టీవీ మన అవసరమా? మార్కెట్ అవసరమా?

0
558

ఇంటింటా ముందు గదిలో మూలన ఉండి వినోదం, సమాచారం అందిస్తూ మన ఆలోచనాధోరణిని, నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న టెలివిజన్ ఒక అద్భుతం. 20వ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ టీవీ. అది ప్రపంచాన్ని విప్లవాత్మకం చేసింది. కమ్యూనికేషన్ కు, గ్లోబలైజేషన్ కు అదొక సంకేతం. వినోద పరిశ్రమకు టీవీ ఒక రాయబారిగా నిలిచింది. మన జీవితాల్లో భాగమై పోయి సగటున మూడున్నర గంటలు దానితో గడిపేట్టు చేస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో మనముందుంచుతోంది టీవీ. ఆ విధంగా ఆకట్టుకోవటంలో విజయం సాధిస్తే దాని అసలు లక్ష్యం నెరవేరినట్టే. చానల్ నిర్వాహకుల వ్యాపారం సాగినట్టే.
టీవీ ఆవిష్కరణ కచ్చితంగా ఒక రోజు లేదా ఒక వ్యక్తి వల్ల జరిగిందని చెప్పటానికి వీల్లేదు. అనేక ప్రయోగాల సమాహారం అది. 1927 సెప్టెంబర్ 7న శాన్ ఫ్రాన్సిస్కో లో ఫార్న్స్ వర్త్ తొలి ఎలక్ట్రానిక్ టెలివిజన్ సృష్టికర్తగా చరిత్ర కెక్కాడు. మనం ఇప్పుడు చూస్తున్న టెలివిజన్ మాతృక అదే. ఈ పరిశోధనకు పెట్టుబడి పెట్టినవ్యక్తి మనం డాలర్ల ఆదాయం ఎప్పుడు చూస్తామని పదే పదే అదుగుతూ ఉంటే టీవీ సృష్టికర్త మొదట ప్రసారం చేసింది డాలర్ బొమ్మకావటం మరో విశేషం. అదే సమయంలో బ్రిటన్ లో తొలితరం టీవీ సృష్టికర్త జె ఎల్ బెయర్డ్ 1923 – 39 మధ్య వీడియో మీద అనేక పరిశోధనలు జరుపుతూ వచ్చాడు. కలర్ టీవీ, వీడియో డిస్క్, స్టీరియో టెలివిజన్, టీవీలో స్పోర్ట్స్ ప్రసారాలు క్లోజ్డ్ సర్క్యూట్ ద్వారా పే టీవీ లాంటి అనేక సరికొత్త భావనలకు ఆయన ఆద్యుడు. టీవీ మొదలైన తొలిరోజుల్లో టేప్ అందుబాటులో లేకపోవటం, సినిమాలా రికార్డు చేసే ఫిల్మ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండటంతో అన్నీ ప్రత్యక్షప్రసారాలు చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్యువాత కారు చౌకగా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు.
శాంతికి విఘాతం కలిగించే చర్యల గురించి ప్రజలలో అవగాహన పెంచటానికి, ఘర్షణ వాతావరణం గురించి అప్రమత్తం చేయటానికి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటానికి, సామాజిక, ఆర్థిక అంశాలమీదకు ప్రజల దృష్టి మరల్చటానికి టీవీ ఒక ఆయుధంగా మారింది. 1996 నవంబర్ 21,22 తేదీలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ టెలివిజన్ ఫోరమ్ లో మీడియా ప్రముఖులు పెరుగుతున్న టీవీ ప్రాధాన్యాన్ని చర్చించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో పరస్పర సహకారం కూడా ఒక అంశం. ఇలా టీవీ ప్రభావాన్ని గుర్తించటం వల్లనే ఐక్యరాజ్య సమితి ఈ సందర్భంగా నవంబర్ 21 ని ప్రపంచ టెలివిజన్ దినంగా పాటించాలని సూచించింది.
భారతదేశంలో 1956 లో టీవీ ప్రారంభమైనా ఎక్కువ కాలం విద్యాకార్యక్రమాలకు పరిమితం కావటం, ఆ తరువాత కూడా కొద్ది గంటలపాటు మాత్రమే ప్రసారాలు అందటం తెలుసు. 1982 లో కలర్ టీవీ, శాటిలైట్ వాడకం మొదలయ్యాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. 1991 లో స్టార్ టీవీ వచ్చి తొలి ప్రైవేట్ శాటిలైట్ గా భారతదేశంలో ప్రభావం చూపటం, హిందీ కార్యక్రమాలతో తొలిభారతీయ చానల్ గా జీ టీవీ రంగ ప్రవేశం చరిత్రను తిరగరాసిన ఘట్టాలు. ఇప్పుడు దేశంలొ 900 కు పైగా ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ ఉండగా 300 కు పైగా 24 గంటల న్యూస్ చానల్స్ ఉన్నాయి. 900 లో 300 కు పైగా పే చానల్స్ కాగా మిగిలినవి ఉచిత చానల్స్. మూడు దశాబ్దాల కాలంలోనే భారత్ లో టీవీ రంగంలో ఇన్ని మార్పులు వచ్చాయి.
ఇన్ని చానల్స్ వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తదనం ఆశించే ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పుడే తగిన ఆదరణ కనబడుతోంది. ఒకప్పుడు చానల్ కు విధేయులుగా కనబడిన ప్రేక్షకులు ఇప్పుడు కార్యక్రమాల విధేయత చూపుతున్నారు. ఒక్కో చానల్ లో నచ్చిన కార్యక్రమం ఎంచుకొని చూసే పరిస్థితి. ఏ క్షణంలో చానల్ మారుస్తారోనన్న భయంతో బ్రాడ్ కాస్టర్ అనుక్షణం ఉత్కంఠ కొనసాగించే పనిలో ఉన్నాడు. రేటింగ్స్ వచ్చే కార్యక్రమం తయారు చేయటానికి పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది. అదే సమయంలో ప్రకటనలిచ్చే వ్యాపారి ఆలోచన ఇమ్కోలా ఉంది. రేటింగ్స్ చార్ట్ లో కార్యక్రమాల రేటింగ్స్ కంటే ముఖ్యంగా బ్రేక్ లో రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవటం పెరిగింది. ఎంతమంది కార్యక్రమం చూసినా, తన ప్రకటన చూడటం ముఖ్యమనే కోణంలో ఆలోచిస్తున్నారంటేనే టీవీ వెనుక లక్ష్యం అర్థమవుతుంది.
జనం నాడి పట్టుకున్నవాడు, దూకుడుగా పెట్టుబడి పెట్టినవాడే ఈ రంగంలో నిలబడ్డాడు. హిందీ కార్యక్రమాలు చేయకూడదన్న ఎనిమిదేళ్ల నిబంధన పూర్తి అయ్యాక భారత్ లో స్టార్ టీవీ, జీ టీవీ మీద పైచేయి సాధించింది. దానికి రెండే కార్యక్రమాలు కారణమయ్యాయి. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేయాలని నిర్ణయించి అమితాబ్ కు ఉన్న సెలెబ్రిటీ స్థాయిని వాడుకున్నారు, లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఆలోచన చెప్పిన సీఈవోను కాదని కోటి ఖాయం చెయ్యమని చెప్పిన రూపర్ట్ మర్దోక్ అలాంటి సాహసమే చేశాడు. ఆ ఒక్క నిర్ణయం ఈ సహస్రాబ్ది తొలి ఏడాది భారత టీవీ కార్యక్రమాల చరిత్రను ఒక కీలమైన మలుపుతిప్పింది. భారతదేశపు టీవీ కార్యక్రమాల వీక్షణలో 2000 సంవత్సరం జులై 3 వ తేదీ ఎప్పటికీ చరిత్రగా మిగిలిపోతుంది. “ కౌన్ బనేగా కరోడ్ పతి” పేరుతో ప్రారంభం కావటం ఒకటైతే, అ తరువాత సమయంలో కూడా ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయేలా దానితోబాటే ప్రసారం చేసిన ఏక్తా కపూర్ సారధ్యంలోని బాలాజీ టెలీఫిల్మ్స్ సంస్థ వారి సీరియల్ “క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ” రెండోది.
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలో టీవీ ప్రభ తగ్గినట్టు అనిపించినా పూర్తిగా దాని స్థానం, ప్రభావం మాత్రం తగ్గలేదు. టీవీ దూకుడుగా విస్తరిస్తున్న సమయంలో పత్రికలకు ముప్పువాటిల్లవచ్చునని చాలామంది ఊహించారు. కానీ అలా జరగలేదు. పైగా, రాత్రి వార్తలు చూసినవాళ్లు పగలు మరింత సమాచారం కోసం పత్రికలు చదువుతున్నట్టు సర్వేలు తేల్చాయి. ఢిల్లీ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ దీనికి ’అపెటైజర్ ఎఫెక్ట్ ’ అనే పేరు కూడా పెట్టింది. అయితే, కారు చౌక ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ మాధ్యమాల ఉద్ధృతి పెరిగింది. ఈ సారి ఆ ప్రభావం ఏకకాలంలో పత్రికలమీద, టీవీ మీద పడింది. దీంతో పత్రికలు, టీవీ డిజిటల్ విభాగాలు ప్రారంభించి ఆ అవకాశాన్ని సొమ్ముచేసుకోవటం మొదలైంది. అయితే, సామాన్యుడి మాధ్యమంగా, అత్యంత చౌకగా వినోదం అందించే టీవీకి ఉన్న స్థానాన్ని ఇప్పట్లో తగ్గించటం సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీతో కొత్త మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన టీవీ మసకబారే అవకాశమే లేదు.
భారతదేశంలో కేబుల్, శాటిలైట్ టెలివిజన్ ఇంతగా ప్రజల్లోకి వెళ్ళటానికి కారణం ఆర్థిక సంస్కరణలకు తలుపులు తెరవడమో, యాదృచ్ఛికంగా జరిగిందో అనుకోవటం పొరపాటు. ప్రజల ఆలోచనలు, ఆసక్తులను ఒడిసిపట్టుకోవటం లోనే దాని విజయం దాగి ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న టెలివిజన్ “వినియోగదారు సమాజాన్ని” సృష్టించటంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. అందుకు కారణం ప్రకటనలు, జీవన శైలి సందేశాలు ఉండటం కాదు, దాని సహజ స్వభావమే అది. ఒక సాంకేతిక రూపంగా టెలివిజన్ ను రూపొందించటం వెనుక లక్ష్యం కేవలం మనిషిలోని వినియోగదారుణ్ణి వెలికితీయడమే! ఆ విధంగా జనాన్ని టీవీ ముందు కట్టిపడేసి ప్రకటనలు చూపించటంలో వ్యాపారులు విజయం సాధించినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here