ఫైబర్ నెట్ పై సిఐడి విచారణకు ఆదేశం

0
503

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ( ఎపి ఎస్ ఎఫ్ ఎల్) మీద సిబిఐ వివారణ జరిపించాలని రాష్ట్ర కాబినెట్ నిర్ణయించినా సిబిఐ సానుకూలంగా స్పందించలేదు. దీంతో సిఐడి విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎపి ఎస్ ఎఫ్ ఎల్ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలమీద ఈ విచారణకు ఆదేశించారు.
నిరుడు జూన్ 11న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఎపి ఎస్ ఎఫ్ ఎల్ లో టెండర్లప్రక్రియలోను, అమలు చేసే క్రమంలోనూ అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాల్సిందిగా సిబికి ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. ఈ మేరకు సిబిఐ కి ప్రభుత్వం లేఖ రాసింది. అయితే, దీనిమీద సిబిఐ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన అనేకమార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఈ విషయంలో జోక్యం చేసుకొని విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేశారు.
రాష్ట్రంలో ఇంటింటికీ చౌకధరకు ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీ అందించేలా ట్రిపుల్ ప్లే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు కాగా అందులో ఆశ్రిత పక్షపాతం కారణంగా సమస్యలు అనేకం తలెత్తినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొదట ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని విచారణ జరపాల్సిందిగా కోరినప్పుడు దాదాపు రూ. 200 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్టు ఆ కమిటీ ఒక నివేదిక సమర్పించింది.
రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ సంస్థ కార్యకలాపాల మీద దర్యాప్తు జరిపి అందించిన ఈ నివేదిక ఆధారంగా సిబిఐ వివారణకు ఆదేశించటానికి రాష్ట్ర కాబినెట్ మొగ్గు చూపింది. గత ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టిందని. అదే వేమూరి హరికృష్ణ గతంలో ఇవిఎం ( ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్) ల దొంగతనం కేసులో నిందితుడని ఆ నివేదిక పేర్కొంది.
ప్రాజెక్ట్ అమలు చేయటానికి అర్హత లేకపోయిన్నా, తక్కువ ధరకు టెండర్ దాఖలు చేయకపోయినా తెరా సాఫ్ట్ సంస్థకే కాంట్రాక్టు దక్కినట్టు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ పర్యవేక్షణకు మరో కేంద్ర సంస్థ ముందుకొచ్చినా, తక్కువ ధరకే చేయచూపినా పట్టించుకోకుందా తిరిగి తెరా సాఫ్ట్ కే కట్టబెట్టినట్టు కూడా తేల్చింది. పైగా, ఈ ప్రాజెక్ట్ కోసం సెట్ టాప్ బాక్సుల కొనుగోలు లోనూ గోల్ మాల్ జరిగినట్టు గుర్తించింది. ప్రభుత్వం నాలుగు కంపెనీలను సెట్ టాప్ బాక్సులు సరఫరా చేయాలని కోరినా, తెరాసాఫ్ట్ నుంచి మాత్రమే తీసుకోవటానికి మొగ్గు చూపింది.
ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ కోరగా ఏడాది గడిచినా సిబిఐ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు సిఐడి విచారణ జరిపించాల్సి వచ్చింది. ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ప్రస్తుత చైర్మన్ గౌతం రెడ్డి లేక రాయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి పేర్కొన్నారు. ఆయన లేఖను పరిశీలించిన మీదట పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సిందిగా సిఐడి అదనపు డిజిపి ని కోరినట్టు, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పినట్టు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఎపి ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌతం రెడ్డి ఈ సంస్థలో చంద్రబాబు నాయుడు హయాంలో అప్పటి ఐటి శాఖామంత్రి నార లోకేశ్ ఆధ్వర్యంలో అవకతవకలు జరిగాయని ఆరోపించటం తెలిసిందే. దాదాపు వెయ్యికోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, వాటన్నిటినీ వెలికి తీస్తామని కూడా ప్రకటించారు. తాను ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయని, అక్రమాలు జరిగాయనటానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని, విచారణ తరువాత ఇందులో భాగస్వామ్యమున్న చిన్నా, పెద్ద నాయకులందరి బండారం బైట పడుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here