టారిఫ్ ఆర్డర్ ను బాంబే హైకోర్టులో సవాలు చేసిన బ్రాడ్ కాస్టర్లు

0
473

కొత్త టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా చానల్ ధరలు ప్రకటించాలంటూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇచ్చిన తాజా గడువు  ముంచుకొస్తుండటంతో బ్రాడ్ కాస్టర్లు మళ్ళీ బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దీనిమీద ఈరోజు ( ఆగస్టు 6, 2020) విచారణ జరిగే అవకాశముంది.

ఈ ఏడాది జనవరి 1న జారీ చేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్ టి వో 2.0) ప్రకారం మళ్ళీ కొత్తగా చానల్ ధరలు, పాకేజ్ ధరలు ప్రకటించాలంటూ రెమ్డువారాల కిందట జులై 24న ట్రాయ్ ఆదేశాలివ్వటం తెలిసిందే. అదే సమయంలో ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు కూడా నెలవారీ నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు విషయంలోను, ఉచితంగా ఇవ్వాల్సిన కనీస చానల్స్ విషయంలోను తాజా నిబంధనలు పాటించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.

అయితే అధికశాతం ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు ఈ కొత్త నిబంధనలను అమలు చేయటానికే మొగ్గు చూపగా బ్రాడ్ కాస్టర్లు మాత్రం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో అత్యవసరంగా స్టే ఇవ్వాలని కోరారు. అయితే, విచారణ సాగుతున్న సమయంలో ఒక న్యాయమూర్తి మరో ధర్మాసనానికి బదలీ కావటంతో జస్టిస్ ఎ ఎ సయీద్, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ తో కూడిన కొత్త ధర్మాసనం మళ్ళీ కొత్తగా విచారణ చేపట్టింది.

పైగా, ఈ కేసు విచారణ మధ్యంతర స్టే ఉత్తర్వుల గురించి సాగే క్రమంలో కొత్త టారిఫ్ ఆర్డర్ లో ఎంతవరకు సమంజసం అనే విషయం మీదికి మళ్ళింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం మార్చి4 న తీర్పు వాయిదాపడింది. ఐదు నెలలు గడిచినా కోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.

ఇలా ఉండగా  బ్రాడ్ కాస్టర్లకు, పంపిణీ సంస్థలకు (ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు) మధ్య ఒప్పందాలు ఒక్కొక్కటీ గడువు తీరిపోతున్నాయి. దీంతో బ్రాడ్ కాస్టర్లు పాత ధరల ప్రకారమే మళ్లీ కొత్త ఒప్పంద నమూనాలు పంపిణీ సంస్థలకు సంతకాలకోసం పంపటం మొదలుపెట్టారు. అయితే, పంపిణీసంస్థలవారు వీటి మీద సంతకాలు చేయటానికి నిరాకరించారు. ట్రాయ్ ఆదేసాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చునని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ట్రాయ్ ఆదేశాలు అమలులో ఉన్నాయన్నదే వాళ్ళ అభిప్రాయం.

వాళ్లలో కొంతమంది ఈ విషయాన్ని నేరుగా ట్రాయ్ కే ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24న ట్రాయ్ ఘాటుగా స్పందిస్తూ, తాజా టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా కొత్త ఒప్పందాలు చేసుకోవాలని బ్రాడ్ కాస్టర్లను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపట్ల నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది బ్రాడ్ కాస్టర్లు ట్రాయ్ కి లేఖలు రాశారు.

ట్రాయ్ కూడా ఆగస్టు 3న బ్రాడ్ కాస్టర్ల వైఖరిని ఖండిస్తూ లేఖలు రాసింది. నిబంధనలు పాటించాల్సిందేనని గుర్తుచేసింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు మళ్ళీ  బొంబాయ్ హైకోర్టుకు వెళ్లారు. స్థూలంగా చెప్పాలంటే జనవరి 1 నాటి టారిఫ్ ఆర్డర్ 2.0 అమలు చేయాల్సిందిగా వత్తిడి తీసుకురావద్దనేది వాళ్ల అభ్యర్థన. అదే సమయంలో తాజా టారిఫ్ ఆర్డర్ మీద ఇప్పటివరకూ కోర్టు ఎలాంటి స్టే విధించలేదు అన్న విషయాన్నే ట్రాయ్ మళ్ళీ మళ్లీ చెప్పింది.

కొత్త టారిఫ్ ఆర్డర్ లో చెప్పిన ప్రకారం అమలు చేయాల్సిన బ్రాడ్ కాస్టర్లు  అత్యవసర ఊరట కోసం  కోర్టును ఆశ్రయించిన 14.01.2020 తేదీ మొదలుకొని తీర్పు రిజర్వ్ చేసిన 04-03.2020 వరకు అనేక పర్యాయాలు స్టే కోసం అడిగినా కోర్టు మంజూరు చెయ్యలేదన్నవిషయాన్ని ట్రాయ్ గుర్తు చేసింది.  “మీకు గుర్తు లేకపోతే ఒకసారి రికార్డులు చూసుకొండి” అంటూ తాజా లేఖలో బ్రాడ్ కాస్టర్లనుద్దేశించి రాసింది.

“ఈ రంగం ఒక క్రమపద్ధతిలో ఎదగటానికి కృషి చేయాల్సిన బాధ్యత ట్రాయ్ మీద ఉంది. అందువలన నియంత్రణ క్రమంలో ఎలాంటి  శూన్యస్థితీ ఏర్పడకుండా చూడాలి. లేని పక్షంలో వినియీగదారులతో సహా వివిధ భాగస్వాముల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుంది. అందుకే 01.01.2020  నాటి టారిఫ్ ఆర్దర్ ను అమలు చేయాల్సిందిగా 24.07.2020 నాడు ఆదేశాలివ్వవలసి వచ్చింది” అని పేర్కొంది.

ఈ లేఖ అందుకున్న బ్రాడ్ కాస్టర్లు మళ్లీ బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here