సోనీ, జీ విలీన ఒప్పందంపై సంతకాలు

0
572

సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ( ఎస్ పి ఎన్ ఐ), జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( జె ఇ ఇ ఎల్) విలీనానికి ఒప్పుకుంటూ రెండు సంస్థలూ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీంతో ఈ రెండు సంస్థల డిజిటల్ ఆస్తులు, కార్యక్రమాల నిర్మాణం పనులు, సినిమాల ప్రసారం ఉమ్మడిగా నిర్వహించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇరుపక్షాల చర్చలు పూర్తయిన తరువాత లాంఛనపూర్వకమైన పనులు మినహా విలీనం పూర్తయింది. ఇకమీదట ఏర్పడే కొత్త కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అవుతుంది. అయితే నియంత్రణ సంబంధమైన వ్యవహారాలు, వాటాదారుల వాటాల వ్యవహారం, ఇతర ఆమోదాలు పూర్తి కావాల్సి ఉంది.
ఈ ఒప్పందంలోని షరతుల ప్రకారం సోనీ సంస్థ దగ్గర 150 కోట్ల డాలర్ల నగదు నిల్వ ఉంటుంది. అందులో సోనీ ప్రస్తుత వాటాదారులు తెచ్చే మొత్తం, జీ వ్యవస్థాపకులు తెచ్చే మొత్తం కలిసి ఉంటాయి. కంపెనీ మరింత చురుగ్గా ముందుకు అడుగేయటానికి, అన్నీ చానల్స్ లో కార్యక్రమాల రూపకల్పనకు, వేగంగా పెరుగుతున్న డిజిటల్ లో తనదైన ముద్రవేయటానికి, వేగంగా పెరుగుతున్న క్రీడా రంగంలో క్రీడా ప్రసార హక్కులకోసం వేలంలో పోటీ పడటం లాంటి అంశాలలో ఎదుగుదలకు కృషి జరుగుతుంది.
విలీనం పూర్తయ్యాక కొత్త కంపెనీలో సోనీకి 50.86% వాటా ఉంటుంది. అంటే, మెజారిటీ వాటా పొందినట్టు. జీ టీవీ వ్యవస్థాపకులైన సుభాష్ చంద్ర కుటుంబానికి 3.99 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 45.15 శాతం వాటాలు జీ సంస్థ వాటాదారులకు ఉంటాయి. ప్రస్తుత జీ సీఈవో పునీత్ గోయెంకా ఈ కొత్త కంపెనీకి కూడా నాయకత్వ బాధ్యత నిర్వహిస్తారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లను మాత్రం సోనీ ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం సోనీ ఎండీగా ఉన్న ఎన్ పి సింగ్ ఛైర్మన్ అవుతారు.
జీ, సోనీ విలీనం వలన టెలివిజన్ రంగంలో పెనుమార్పులు వస్తాయి. వ్యాపారపరంగా రెండు సంస్థలూ పరస్పరం లాభం పొందుతాయి. ఫిక్షన్ తోబాటు స్పోర్ట్స్ లోనూ ముందుండే ప్రయత్నాలు మరింత బలోపేతమవుతాయి. దేశవ్యాప్తంగా పేరు మోసిన బ్రాండ్లు కావటంతో ఉమ్మడిగా ఏర్పడే కొత్త కంపెనీ, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లకు తగినట్టు వ్యవహరిస్తుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here