లోక్ సభ టీవీ, రాజ్య సభ టీవీ లను విలీనం చేసి ఏర్పాటు చేసిన సంసద్ టీవీని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. పార్లమెంటుతోబాటు ప్రజాస్వామ్య సంస్థల పనితీరుకు ఈ సంసద్ టీవీ అద్దం పడుతుంది. పరిపాలనను, ప్రభుత్వ పథకాలు, విధానాల అమలును, చరిత్రను, భారతీయ సంస్కృతిని, సామాన్యుడి ప్రయోజనాలను ప్రధానం అంశాలుగా చూపుతుంది.
పార్లమెంట్ కార్యకలాపాలను ఈ చానల్ లో ప్రసారం చేస్తారు. అదే సమయంలో ఆ కార్యక్రమాలన్నీ ఏకకాలంలో సోషల్ మీడియాలోనూ, ఓటీటీ వేదికమీద కూడా అందుబాటులో ఉండేట్టు చూస్తారు. ఈ చానల్ కు ప్రత్యేకంగా ఒక యాప్ కూడా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవమైన సెప్టెంబర్ 15 నాడే ఈ చానల్ ప్రారంభం కావటం ఒక విశేషమైతే సరిగ్గా 62 ఏళ్ల కిందట 1959 సెప్టెంబర్ 15 నాడే భారత్ లో టీవీ ప్రవేశించటం మరో విశేషం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తోబాటు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లోక్ సభ టీవీని, రాజ్యసభ టీవీని విలీనం చేసి సంసద్ టీవీ పేరుతో ఒకే చానల్ గా నడపాలని గత నవంబర్ లో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివలన కార్యకలాపాలు కేణద్రీకృతం కావటంతోబాటు ఖర్చు తగ్గించుకోవచ్చునని భావించింది. ఇప్పుడు టెలివిజన్ పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్, ఐపీటీవీ ఆపరేటర్లు) ఉచితంగా ఇచ్చి తీరవలసిన ప్రసార భారతి చానల్స్ లో ఒకటి తగ్గినట్టవుతుంది.
