒక పంపిణీ సంస్థను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేకుండా టీవీ చానల్స్ ప్రసారాలు అందిస్తే సన్ టీవీ వాళ్ళ సుమంగళి కేబుల్ విజయం గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయవచ్చునన్నది ఈ ఆలోచన. దీంతో ‘అరసు (ప్రభుత్వ) కేబుల్ నెట్ వర్క్ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది. 2007 అక్టోబర్ 4 న ఒక ఐఎఎస్ అధికారిని వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. కళానిధి మారన్ కు పరిస్థితి అర్థమైంది. శరద్ కుమార్ శక్తేంటో కళానిధికి తెలుసు. తన కేబుల్ నెట్ వర్క్ దెబ్బతింటుందనీ తెలుసు. పైగా ప్రభుత్వ కేబుల్ నెట్వర్క్ లో తమ చానల్స్ పంపిణీ చేయకపోతే పరిస్థితి ఏంటనే భయం కూడా వెంటాడింది. కాళ్ళ బేరానికి వచ్చి తాతను బ్రతిమాలుకోక తప్పలేదు కళానిధికి. డబ్బు ఎంత ఇచ్చారో తెలియదు గాని, రాజీకి వచ్చారు. తమ నెట్ వర్క్ లో కలైంజ్ఞర్ చానల్స్ ఇస్తామని చెప్పుకున్నారు. దీంతో, ‘అరసు కేబుల్ నెట్వర్క్’ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నామమాత్రంగా మిగిలిపోయింది.

ఆ తరువాత కాలంలో 2 జి స్కామ్ బైటికొచ్చింది. 2జి లబ్ధిదారుల నుంచి కనిమొళి ఈ చానల్స్ లో పెట్టుబడి పెట్టించారని, ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రి రాజా, ఎంపీ కనిమొళితో బాటు కలైంజ్ఞర్ చానల్స్ ఎండీ హోదాలో ఉన్న శరద్ కుమార్ కూడా ఎ7 గా ఈ కేసులో విచారణ ఎదుర్కున్నారు. విచారణ ఖైదీగా ఆయన కూడా కొంతకాలం జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని తేలి, కేసు కొట్టేయటానికి చాలా కాలం పట్టింది. 2017 డిసెంబర్ 21 న తీర్పు వచ్చిన తరువాత శరద్ కుమార్ ఆ ఛానల్స్ నుంచి తప్పుకున్నారు. మొత్తానికి ఆ కుటుంబం వలన రెండుసార్లు ఆయన బాగా నష్టపోయారు. ఆ తరువాత జయలలిత అధికారంలోకి వచ్చారు. ఎలాగూ సన్ టీవీ మీద కోపం ఉంటుంది. పైగా, కరుణానిధి ఏర్పాటు చేసిన అరసు కేబుల్ నెట్వర్క్ ఉండనే ఉంది. “నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష….” అన్నట్టు వెంటనే దానికి జీవం పోశారు. సన్ టీవీ వారి సుమంగళి కేబుల్ విజన్ అనే ఎమ్మెస్వోను దెబ్బతీయటానికి దీన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఆ విధంగా అప్పట్లో కరుణానిధి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అప్పుడు తాత్కాలికంగా ఆగిపోయినా, జయలలిత హయాంలో పుంజుకొని దాదాపు 50 శాతం ఇళ్లకు టీవీ ప్రసారాలు అందించటం మొదలుపెట్టింది. ఇప్పుడు సుమంగళి వాటా 25% వరకు ఉండవచ్చు.

మారన్ సోదరులు కూడా కేసులు ఎదుర్కున్నారు. దయానిధి మారన్ టెలికమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన నివాసంలో ఒక ప్రైవేట్ టెలీఫోన్ ఎక్స్ ఛేంజ్ ఏర్పాటు చేసుకొని దాన్ని సన్ టీవీ వ్యాపార అవసరాలకు వాడుకున్నారన్నది సీబీఐ మోపిన అభియోగం. అయితే, తగిన ఆధారాలు లేవని సీబీఐ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అదే విధంగా కళానిధి తన తమ్ముడు దయానిధి సాయంతో ఎయిర్ సెల్ యజమాని శివశంకరన్ ను బెదరించి మలేసియా వ్యాపారికి అమ్మించారని, అందులో అన్నదమ్ములకు 700 కోట్లకు పైగా ముట్టిందని సీబీఐకి ఫిర్యాదు అందింది. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసు గా పేరు మోసిన ఈ కేసు ను కూడా సీబీఐ స్పెషల్ కోర్టు కొట్టివేసింది.

మళ్ళీ హన్స్ రాజ్ సక్సేనా అలియాస్ శాక్స్ విషయానికొద్దాం. శరద్ కుమార్ కలైంజ్ఞర్ టీవీ ప్రారంభించినప్పుడు చాలామంది సన్ టీవీ సిబ్బంది ఆ చానల్ కు వెళ్లారు. శరద్ వెళ్ళిపోయాక సహజంగానే శాక్స్ ప్రాధాన్యం కొంత పెరిగింది. సన్ నెట్వర్క్ సినిమా డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం చేపట్టటానికి సన్ పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసినప్పుడు శాక్స్ ఆ సంస్థకు సీవోవో అయ్యారు. టీవీ చానల్ కోసం సినిమాల హక్కులు కొనటం కూడా శాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు కొంతమంది నిర్మాతలను బెదరించి తక్కువ ధరకు కొంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. అది పోలీసు కేసుల దాకా వెళ్లటంతో శాక్స్ అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో కళానిధి కూడా శాక్స్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపించి సంస్థ నుంచి పంపించారు. అ తరువాత కొద్ది రోజులకు శాక్స్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలుసుకోవటం, ఆ మరుసటి రోజే కళానిధి మీద చీటింగ్ కేసు పెట్టటం మరో కథ.

శశికళ సోదరుడు పెట్టిన ‘జయా టీవీ’ జయలలిత చనిపోయాక శశికళ వైపు ఉండిపోయింది. అధికార అన్నా డీఎంకే కి ఒక చానల్ అవసరమైంది. జయలలిత వారసుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పళనిస్వామి ‘న్యూస్ జె’ అనే చానల్ ప్రారంభించారు. ఐదేళ్లుగా ఈ చానల్ కు శాక్స్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

ఇవన్నీ అలా ఉంచితే, 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సన్ టీవీ ఇప్పటి పరిస్థితి ఏంటి? గడిచిన అయిదేళ్లలో జాతీయ స్థాయిలో 1, 2 స్థానాల్లో ఉంటూ వచ్చిన సన్ టీవీ ఇప్పుడు స్టార్ గ్రూప్ వారి తెలుగు చానల్ స్టార్ మా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మూడు వారాలుగా జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానం స్టార్ మా చానల్ దే. ఇక తమిళనాట పరిస్థితి చూస్తే అదే స్టార్ గ్రూప్ వారి తమిళ చానల్ స్టార్ విజయ్ గట్టి పోటీ ఇస్తోంది. ఆ ధోరణి అలాగే కొనసాగితే మరో ఆరు నెలల్లో సన్ టీవీని మించిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ విజయ్ టీవీకి మొదటి యజమాని విజయ్ మాల్యా. గోల్డెన్ ఈగిల్ కమ్యూనికేషన్ అనే సంస్థ ద్వారా మాల్యా తన పేరుతో ప్రారంభించిన ఈ విజయ్ టీవీని మొదట్లో యూటీవీ కొనుక్కున్నా, ఆ తరువాత స్టార్ మెజారిటీ వాటా తీసుకుంది. రెండేళ్ళకే మిగిలిన వాటా కూడా తీసుకుంది. ఆ విధంగా స్టార్ గ్రూప్ తీసుకున్న మొదటి ప్రాంతీయభాషా చానల్ విజయ్ టీవీ. ఇప్పుడది సన్ టీవీని సవాలు చేసే దిశలో ఎదుగుతోంది.

– తోట భావనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here