కేబుల్ ఆపరేటర్ మిత్రులకు మీ సుభాష్ రెడ్డి విజ్ఞప్తి

0
597

ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు నడిపే లోకల్ చానల్స్ ను కట్టడి చేయాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. చాలా విషయాలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ట్రాయ్ మాత్రం వ్యతిరేకంగానే ఉంది. ఏం చేయాలనుకుంటున్నదో చెబుతూ ఇప్పటికే ఒక చర్చా పత్రం విడుదల చేసింది. అందరి అభిప్రాయాలూ తీసుకుంటున్నట్టు చెబుతూ గడువుతేదీ ఈ నెల 21 ( సోమవారం) గా ప్రకటించింది. ఈ విషయాలనీ వివరిస్తూ ఇప్పటికే మనందరి కోసం పెట్టిన మన వెబ్ సైట్ www.cablesamacharam.com ద్వారా కొన్ని వ్యాసాలు అందించాం. వీలైతే వాటిని మళ్లీ చదవ వలసిందిగా మనవి.
ఇప్పుడు ట్రాయ్ చెబుతున్న విధానం ప్రకారం కేబుల్ ఆపరేటర్లు సొంత చానల్ నడుపుకోవాలంటే ఎమ్మెస్వో దగ్గరికి బ్రాడ్ బాండ్ ద్వారా పంపి అక్కడినుమ్చి తీసుకోవాలేతప్ప నేరుగా కలుపుకోవటానికి వీల్లేదు. దీనివలన నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చవుతుంది. పైగా ఎమ్మెస్వో తన హెడ్ ఎండ్ నుంచి ఇన్ని చానల్స్ ఇవ్వటం కూదా సాధ్యమయ్యే పని కాదు. పైగా, కేబుల్ ఆపరేటర్ తాను పంపిణీ చేసే మొత్తం చానల్స్ లో 1% వరకు లోకల్ చానల్స్ ఇవ్వవచ్చునని ఎంఐబి చెప్పింది. అంటే మనం 400 చానల్స్ ఇస్తుంటే 4 లోకల్ చానల్స్ నడుపుకోవచ్చు. కానీ, ట్రాయ్ దానికి అభ్యంతరం చెబుతున్నది. మీరు సొంతగా నడిపే చానల్ కాకపోయినా, మీ ద్వారా ఎవరైనా చానల్ ఇవ్వటానికి అవకాశం లేకుండా కూడా ట్రాయ్ ఇప్పుడు కొత్త రూల్స్ తెస్తున్నది. స్థానికంగా మనం ప్రతిభ ఉన్న కళాకారులకు అవకాశం కల్పించటం,. ఏదైనా జాతరలు, పండుగలు జరిగినప్పుడు వాటిని అందించటం, ఏదైనా స్కూల్ ఫంక్షన్ లాంటివి జరిగినా ఇంటింటికీ చూపించటం ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నాం. డిటిహెచ్ కి లేని సౌకర్యం మనకు ఉందని గర్వంగా భావిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాం. కానీ ట్రాయ్ ఇప్పుడు మన చానల్స్ కు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నది.
అందువలన మనందరం ట్రాయ్ కి ఈ విషయంలో అభ్యంతరాలు తెలియజేసి గట్టిగా మన గొంతు వినిపించాల్సిన అవసరముంది. ఒక ఎమ్మెస్వోగా నేను నా అభ్యంతరాలతో ట్రాయ్ కి లెటర్ రాసినట్టే మీరు కూడా లెటర్ రాయాలని నా కోరిక. ఎంత బలంగా మన గొంతు వినిపిస్తే అంత న్యాయం జరుగుతుంది. మీరు రాసి పంపాల్సిన విషయాన్ని ఒక నమూనాగా మీకు పంపుతున్నాను.
ఈ క్రింద ఇచ్చిన మొదటి పేజ్( లెటర్) లో మీ ఊరు పేరు, తేదీ నింపి మీ నెట్ వర్క్ లెటర్ హెడ్ మీద ప్రింట్ తీసి, కింద మీ సంతకం చేయండి. సీల్ ఉంటే సీల్ కూడా వేయండి. రెండు, మూడు పేజీలను విడిగాగాని, లెటర్ హెడ్ మీద గాని ప్రింట్ తీసి, చివర సంతకం చేయండి. ఈ మొత్తం మూడు పేజీలను స్కాన్ చేసి advbcs-2@trai.gov.in కు గాని, లేదా sapna.sharma@trai.gov.in కు గాని మెయిల్ చేయండి. ఇది కచ్చితంగా సోమవారం సాయంత్రం లోగా జరగాలి. ఆఖరి నిమిషం దాకా ఆగకుండా వెంటనే పంపండి. ఇప్పటికే ఒకసారి గడువు పెంచారు కాబట్టి ఇక మీదట పెంచరు. గుర్తుంచుకొండి. ఇది మన మనుగడకు సంబంధించిన విషయం. స్థానిక చానల్స్ నడుపుకునే మన హక్కును కాపాడుకునే ప్రయత్నం. ఏ మాత్రం అలసత్వం వద్దు. తక్షణమే స్పందించండి.
మీ సుభాష్ రెడ్డి,
తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here