లాండింగ్ పేజ్ పిటిషన్ ను త్రోసిపుచ్చిన టిడిశాట్

0
599

టీవీ చానల్స్ తమ కార్యక్రమాలకు ప్రచార అస్త్రంగాని, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లకు ఆదాయ వనరుగా ఉన్న లాండింగ్ పేజ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ఇటీవల లాండింగ్ పేజీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు వెలువరించగా బార్క్ కు ఆ హక్కు లేదంటూ టైమ్స్ గ్రూప్, సన్ గ్రూప్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) లో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, బార్క్ ని ఏ విధంగానూ టాయ్ పరిధిలోకి తీసుకు రావటం కుదరదు గనుక ఆ వ్యవహారాన్ని టిడిశాట్ వివారించటం కుదరదని,  ఇతర కోర్టులకు వెళ్ళవచ్చునని చెబుతూ పిటిషన్ ను నిన్న త్రోసిపుచ్చింది. 

చానల్ పెట్టగానే వచ్చే లాండింగ్ పేజ్ ప్రకటనల వలన ఆ ప్రకటనలు ఇవ్వగలిగే కొన్ని చానల్స్ కు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుందని, మిగిలిన చానల్స్ నష్టపోయే అవకాశముందని కొంతమంది బ్రాడ్ కాస్టర్లు సమస్య లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు సెప్టెంబర్ 3న బార్క్ చర్యలు చేపట్టింది. అయితే బార్క్ అనుసరిస్తున్న ఫార్ములా వలన ప్రేక్షకాదరణ లెక్కలు తగ్గిపోయే ప్రమాదముందని పిటిషనర్లు సన్ గ్రూప్, టైమ్స్ గ్రూప్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో బార్క్ చర్యలను నిలువరించాలని కూడా కోరారు. 

అయితే, బార్క్ ను ఏ విధంగానూ టాయ్ పరిధిలోకి తీసుకురావటం కష్టమని, అలాంటి సంబంధం లేనప్పుడు దానితో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించటం తన పరిధిలో ఉండదని టిడిశాట్ స్పష్టం చేసింది.  ట్రాయ్ నుంచి లైసెన్స్ పొందిన సంస్థ గాని, సామాన్య ప్రజలకు సేవలు/సమాచారం అందించే సంస్థగాని కాకపోవటం వలన బార్క్ ను టిడిశాట్ విచారణ పరిధిలోకి తీసుకురావటం కుదరదని టిడిశాట్ అభిప్రాయపడింది.  ఈ నేపథ్యంలో జ్యూరిస్ డిక్షన్ సమస్య కారణంగా తాను విచారించటం కుదరదని టిడిశాట్ తేల్చి చెప్పింది. అయితే, పిటిషనర్లు తమ సమస్యను చట్ట ప్రకారం తగిన కోర్టులో తేల్చుకోవచ్చునని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here