కొత్త టారిఫ్ ఆర్డర్ మీద 30న తీర్పు

0
553

రెండవ టారిఫ్ ఆర్డర్ అమలు మీద రేపు (జూన్ 30న ) బొంబాయ్ హైకోర్ట్ తీర్పు ఇవ్వబోతోంది. 30 నాటి కార్యకలాపాల జాబితాలో ఈ అంశం కూడా ఉంది. ఈ కేసులో 2020 అక్టోబర్ 9న వాదోపవాదాలు పూర్తి కాగా అప్పటినుంచి తీర్పు రిజర్వ్ లో ఉంది. త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా అటు బ్రాడ్ కాస్టర్లు, ఇటు ట్రాయ్ కూడా కోర్టుకు విన్నవించారు. అయితే కరోనా కారణంగా ఇన్నాళ్ళూ తీర్పు వెలువడకపోగా 30 నాటికి లిస్ట్ అయింది.
బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సేవలకు సంబంధించి ట్రాయ్ సవరణలు చేస్తూ 2020 జనవరి 1న రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) విడుదల చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారంగా పేర్కొంటూ బ్రాడ్ కాస్టర్ల, పంపిణీ సంస్థల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించటానికి ఈ సవరణలు చేసినట్టు ట్రాయ్ చెప్పుకుంది. మార్కెట్ లో కొన్ని అవకతవకలను సరిదిద్దటానికి, ఈ రంగం ఒక క్రమపద్ధతిలో ఎదగటానికి ఈ సవరణలు పనికొస్తాయని ట్రాయ్ ఆ సందర్భంగా ప్రకటించింది.
ప్రధానంగా వినియోగదారుల కోణంలో చూస్తే, ఉచిత చానల్స్ ఇంతకు ముందున్న 100 కు బదులుగా ఇప్పుడు 200 ఎంచుకునే అవకాశముంది. పైగా, అంతకుముందు ఆ 100 లోనే ప్రసార భారతి వారి 26 చానల్స్ కూడా ఉండగా ఇప్పుడు 200కు అదనంగా ఇవి ఉంటాయని చెప్పింది. అదే విధంగా ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ టీవీలు ఉంటే మొదటి టీవీకి మాత్రమే 130 రూపాయలు ప్లస్ జీ ఎస్టీ కట్టి, ఆ తరువాత ఒక్కొ చానల్ కు 40% చొప్పున, అంటే 52 రూపాయలు ప్లస్ జీస్టీ చొప్పున కడితే సరిపోతుంది.
అదే విధంగా కారేజ్ ఫీజు విషయంలో బ్రాడ్ కాస్టర్ల అభ్యంతరాలకు కూడా పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేసింది. ఒక పంపిణీ సంస్థ తన లక్షిత మార్కెట్ ను ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికే పరిమితం చేసి లెక్కించాలని చెప్పింది. గరిష్ఠంగా ఒక నెట్ వర్క్ నెలకు ఒక్కో చానల్ కు 4 లక్షలకు మించి కారేజ్ ఫీజ్ వసూలు చేయకూడదని కూడా నిర్దేశించింది. చిన్న చానల్స్ కు, ప్రాంతీయ చానల్స్ కు ఇది కొంత మేలు చేస్తుంది.
ఇక బ్రాడ్ కాస్టర్ల విషయానికొస్తే, చాలా మంది తమ చానల్స్ నుంచి వసూలు చేసే ప్లేస్ మెంట్ ఫీజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని, చీటికి మాటికి నెంబర్లు మారుస్తున్నారని ఫిర్యాదు చేస్తుండగా ట్రాయ్ దీనికి పరిష్కారమార్గం సూచించింది. పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు) భాష, చానల్ వర్గం ఆధారంగా వాటికి నిర్దిష్టమైన స్థానం ఇవ్వాలని చెప్పింది. అంటే, ఒక భాషకు చెందిన అన్ని మ్యూజిక్ చానల్స్ ఒకచోట, న్యూస్ చానల్స్ ఒకచోట…. ఉండేలా నెంబర్లు ఇవ్వాలి. దానివలన చిన్న చానల్స్ స్థానాన్ని పదే పదే మార్చి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు.
ఇక అన్నిటికంటే ప్రధానమైనది చానల్స్ ధర నిర్ణయం. ఇంతకుముందు బొకేలో పెట్టదలచుకున్న చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ.19 వరకు ఉండవచ్చునని చెప్పగా, ఈ పరిమితి దాకా వాడుకోవటానికి ఉత్సాహం చూపుతూ 100% మించి ధర పెంచిన చానల్స్ చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు జంట నిబంధనలు పెట్టింది. అందులో ఒకటి ఏంటంటే ఎవరైనా బ్రాడ్ కాస్టర్ తన చానల్ ను బొకేలో పెట్టదలచుకుంటే దాని గరిష్ఠ చిల్లర ధర 12 రూపాయలకు మించకూడదు అనేది. ఇంతలుముంది ఇది 19 రూపాయలుండేది. ఇక రెండో కండిషన్ ఏంటంటే ఒక బొకేలో పెట్టిన చానల్స్ మొత్తం ధరలు కలిపినా బొకే ధర కు ఒకటిన్నర రెట్లు మించకూడదు అని. అంటే, ఇష్టమొచ్చినట్టు ధర పెంచి, బొకే ధర తక్కువగా నిర్ణయించి మొత్తం బొకే తీసుకునేట్టు చేసే దురాలోచనకు తావుండదు.
అయితే, తమ చానల్స్ ధరలు నిర్ణయిమ్చుకునే హక్కు తమకే ఉండాలి తప్ప ట్రాయ్ ఈ విధంగా తమ వ్యాపారాన్ని దెబ్బతీయకూడదు అని బ్రాడ్ కాస్టర్లు వాదిస్తూ కోర్టుకెక్కారు. ప్రజలకు మేలు జరిగేలా ఒక నియంత్రణా సంస్థగా ఇది తన పరిధిలోని అంశమేనని ట్రాయ్ వాదించింది. ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత తీర్పు వాయిదాపడగా కరోనా కారణంగా ఇప్పటి దాకా తీర్పు వెలువడలేదు. దీంతో అటు బ్రాడ్ కాస్టర్లు, ఇటు ట్రాయ్ కూడా త్వరగా తీర్పు చెప్పాల్సిందిగా బొంబాయ్ హైకోర్టును అభ్యర్థించాయి. రేపు (జూన్ 30న) తీర్పు వెలువరించబోతున్నట్టు బొంబాయ్ హైకోర్టు సమాచారం తెలియజేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here