రూ.1.33 లక్షల కోట్ల టెలికాం బకాయిలకు నాలుగేళ్ళ మారటోరియం

0
487

టెలికాం రంగానికి భారీ ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సహాయ పాకేజ్ ప్రకటించింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలమీద నాలుగేళ్ళ మారటోరియం విధించటం. 100% విదేశీప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదముద్ర వేయటం సహా అనేక తాయిలాలను కేంద్ర కాబినెట్ ఆమోదించింది. స్పెక్ట్రమ్ వాడకం చార్జీల తగ్గింపు, సవరించిన స్థూల ఆదాయం ( ఏజీఆర్) నిర్వచనంలో మార్పు ద్వారా టెలికాం రంగానికి లబ్ధి చేకూర్చుతోంది. వేలాది కోట్ల బకాయిలు ప్రస్తుతానికి చెల్లించకుండా వోడాఫోన్ ఐడియా లాంటి సంస్థలు మినహాయింపు పొందినట్టయింది. కాబినెట్ నిర్ణయాలను టెలికాం శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్ వలన వోడాఫోన్ ఐడియా, రిలయెన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ విపరీతంగా లబ్ధిపొందుతాయి. ఉద్యోగావకాశాలు కల్పించటం, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం, ఆరోగ్యవంతమైన పోటీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. నియంత్రణ సంబంధమైన భారం మరీ ఎక్కువగా ఉండకుండా చూస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి దాదాపు దివాలక తీసే పరిస్థితిలో ఉన్న వోడాఫోన్ ఐడియా కు ఈ పాకేజ్ అతిపెద్ద ఊరట.

సవరించిన స్థూల ఆదాయం నిర్వచనాన్ని మార్చటం టెలికాం రంగానికి మరో పెద్ద వరం. స్థూల ఆదాయంలో టెలికాం రంగానికి సంబంధించని ఆదాయాన్ని పక్కనబెట్టటం వలన పూర్తిగా టెలికాం ఆదాయం మీద మాత్రమే ప్రభుత్వానికి చెల్లింపులు జరపాల్సి వస్తుంది. అదే విధంగా టెలికాం రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించటం వలన పోటీ పెరిగి సేవల నాణ్యతా కూడా పెరుగుతుంది. ఇప్పటిదాకా 49% మాత్రమే ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించగా మిగిలినది ప్రభుత్వ అనుమతులతో మాత్రమే రావాల్సి ఉండేది.

ఈ పాకేజ్ వలన 4 జి కి మంచి ఊపువస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా 5 జి నెట్ వర్క్ స్లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వానికి బకాయిల చెల్లింపు విషయంలో భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలకు 2020 లో కోర్టు తీర్పు వలన బాగా ఇబ్బంది కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఊరట కలిగింది. మొత్తంగా భారతీ ఎయిర్ తెల, వోడాఫోన్ ఐడియా, రిలయెన్స్ కమ్యూనికేషన్ కలిపి కేంద్ర ప్రభుత్వానికి 92 వేల కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజు బకాయి పడ్డాయి. ఇది కాక 41 వేల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ సంస్థలు నాలుగేళ్ళ పాటు బకాయిల చెల్లింపు నుంచి మినహాయింపు పొందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here