కొత్త టారిఫ్ ఆర్డర్ మీద ట్రాయ్ ని వివరాలు కోరిన బొంబాయ్ హైకోర్ట్

0
256

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) జారీచేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ ( ఎన్ టి వో -2.0) మీద విచారణ ఈ నెల 8కి వాయిదాపడింది. నిన్న ( సెప్టెంబర్ 30న) ఈ కేసు విచారణ సందర్భంగా  బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎ ఎ సయీద్, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ ఎన్ టి వో 2.0 మీద పూర్తి వివరాలు అందజేసి వాదనలు ముగించాల్సిందిగా ట్రాయ్ తరఫు న్యాయవాదిని కోరారు. తదుపరి విచారణను అక్టోబర్ 8 కి వాయిదావేశారు. దీంతో ఆరోజు విచారణ ముగించిన మీదట ఎప్పుడైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ట్రాయ్ కొత్తగా నిర్దేశించిన జంట నిబంధనలమీద చర్చాపత్రం విడుదలచేసిందా అని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఏ నిబంధననైనా విధించే ముందు చర్చాపత్రం విడుదలచేసి పరిశ్రమలోని వారి అభిప్రాయాలు తెలుసుకున్న మీదట తుది నిర్ణయం వెలువరించటం ట్రాయ్ కి అలవాటు గనుక ఇప్పుడు ఈ జంట నిబంధనల విషయంలో అలా జరిగిందీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటున్నట్టు కోర్టు చెప్పింది. మార్కెట్లో ఉన్న బొకేలలో 90% బొకేలు పంపిణీ సంస్థలు పెట్టుకున్నవే కాబట్టి వాటిని బ్రాడ్ కాస్టర్లకు అన్వయించే బొకేలతో పోల్చటం కుదురుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందువలన ఈ బొకేల విధానం మీద పూర్తి సమాచారంతో రావాలని కోర్టు ట్రాయ్ న్యాయవాదిని కోరింది.

ఎన్టీవో 1.0 లో బొకేల డిస్కౌంట్ మీద పరిమితి లేకపోగా ఇప్పుడు అమలు చేద్దామనుకుంటున్న ఎన్టీవో 2.0లో ఆ నిబంధన ఉండటాన్ని ప్రస్తావిస్తూ, అందులో ఏవైనా సడలింపులకు అవకాశముందేమో చెప్పాలని కూడా కోర్ట్ కోరింది. అయితే, వచ్చే విచారణ నాతికి పూర్తి సమాచారంతో రాగలనని ట్రాయ్ తరఫు న్యాయవాది చెప్పటంతో 8వ తేదీన ట్రాయ్ తన తుది వాదన వినిపిస్తుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here