17.6 లక్షలు పెరిగిన జియో వైర్ లెస్ చందాదారులు

0
622

రిలయెన్స్ జియో ఇప్పుడు అదనంగా 17.6 లక్షల చందాదారులను పెంచుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అందించిన తాజా సమాచారం ప్రకారం వోడాఫోన్ ఐడియా 9 లక్షల 60 వేల చందాదారులను కోల్పోగా, భారతీ ఎయిర్ టెల్ 4 లక్షల 80 వేల చందాదారులను పోగొట్టుకుంది. మొత్తం వైర్లెస్ చందాదారులు 116 కోట్ల 60 లక్షల నుంచి 116 కోట్ల 63 లక్షలకు పెరిగారు. పట్టణ ప్రాంతాల్లో వైర్ లెస్ చందాదారులు 63 కోట్ల 79 లక్షల నుంచి 63 కోట్ల 74 లక్షలకు తగ్గారు. గ్రామీణ ప్రాంతాల్లో 52 కోట్ల 81 లక్షల నుంచి 52 కోట్ల 88 లక్షలకు పెరిగారు.
ట్రాయ్ నివేదిక ప్రకారం మొత్తం వాడకంలో ఉన్న చందాదారులు 99 కోట్ల 65 లక్షలు కాగా అందులో రిలయెన్స్ జియో చందాదారులు అత్యధికంగా 35 కోట్ల 85 లక్షలమంది ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఉన్న భారతీ ఎయిర్ టెల్ కు 34 కోట్ల 61 లక్షలు, వోడాఫోన్ ఐడియాకు 23 కోట్ల 43 లక్షలు, బి ఎస్ ఎన్ ఎల్ కు 5 కోట్ల 69 లక్షలు ఉన్నారు. మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 118 కోట్ల 92 లక్షల నుంచి 118 కోట్ల 96 లక్షలకు పెరిగింది. అందులో పట్టణ ప్రాంతంలో 65 కోట్ల 91 లక్షల నుంచి 65 కోట్ల 88 లక్షలకు తగ్గగా గ్రామీణ ప్రాంతంలో 53 కోట్ల నుంచి 53 కోట్ల 80 లక్షలకు పెరిగింది.
ట్రాయ్ కి అందిన సమాచారం ప్రకారం దేశంలో 577 మంది బ్రాడ్ బాండ్ ఆపరేటర్లు ఉండగా చందాదారుల సంఖ్య 79 కోట్ల 49 లక్షలనుంచి 79 కోట్ల 90 లక్షలకు పెరిగింది. మొబైల్ ఫోన్ వాడకం దారుల సంఖ్య 76 కోట్ల 92 లక్షల నుంచి 77 కోట్ల 31 లక్షలకు పెరిగింది. వైర్డ్ చందాదారుల సంఖ్య 2 కోట్ల 44 లక్షల నుంచి 2 కోట్ల 46 లక్షలకు పెరిగింది. ఫిక్సెడ్ వైర్లెస్ చందాదారుల సంఖ్య 12 లక్షల 80 వేల నుంచి 13 కోట్ల 10 లక్షలకు పెరిగింది.
అక్టోబర్ ఆఖరుకల్లా మొదటి ఐదు బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇలా ఉన్నాయి. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ 43 కోట్ల 80 లక్షలు, భారతీ ఎయిర్ టెల్ 20 కోట్ల 87 లక్షలు, వోడాఫోన్ ఐడియా 12 కోట్ల 25 లక్షలు, బి ఎస్ ఎన్ ఎల్ 2 కోట్ల 46 లక్షల చందాదారులు ఉన్నారు. ఏసీటీ 19 లక్షల 70 వేలు ఉన్నాయి. మొదటి ఐదు వైర్డ్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో బి ఎస్ ఎన్ ఎల్ 47 లక్షల 20 వేల చందాదారులు, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ 41 లక్షల 60 వేలు, భారతీ ఎయిర్ టెల్ 39 లక్షల 80 వేలు, ఏసీటీ 19 లక్షల 70 వేలు, హాత్ వే కేబుల్ అండ్ డేటా కామ్ 10 లక్షల 70 వేల చందాదారులతో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here