ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల మీద త్వరలో లైసెన్స్ ఫీజు భారం ?

0
2339

కేబుల్ టీవీ రంగం మీద భారం మోపటానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. డీటీహెచ్ ఆపరేటర్లు ఏటా స్థూల ఆదాయంలో 8 శాతం మొత్తాన్ని లైసెన్స్ ఫీజు రూపంలో చెల్లిస్తున్నారు. గతంలో అది 10 శాతం ఉండగా ట్రాయ్ చాలా పెద్ద మనసు చేసుకొని వారి పట్ల ఉదారంగా వ్యవహరించి 8 శాతానికి తగ్గించింది. వాళ్ళలాగే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల మీద కూడా వసూలు చేయాలి కదా అంటూ ట్రాయ్ ఛైర్మన్ వాఘేలా వ్యాఖ్యానించారు.
ఫిక్కీ ఫ్రేమ్స్ -2023 లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ డీటీహెచ్ ఆపరేటర్లకు లైసెన్సింగ్ పద్ధతి ఉండగా ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు లైసెన్స్ ఫీజు ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు. మేమొక చర్చా పత్రం విడుదల చేశాం. దీని సంగతి చూస్తాం” అన్నారు.
మనం కొత్త టెక్నాలజీలను స్వాగతించాలని చెబుతూ, ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూ వస్తోందని, పోటీ పడటానికి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. కొత్త వాళ్ళమీద నియంత్రణ సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన తన మాటల్లో ఓటీటీ వేదికను ప్రస్తావిస్తూ, ఓటీటీకి ఎలాంటి లైసెన్స్ ఫీజూ లేదు గనుక దానిని నియంత్రించే పరిధి ట్రాయ్ కి లేదన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తున్నందున దీన్ని నియంత్రించే అధికారం ఉంటుందో లేదో తెలుసుకుంటున్నామని, ఆ తరువాత ఒక చర్చా పత్రం ద్వారా ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతామని చెప్పారు.
బ్రాడ్ కాస్టింగ్ రంగాన్ని నియంత్రించటంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇందులో భాగస్వాములకు ఎవరికి వారికే భిన్నమైన ప్రయోజనాలు ఉండటం, అవి పరస్పర విరుద్ధమైనవి కావటం ఒక ప్రధాన సమస్యగా అభివర్ణించారు. కొత్త టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 3.0 ను ఈ సందర్భంగా ఉదహరించారు. దీనిమీద నానా రభస జరిగిందని, అయితే, ఇందులో భాగస్వాములు ఓర్పు వహించాలన్నదే తన అభిప్రాయమని, ధరల నియంత్రణ బాధ్యత ట్రాయ్ కి ఉండకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
బ్రాడ్ కాస్టర్లు ధర విషయంలో పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటూ ఉండగా, కొంత మేరకు డీటీహెచ్ ఆపరేటర్లు కూడా అదే భావనలో ఉన్నారని, కేబుల్ ఆపరేటర్లు మాత్రం ధరలను ట్రాయ్ నియంత్రించాల్సిందేనని పట్టుబడుతున్నారని గుర్తు చేశారు. అందరి ప్రయోజనాలనూ కాపాడటం ట్రాయ్ కి చాలా కష్టమవుతోందన్నారు. ఈ విషయంలో ఒక కమిటీ వేసి, అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే అమలు చేసినా, దానిమీద కోర్టుకు వెళ్ళారని చెప్పారు. అయితే, ఇందులో ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన అంశాల మీద త్వరలో ఒక చర్చా పత్రం విడుదల చేస్తామని చెప్పారు. అయితే, అది కూడా పరిష్కారం కాకపోవచ్చునని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఆసక్తి కరమైన విషయమేంటంటే, డీటీహెచ్ లైసెన్స్ ఫీజు మీద 2023 జనవరి 13 న ట్రాయ్ ఒక చర్చా పత్రం విడుదల చేసినప్పుడు దీనికి బ్రాడ్ బాండ్ ఇండియా ఫోరం స్పందిస్తూ, డీటీహెచ్ పోటీదారులైన ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు కూడా ఒకే రకమైన సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ వారి నుంచి ఎలాంటి లైసెన్స్ ఫీజూ వసూలు చేయటం లేదని గుర్తు చేసింది. బహుశా ఇదే ట్రాయ్ ఛైర్మన్ ఆలోచనకూ కారణమై ఉండవచ్చు. ట్రాయ్ చర్చా పత్రం మీద వెల్లడైన ఇలాంటి అభిప్రాయాలను కేబుల్ టీవీ రంగం ఖండించలేదు. మొత్తంగా చూస్తే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల స్థూల ఆదాయం ( లాభం కాదు, మొత్తం వసూళ్ళలో జేఎస్టీ పోను మిగిలినదే ఆదాయం) లో కొంత శాతం లైసెన్స్ ఫీజు రూపంలో వసూలు చేయాలని ట్రాయ్ సిఫార్సు చేయటానికి రంగం సిద్ధమైనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here