ఏసీటీ ఫైబర్ నెట్ కు వినియోగదారుల కమిషన్ మొట్టికాయ

0
849

వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం ఏసీటీ ఫైబర్ నెట్ కు మొట్టికాయ వేసింది. ఒక వినియోగదారుడి చందా మొత్తం రూ. 10,619 వాపసు చేయాలని, కోర్టు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని షేక్ పేట కు హకేమడిన మోహమ్మద్ ఆజమ్ అలీ అనే వ్యక్తికి 2019 లో ఇచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ కి రూ.10,619 చందా కట్టించుకొని 1000 ఎంబీపీస్ స్పీడ్ ఇస్తానని ఒప్పుకున్న ఏసీటీ అందులో విఫలం కావటంతో ఈ వివాదం తలెత్తింది.
ఏసీటీ ఫైబర్ నెట్ కేవలం 100-200 ఎంబీపీస్ వేగంతో మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందించగలిగింది. దీంతో ఆ వినియోగదారుడు ఈ విషయాన్ని కంపెనీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కానీ వాళ్ళు స్పీడ్ పెంచటంలో విఫలమయ్యారు. దీంతో తన సర్వీస్ డిస్ కనెక్ట్ చేసి చందా మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కోరాడు. అధికారులు ఒప్పుకుంటూ మెసేజ్ పంపినప్పటికీ రిఫండ్ చేయలేదు. అయితే, ఇంటర్నెట్ మాత్రం డిస్ కనెక్ట్ చేశారు.
కంపెనీ తనకు వాగ్దానం చేసిన విధంగా హి స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వకపోవటం వల్ల తాను వ్యాపారపరంగా చాలా నష్టపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇసుక వ్యాపారానికి, ఐఆర్ సీటీసీ టికెట్ బుకింగ్స్ తదితర లావాదేవీలలో విఫలం కావటం వలన రోజుకు రూ.5,000 నుంచి 10,000 దాకా నష్టపోయానని వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘానికి ఫిర్యాదు చేశాడు.
అయితే, అప్ గ్రేడేషన్ పనుల కారణంగా చందాదారులకు అందించే సేవలకు అంతరాయం కలిగిందే తప్ప ఇందులో నిర్లక్ష్యం లేదని ఏసీటీ ఫైబర్ నెట్ వాదించింది. ఫిర్యాదు దారుడు ఎలాగూ ఈ సేవలు తీసుకోవటానికి నిరాకరించినందున సర్వీస్ డిస్ కనెక్ట్ చేశామని చెప్పింది. ఆ విషయం కూడా ఈ మెయిల్ ద్వారా తెలియజేశామని చెప్పింది. డిపాజిట్ మొత్తాన్ని 4-6 వారాల్లో తిరిగి ఇస్తామని కూడా తెలియజేశామని పేర్కొంది. అతడి బాంక్ వివరాలు కోరుటూ మెయిల్ పంపగా ఆ వివరాలు ఇవ్వటానికి బదులు కమిషన్ ను ఆశ్రయించాడని చెప్పింది.
అయితే, సంబంధిత పత్రాలన్నీ పరిశీలించిన కమిషన్ ఏసీటీ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నమాట నిజమేనని ఒప్పుకుంది. కానీ మొదటి విచారణ రోజే అతడికి ఇవ్వటమో డిపాజిట్ చేయటమో కాకుండా రెండేళ్లపాటు సాగదీయటం కచ్చితంగా సంస్థ ఉద్దేశపూర్వకంగా చేసిందేనని అభిప్రాయపడుతూ ఖర్చుల కింద మరో రూ. 10 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో చందా రూ,10,619 తో బాటు ఖర్చులకింద రూ.10,000 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here