ఆర్మీ మీద సినిమాలు, కార్యక్రమాలకు రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి

0
536

మన దేశంలో బ్రాడ్ కాస్టర్లకు సెన్సార్ అన్నా, ఎవరైనా జోక్యం చేసుకున్నా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అలాంటి అపరిమిత స్వేచ్ఛకు బ్రేకులు తప్పటం లేదు. సైనికులను సినిమాల్లో, కార్యక్రమాల్లో చూపాలనుకున్నవాళ్ళు ముందుగా రక్షణ మంత్రిత్య్వశాఖకు చూపించి నిరభ్యంతర పత్రం ( నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాల్సిందే. వాళ్ల కత్తెరపడ్దాకే దాన్ని ప్రసారం చేయాలి.
ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. నిర్మాణ సంస్థలు కూడా ఆర్మీ ప్రస్తావనతో నిర్మించే సినిమాలు, కార్యక్రమాల విషయంలో కథాంశాన్ని స్థూలంగా రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసి, ఎలాంటి అభ్యంతరమూ లేదన్న పత్రం తీసుకున్నమీదటనే నిర్మించాలి. అలా మంత్రిత్వశాఖ అనుమతి లేని సినిమాలు, కార్యక్రమాలు ప్రజలకు చూపటానికి వీల్లేదు. సినిమాలైతే సెన్సార్ అధికారులకు సెన్సార్ సమయంలో ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
రక్షణ మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ సంతకంతో వెలువడిన ఈ లేఖ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా అందింది. కొన్ని కార్యక్రమాలు, సినిమాలు, భారత సైన్యపు ప్రతిష్ఠని దిగజార్చేలా ఉంటున్నాయని, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయని ఆ లేఖ పేర్కొంది. అందువలన అలాంటి ఘట్టాలు చొప్పించకుండా చూడాలని కోరింది.
ఇటీవల వచ్చిన “XXX – అన్ సెన్సార్డ్ సీజన్ 2” ను ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించటం గమనార్హం. అలాంటి కార్యక్రమాల ప్రసారానికి ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆల్ట్ బాలాజీ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒక మహిళాపాత్ర ఒక వ్యక్తిని బలవంతంగా భారత సైన్యపు యూనిఫాం వేసుకోమనటం, జాతీయ చిహ్నం ఉన్న ఆ యూనిఫాం ను ఆ తరువాత చింపటం తెలిసిందే. ఈ విషయం మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా రక్షణ మంత్రిత్వశాఖకు సైతం ఫిర్యాదులు వచ్చినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here