బ్రాడ్ కాస్టర్ల ధరల పెంపుతో ఎన్టీవో 2.0 వాయిదా వేయాలని ట్రాయ్ ని కోరిన డిజిటల్ కేబుల్ సమాఖ్య

0
554

రెండో టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) అమలును తాత్కాలికంగా వాయిదావేయాలని ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ ఈ రోజు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. ప్రధాన బ్రాడ్ కాస్టర్లు అందరూ తమ ముఖ్యమైన చానల్స్ అన్నిటికీ ధరలు పెంచటం వలన నెలవారీ కేబుల్ బిల్లులు పెరిగే ప్రమాదం ఏర్పడినందున ట్రాయ్ స్పందించాలని ఆ లేఖలో కోరింది. స్టార్, జీ, సోనీ, వయాకామ్ 18 తమ ముఖ్యమైన చానల్స్ ధరలు పెంచుతూ డిసెంబర్ 1నుంచి అమలులోకి వచ్చేలా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్టీవో 2.0 నిబంధనలను పునఃపరిశీలించాలని, ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లు ప్రకటించిన ధరల ప్రభావం మార్కెట్ మీద ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని కూడా ఆ లేఖలో డిజిటల్ కేబుల్ సమాఖ్య ట్రాయ్ ని కోరింది. దేశంలో దాదాపు 60 శాతం కేబుల్ పరిశ్రమకు ప్రాతినిధ్య వహిస్తున్న ఈ సంస్థలో కార్పొరేట్ ఎమ్మెస్వోల ప్రతినిధులతోబాటు అనేకమంది ఎమ్మెస్వోలు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ పరిధిలో దాదాపు 10 కోట్ల కేబుల్ ఇళ్ళు ఉన్నాయి. పే చానల్ ధరల మీద ఒక గరిష్ఠ పరిమితి విధించాలని ఈ సమాఖ్య కోరుతోంది. అప్పుడే వినియోగదారులమీద భారం పడకుండా ఉంటుందని స్పష్టం చేసింది.

నియంత్రణ సంస్థ ఇచ్చే ఆదేశాల అమలులో వినియోగదారుల ప్రయోజనాలకు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని బొంబాయ్ హైకోర్టు జూన్ 30 న ఇచ్చిన తీర్పు సందర్భంగా పేర్కొనటాన్ని కూడా ఎమ్మెస్వోల సంఘం ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదే సమయంలో ఓటీటీ వేదికల విషయంలో కూడా నియంత్రణ ఉండేట్టు చూడాలని ట్రాయ్ కి విజ్ఞప్తి చేసింది. బ్రాడ్ కాస్టర్లు డీడీ ఫ్రీడిష్ కు ఉచితంగా చానల్స్ ఇవ్వటం విషయంలో కూడా ఆంక్షలు విధించాలని కోరింది. అన్ని రకాల పంపిణీ వేదికలు ఎలాంటి వివక్ష లేకుండా నిబంధనలు అమలు చేసేటట్టు చూడాలని ఆలిండియా డిజిటల్ కేబుల్ సమాఖ్య విజ్ఞప్తి చేసింది.

బ్రాడ్ కాస్టర్లు తయారుచేసిన రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ట్రాయ్ వారి ఆలోచనకు అనుగుణంగా ఉండేట్టు చూడాలన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ఆర్ ఐ ఒ లు చూడగానే అందరూ తమ ప్రధాన చానల్స్ ధరలు సుమారు 30 నుంచి 60% దాకా పెంచినట్టు స్పష్టంగా కనబడుతోందని, ఆ విధంగా వాటిని బొకే నుంచి తప్పించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ విధంగా 2019 తో పోల్చినప్పుడు ఆ పెరుగుదల 200-400% ఉందని గుర్తు చేశారు.

బ్రాడ్ కాస్టర్లు ఇప్పుడు ప్రకటించిన కొత్త ధరలు అమలు చేయటం మొదలైతే పే టీవీ చందాదారుల సంఖ్య మరింత క్షీణిస్తుందని, 2019 నాటి టారిఫ్ అమలు చేసినప్పుడే అలా జరిగిందని గుర్తు చేసింది. బిల్లుల భారం తగ్గించాలన్న లక్ష్యంతో ట్రాయ్ ప్రతిపాదించిన రెండో టారిఫ్ ఆర్డర్ లక్ష్యాన్ని నీరుగార్చుతూ బ్రాడ్ కాస్టర్లు తాజా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లు పంపటాన్ని ప్రస్తావించారు. ఇది పూర్తిగా వ్యతిరేక ధోరణి అని అభివర్ణించారు.

ఇప్పుడు పెంచిన ధరల ఫలితంగా కొత్త బిల్లులు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగే అవకాశముందన్నారు. సగటున ప్రస్తుతం పే చానల్స్ కు రూ.141 చెల్లించే చందాదారు ఇకమీదట రూ.203.80 చెల్లించాల్సి వస్తుందని ట్రాయ్ కి గుర్తుచేశారు. కేబుల్ టీవీ పరిశ్రమ గడిచిన ఏడాదిన్నర కాలంలో అదే పనిగా చందాదారులను కోల్పోతూ ఉండగా ప్రధాన కేబుల్ కంపెనీలు ప్రతి త్రైమాసికానికి 10% నుంచి 15% వరకు చందాదారులను కోల్పోతున్నాయన్నారు. చాలామంది చందాదారులు ఓటీటీ లేదా ఫ్రీడిష్ వైపు వెళ్ళిపోవటాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here