కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు వచ్చే ఏప్రిల్ కు వాయిదా

0
1474

డిసెంబర్ 1 నుంచి అమలవుతాయనుకున్న కేబుల్ టీవీ కొత్త ధరల అమలు వాయిదా పడింది. పే చానల్స్ కారణంగా ప్రజలమీద భారం పడే ప్రమాదాన్ని గమనించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వీటి అమలును వాయిదావేసింది. బ్రాడ్ కాస్టర్లు తమ పే చానల్స్ ధరలను భారీగా పెంచుతూ డిసెంబర్ 1 నుంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, కొత్త ధరల వల్ల సామాన్య వినియోగదారులు ప్రస్తుతం చూస్తున్న చానల్స్ కే నెలకు కనీసం రూ.50 పైగా అదనంగా చెల్లించాల్సి వస్తుండటంతో ట్రాయ్ ఈ వాయిదా నిర్ణయం ప్రకటించింది. ట్రాయ్ సలహాదారుడు అరవింద్ కుమార్ ఈ మేరకు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు.
దీంతో పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు ఊరట చెందారు. అమలుకు తాజాగా నిర్దేశించిన గడువు తేదీలను కూడా ట్రాయ్ ప్రకటించింది. బ్రాడ్ కాసటర్లు తమ తాజా ధరల వివరాలను డిసెంబర్ 31 లోగా ప్రకటించాల్సి ఉంటుంది. అందులో ఒక్కో చానల్ గరిష్ఠ చిల్లర ధర, కొన్ని చానల్స్ ను కలిపి బొకే రూపంలో ఇవ్వదలచుకుంటే ఆ బొకే ధరలు ప్రకటించాలి. ఇప్పటికే ధరలు ప్రకటించి డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పిన బ్రాడ్ కాస్టర్లు కూడా అ ధరలను మార్చదలచుకుంటే వారు కూడా డిసెంబర్ 31 గడువును వాడుకోవచ్చు.
అదే విధంగా పంపిణీ సంస్థల తమ పంపిణీ చిల్లర ధరలను జనవరి 31 లోగా ప్రకటించవలసి ఉంటుంది. వినియోగ దారులు తాము చూడదలచుకున్న చానల్స్ ను ఎంచుకునేందుకు ఫిబ్రవరి 1 మొదలుకొని మార్చి 31 వరకు వెసులు బాటు కల్పిస్తారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త చందారేట్లు అమలులోకి వస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధత, సంక్లిష్టత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ తన లేఖలో వివరణ ఇచ్చింది. చందా దారులు ఇప్పుడు తీసుకుంటున్న చానల్స్ నుంచి కొత్తగా ఎంచుకోదలచుకున్న చానల్స్ కు మారటానికి కూడా వీలుగా తగినంత సమయం ఇచ్చారు.
కొత్త నిబంధనల అమలుకు తక్కువ వ్యవధి ఇవ్వటం సమంజసం కాదన్న ఉద్దేశ్యంతో 15 కోట్ల మంది పే టీవీ చందాదారులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ సలహాదారు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. అదే విధంగా సర్వీస్ ప్రొవైడర్లు కూడా బొకేలకు తగిన అవకాశం కల్పిస్తూ తమ ఐటీ వ్యవస్థను అప్ గ్రేడ్ చేసుకోవటానికి కూడా తగినంత సమయం లభిస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here