సుప్రీంకోర్టు వైపు చూస్తున్న పే చానల్స్:

0
719

నష్టపోతున్నా కేబుల్ రంగం మౌనముద్ర
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) నిరుడు జనవరి 1 న ఇచ్చిన రెండో టారిఫ్ ఆర్డర్ కు బొంబాయ్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పే టీవీ బ్రాడ్ కాస్టర్లు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రకటనల ఆదాయం పడిపోయిందని కలవరపడుతున్న బ్రాడ్ కాస్టర్లు ఇప్పుడు పే చానల్ చందాలు తగ్గిపోయే పరిస్థితి రావటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు. నిజానికి ఇది నష్టదాయకం కాకపోయినా, లాభాల్లో తగ్గుదలను సైతం భరించటానికి బ్రాడ్ కాస్టర్లు సిద్ధంగాలేరు.
సుప్రీంకోర్టుకు వెళ్ళటం ద్వారా మరికొంత కాలం పాత పద్ధతిలో లాభాలు గడించుకోవటం, తీర్పు ప్రతికూలంగా వస్తే అప్పటిదాకా వచ్చిన లాభాలతో సరిపుచ్చుకోవటం లక్ష్యంగా కనబడుతోంది. గతంలో రెండో టారిఫ్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా దాని అమలుకు గడువు పూర్తవుతున్న సమయంలోనే కోర్టుకు వెళ్ళారు తప్ప వెంటనే వెళ్లలేదు. ఇప్పుడు కూడా బొంబాయ్ హైకోర్టు ఈ కొత్త టారిఫ్ అమలు చేయటానికి ఆరు వారాల సమయం ఇచ్చింది కాబట్టి ఆగస్టు 13 దాకా సమయమున్నట్టే. అందువల్ల ఆగస్టు మొదట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ముందుగా స్టే తెచ్చుకోగలిగితే ఇంకొన్నాళ్ళు సాగదీసే అవకాశముంటుంది. ఇంతకుముందు కూడా అలా చేసిన చరిత్ర బ్రాడ్ కాస్టర్లకుంది.
ఇంతకీ రెండో టారిఫ్ ఆర్డర్ లో ఏముందో పరిశీలిస్తే, రెండు విషయాలు స్పష్టంగా కనబడతాయి. మొదటిది కేబుల్ రంగం. రెండోది బ్రాడ్ కాస్టింగ్ రంగం. చందాదారుల కోణంలో చూసినప్పుడు ఉచిత చానల్స్ పరంగానూ, అదనపు టీవీ ఉన్నప్పుడూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

  1. అంతకు ముందు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద చెల్లించే 130 రూపాయలకు 100 చానల్స్ తీసుకునే వెసులుబాటు ఉండగా ఇప్పుడు రెట్టింపు చేస్తూ, అదే మొత్తానికి 200 చానల్స్ తీసుకునే వీలు కల్పించారు.
  2. అంతకుముందు ప్రసారభారతి వారి 26 చానల్స్ కూడా 100 లోనే కలిపి ఉండగా ఇప్పుడు వాటిని 200కు అదనంగా చేర్చారు.
  3. రూ.130 కి 200+26 చానల్స్ అందుబాటులో ఉంచటంతోబాటు రూ.160 చెల్లిస్తే అపరిమితంగా చానల్స్ ఎంచుకునే సౌలభ్యం.
  4. ఒక ఇంట్లో ఒకటికి మించి టీవీ సెట్లు ఉంటే మొదటి టీవీకి రూ.130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు చెల్లించిన మీదట రెండో టీవీకి, మూడో టీవీకి కూడా రూ. 52 వంతున కడితే సరిపోతుంది.
    ఇవి చందాదారులకు మేలు చేసేవే అయినా, కేబుల్ పరిశ్రమకు మాత్రం నష్టదాయకం. బ్రాడ్ కాస్టర్లు రకరకాల బొకేల ద్వారా ఏదో విధంగా చందాదారులకు బొకేలు అంటగడుతూ ఉంటే ఆ బొకేలోని చానల్స్ అన్నీ ఇవ్వటానికి ఎమ్మెస్వోలు ఇబ్బంది పడాల్సి వచ్చేది. హెడ్ ఎండ్ సామర్థ్యం తక్కువ ఉన్నపుడు ఇది మరీ పెద్ద సమస్య. ఇంకోవైపు చందాదారులు ఆ బొకే తీసుకోవటం వలన వారికున్న 74 చానల్స్ అవకాశంలో వీటిని పోగొట్టుకోవటం వలన 100 కి మించి పోయి, అదనపు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఆదాయం వచ్చే వీలులేదు. పైగా ఇప్పటి నియమానికి అనుగుణంగా హెడ్ ఎండ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవలసి వస్తుంది.
    ఇన్ని ఉచిత చానల్స్ ఇస్తే కారేజ్ ఫీజు తగ్గిపోతుంది. ఒకవైపు బొకేల కారణంగా చిన్న చితకా చానల్స్ కూడా ఇవ్వాల్సి రావటంతో కారేజ్ ఫీజు ఆదాయం తగ్గిందని బాధపడుతుంటే ఇప్పుడు ఉచిత చానల్స్ నుంచి కారేజ్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం సన్నగిల్లింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే కారేజ్ ఫీజు కేవలం ఎమ్మెస్వోలు తీసుకుంటారు తప్ప కేబుల్ ఆపరేటర్లకు అందులో వాటా రాదు. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులో మాత్రం ఎక్కువ వాటా కేబుల్ ఆపరేటర్లదే.
    అదనపు టీవీలకు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు తగ్గించటం వలన ఎక్కువ ఆదాయం కోల్పోయేది కేబుల్ ఆపరేటర్లే. అయినా సరే, ఈ విషయంలో కేబుల్ పరిశ్రమ ట్రాయ్ నిర్ణయాన్ని ప్రతిఘటించలేదు. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రాయితీ వలన ఇళ్ళలో రెండో టీవీ వచ్చే అవకాశం మెరుగు పడుతుంది. కానీ దీనివలన లాభపడేది పే చానల్ వాళ్ళే. వాళ్ళు వసూలు చేసుకునే చందాలో మాత్రం ఎలాంటి తగ్గింపూ లేదు. నిజానికి ఒక కుటుంబానికి రెండు టీవీలు ఉంటే అదే సభ్యులు కోరుకున్న కార్యక్రమాలు విడివిడిగా చూసే వీలుంది. అయినా సరే పూర్తి మొత్తం చందా రెండింటికీ చెల్లించాల్సిందే. బ్రాడ్ కాస్టర్ల వ్యాపారం పెరగటానికి కేబుల్ రంగం మెడలు వంచారే తప్ప బ్రాడ్ కాస్టర్లను ప్రోత్సహించినట్టేనన్న వాదనను ముందుకు తీసుకు రావటంలో కేబుల్ పరిశ్రమ విఫలమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here