మహారాష్ట్రలో రిపబ్లిక్ చానల్స్ ఆపాలని ఆపరేటర్లను కోరిన శివ్ కేబుల్ సేన

0
222

పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలమధ్య శివసేన పార్టీకి అనుబంధంగా ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం శివ్ కేబుల్ సేన రిపబ్లిక్ చానల్స్ ను నిషేధించింది. సునీల్ రావత్ సోదరుడు సంజీవ్ రావత్ సంతకంతో ఈ మేరకు ఒక లేఖ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రధాన ఆపరేటర్లందరికీ ఈ లేఖను పంపుతూ, రిపబ్లిక్ టీవీ జర్నలిజం విలువలను, మార్గదర్శకాలను పదే పదే కాలరాస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను అమర్యాదకర భాషతో అవమానిస్తున్నట్టు అందులో పేర్కొంది. రిపబ్లిక్ టీవీ సమాంతర కోర్టును నిర్వహిస్తున్నదని కూడా ఆ లేఖ ఆరోపించింది.
ఇలా ఉండగా, ఇంగ్లిష్, హిందీ చానల్స్ నడుపుతున్న రిపబ్లిక్ టీవీ కూడా దీనికి పోటీగా ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇది ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం మీద దాడి చేయటమే. శివ సేన వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలని మమ్మల్ని కోరుకుంటోంది. ప్రజలకు సమాచారం అందించాల్సిన మా ప్రాథమిక హక్కును మా నుంచి లాక్కోవాలనుకుంటోంది. ఉద్ధవ్ థాక్రే, రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కును లాక్కునే హక్కు నీకు లేదు!. మా ధైర్యమే మా చేత నిజం మాట్లాడిస్తుంది. 1975లో భారత ప్రజలు ఎమర్జెన్సీని ధిక్కరించారు. ఇప్పుడు సోనియా సేన చేస్తున్న పనికీ అదే పరిస్థితి ఎదురవుతుంది” అని అందులో పేర్కొంది.
రిపబ్లిక్ నెట్ వర్క్ ట్విట్టర్ లో ఒక పిటిషన్ కూడా పెడుతూ దేశప్రజలందరూ ముందుకొచ్చి స్వేచ్ఛా ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందించే హక్కుకోసం జరుగుతున్న పోరాటానికి అండగా నిలబడాలని, మద్దతు తెలియజేస్తూ దానిమీద సంతకం చేయాలని కోరింది.
ఇలా ఉండగా కేబుల్ చానల్స్ ద్వారా ప్రసారాలను అడ్డుకోవటానికి శివసేన ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరుతూ రిపబ్లిక్ నెట్ వర్క్ వేసిన పిటిషన్ ను ముంబయ్ హైకోర్టు త్రోసిపుచ్చింది. శివ్ కేబుల్ సేన అనేది చట్టబద్ధమైన వ్యవస్థ కాదని, అందువలన దానిని ఆదేశించటం కుదరదని చెప్పింది. పైగా, ఎమ్మెస్వోలతో చానల్ ఒప్పందాలకు భంగం కలగనంతకాలం కోర్టు జోక్యం ఉండబోదని కూడా తేల్చి చెబుతూ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here