టారిఫ్ ఆర్డర్ కేసు నవంబర్ 30న తుది విచారణ

0
622

రెండో టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 2.0 అమలు మీద బ్రాడ్ కాసటర్లు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది. వచ్చే వాయిదా నవంబర్ 30 నాడు జరిగేది తుది విచారణ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దాదాపు రెండి నెలలపాటు వాయిదా వేసినా, బ్రాడ్ కాస్టర్లకు అనుకూలంగా స్టే మాత్రం ఇవ్వకపోవటం గమనార్హం.
ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ హాజరయ్యారు. 2020 జనవరి నాటి రెండో టారిఫ్ ఆర్డర్ లో గరిష్ఠ చిల్లర ధరను రూ.12 గా నిర్ణయించటం మీద మాత్రమే కాకుండా 2017 నాటి మొదటి టారిఫ్ ఆర్డర్ లో రూ. 19 గా గరిష్ఠ చిల్లర ధర నిర్ణయించటం మీద కూడా అభ్యంతరం చెప్పారు. వినియోగదారుల ఆలోచనలను ఈ టారిఫ్ ఆర్డర్లు ప్రతిబింబించటం లేదన్నారు. కొత్త ఆర్డర్ వలన బొకేలో చేర్చే పే చానల్స్ సంఖ్య తగ్గుతుందన్నారు. పైగా చందాదారులకు ఎక్కువ ఖర్చవుతుందనీ, బ్రాడ్ కాస్టర్లు ఎక్కువమందిని చేరుకోవటం కుదరదని వాదించారు.
ట్రాయ్ ఇంతకుముందే తన వాదనను సమర్థించుకుంతు సమాధానం దాఖలు చేసింది. దీంతో ఈ కేసు తుది విచారణను నవంబర్ 30 కి వాయిదా వేస్తూ, ఇరుపక్షాలూ, నవంబర్ 12 లోగా లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రెండో టారిఫ్ ఆర్డర్ ను సమర్థించటం ద్వారా బొంబాయ్ హైకోర్టు బ్రాడ్ కాస్టర్ల ప్రాథమిక హక్కులను కాలరాసిందని ఐబీఎఫ్ తన పిటిషన్ లో వాదించింది. ఈ కేసులో పిటిషనర్లలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్, ప్రధాన బ్రాడ్ కాస్టర్లు అయిన స్టార్ ఇండియా, డిస్నీ ఇండియా, జీ, ఏషియానెట్, టీవీ 8 బ్రాడ్ కాస్ట్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here