జీ ఆధిపత్యం కోసం ఆఖరి ప్రయత్నాల్లో పునీత్ గోయెంకా

0
602

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( జీల్ ) లో యాజమాన్య పదవుల వివాదం తారస్థాయికి చేరింది. భారతదేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ ప్రారంభించిన జీ సంస్థకు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ దాని సృష్టికర్త సుభాష్ చంద్ర కుమారుడైన పునీత్ గోయెంకా. అయితే, ఈ సంస్థలో18% పెట్టుబడులు పెట్టిన వాటాదారు సంస్థలు మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకాతోబాటు మరో ఇద్దరు డైరెక్టర్లు తప్పుకోవాల్సిందేనని అల్టిమేటమ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న జరిగిన 39 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన పునీత్ గోయెంకా, సంస్థ ఆశాజనకంగా ముందుకు సాగుతున్నట్టు చెబుతూ వాటాదారుల విశ్వాసం సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అయితే, బోర్డ్ రూమ్ యుద్ధం ఇంకా జరగాల్సి ఉండగా ఆ ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా సమర్పించటం విశేషం.

గత ఏడాది కాలంగా చేపట్టిన చర్యలను , భవిష్యత్తులో చేపట్టదలచిన పనులను చెబుతూ వార్షిక సర్వసభ్య సమావేశం లో పునీత్ గోయెంకా ప్రసంగం సాగింది. “ గత ఆర్థిక సంవత్సరం మనం ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాం. 2021 సంవత్సరం అన్నివిధాలా అనూహ్యమైనది. మొదటి సగంలో పెద్ద ఎత్తున అవాంతరం ఎదురైంది. జీల్ ప్రకటనల ఆదాయం సగానికి సగం పడిపోయింది. ద్వితీయార్థంలో కొద్దిగా కోలుకున్నాం. 6.8 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నాం. చందాల ఆదాయం 5.2% పెరిగింది.” అన్నారు.

సంస్థలో సమూలమైన మార్పులు తెచ్చే కృషి జరుగుతున్నదని వాటా దారులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. కార్యక్రమాలలో కొత్తదనం చూపటం ద్వారా కీలకమైన మార్కెట్లలో మళ్ళీ స్థానం సంపాదించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంవత్సరమ్ మరో రెండు కొత్త చానల్స్ ద్వారా మార్కెట్ ను పెంచుకోబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో డిజిటల్ మార్కెట్ దూసుకుపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అదే భవిష్యత్తు అవుతుందని చెబుతూ జీ5 లో కార్యక్రమాలు పెంచటం మీద దృష్టిసారిస్తామన్నారు.

“డిజిటల్ వ్యాపారంలోనూ, సినిమా వ్యాపారంలోనూ మనం ఇంకా పెట్టుబడులు పెట్టే పనిలోనే ఉన్నాం. అనేక మార్కెట్ల లో మనం ముందు వరుసలో ఉన్నాం. అయితే, కొన్ని నిర్దిష్టమైన వ్యాపార విభాగాలలో గరిష్ఠ ప్రజాదరణ, లాభాలు సంపాదించాం. ఆరు భాషల్లో మనం స్టూడియో వ్యాపారంలో ముందుండాలనుకుంటున్నాం. మ్యూజిక్ విభాగంలో కూడా మన మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం” అన్నారు.

కరోనా సంక్షోభం ప్రభావం మీద వాటాదారుల అనుమానాలకు స్పందిస్తూ, జీ స్టూడియోస్ మీద ఎక్కువ ప్రతికూల ప్రభావం ఉందన్నారు. దేశవ్యాప్తంగా మాల్స్, థియేటర్లు మూసివేయటం వల్ల ఆ సవాళ్ళను ఇంకా ఎదుర్కుంటూనే ఉన్నామన్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా జీ అనమోల్ కూడా మార్కెట్ వాటా కోల్పోయిందని చెప్పారు. అనుబంధ సంస్థలు అప్పులు తిరిగి చెల్లించటం గురించి ప్రస్తావిస్తూ, అప్పులేవీ లేవని, కేవలం వ్యాపార ఆదాయాలు మాత్రమే సిటీ కేబుల్, డిష్ టీవీ నుంచి రావాల్సి ఉండగా ఈ బకాయి వసూళ్లను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here