పునఃప్రసారాలమీద టీవీ యాంకర్లకు, నటీనటులకు రాయల్టీ?

0
98

కోవిడ్ సంక్షోభం ఫలితంగా విధించిన లాక్ డౌన్ కాలంలో ఎంటర్టైన్మెంట్ చానల్స్ పాత కార్యక్రమాలే పునఃప్రసారం చేశాయి. అలాంటి కార్యక్రమాలకు యాంకర్లకు, నటీనటులకు అదనంగా డబ్బేమీ ముట్టలేదు. కానీ అనేక పశ్చిమ దేశాల్లో ఇలా పునఃప్రసారం జరిగిన ప్రతిసారీ రాయల్టీ చెల్లించే అలవాటు ఉంది. దీనివలన వాళ్లకు అదనపు ఆదాయం వస్తుంది. ఇప్పుడు మన టీవీ పరిశ్రమలో కూడా నటీనటులు ఇకమీదట ఒప్పందాలలో మార్పులు జరగాలనే కోణంలో ఆలోచించటం మొదలుపెట్టారు.
పే చానల్స్ అన్నీ దాదాపు మూడు నెలల లాక్ డౌన్ కాలంలో పునఃప్రసారాలమీదనే ఆధార పడ్డాయి. అయితే, ఆ ప్రసారాలలో నటించిన నటీ నటులు గాని, కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన యాంకర్లు గాని ఎలాంటి అదనపు పారితోషికమూ అందుకోలేదు. బ్రాడ్ కాస్టర్లకు మాత్రం చందాల రూపంలో డబ్బు అందింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలైనప్పటికీ నియమాలకు అనుగుణంగా ఎన్నీ జాగ్రత్తలతో సాగుతున్న షూటింగ్స్ లో భయం భయంగానే పాల్గొనే పరిస్థితి నెలకొన్నది.
భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం నడిచిన సిట్ కామ్ సీరియల్ తార్క్ మెహతా కా ఉల్టా చష్మా లో తారక్ మెహతా పాత్రలో నటించిన నటుడు, కమెడియన్, రచయిత అయిన శైలేష్ లోధా ఇప్పుడు టీవీ పరిశ్రమలో నటీనటులు, యాంకర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావించారు. అంతే కాకుండా ఇదే సందర్భంలో ఆయన రాయల్టీల ప్రస్తావన తీసుకొచ్చి తేనె తుట్టె కదిపారు. ” ఆర్టిస్టులు పునఃప్రసారాలమీద లబ్ధి పొందటం లేదెందుకని? పశ్చిమ దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తే అంతా అర్థమవుతుంది. చాలా సందర్భాలలోఏ కార్యక్రమమైన పునః ప్రసారమైతే రాయల్టీ అందుకుంటారు. మేధో సంపత్తి హక్కుల కింద ఒక ఏర్పాటు ఉండి తీరాల్సిందే” అన్నారు.
పునఃప్రసారాలమీద పారితోషికం ఇచ్చే వ్యవహారాన్ని గతంలోకి వెళ్ళి పరిశీలిస్తే, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖ నటుడు, గాయకుడు జీన్ ఆట్రీ ఈ విషయం మీద కోర్టుకెళ్లాడు. తన సినిమాలు టీవీలో ప్రసారమవుతున్నందున తనకు రాయల్టీ రావాలన్నాడు. అయితే, ఆయన ఆ కేసు ఓడిపోయాడు. అయితే, ఆ తరువాత కాలంలో ఒక నటి చాలా ముందు చూపుతో భవిష్యత్తులో తన ప్రతిభకు విలువ ఉంటుందని అంచనావేసి ఒప్పందంలో ఈ క్లాజు చేర్చాలని పట్టుబట్టింది. దాన్ని రెసిడ్యువల్ అంటారు. ఆమె పేరు ఆడ్రీ మెడోస్. ది హనీమూనర్స్ లో నటించినప్పుడు పెట్టిన ఈ షరతు ఆ తరువాత తరాల వాళ్లకి అనుకూలంగా తయారైంది. ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఈ క్లాజు చాలా సహజంగా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here