కేబుల్ చానల్స్ మీద ట్రాయ్ ఉక్కుపాదం

0
968

ఎమ్మెస్వోలు ప్రసారం చేసే లోకల్ కేబుల్ చానల్స్ మీద రకరకాల ఆంక్షలతో నిబంధనలు రూపొందించటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నడుం బిగించింది. ఎన్ని చానల్స్ నడుపుకోవటానికి అవకాశముందో నిర్థారించటంతోబాటు ఎమ్మెస్వో పరిధిలోని ఆపరేటర్లు నడుపుకునే చానల్స్ కూడా ఈ సంఖ్యలో చేర్చి వాటి ప్రసారాల నియంత్రణ బాధ్యతను కూడా ఎమ్మెస్వోలమీద పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేబుల్ ఆపరేటర్లు చానల్స్ నడుపుకోవాలంటే ఎమ్మెస్వో సహకారం చాలా అవసరమవుతుంది.
శాటిలైట్ చానల్స్ సిగ్నల్స్ అందుకొని వాటిని ఇంటింటికీ చేర్చటంతోబాటు పంపిణీ సంస్థలు (ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్స్, ఐపిటివి నిర్వాహకులు) సొంత చానల్స్ నడపటం కూడా పరిపాటి. మరికొందరు ఎమ్మెస్వోలు పంపిణీతో సంబంధం లేని ఎవరైనా సొంత చానల్స్ నడపాల్సిందిగా అడిగితే కారేజ్ ఫీజు వసూలు చేసుకొని వాళ్ల చానల్ కూడా పంపిణీ చేయటం ఇప్పుడు చూస్తున్నాం. అయితే, ఇలా శాటిలైట్ చానల్స్ కాని చానల్స్ ని ఎలా నియంత్రించాలా అని చాలా కాలంగా ట్రాయ్ కసరత్తు చేస్తూనే ఉంది.
గతంలో ఒక చర్చాపత్రం విడుదలచేసి అభిప్రాయాలు స్వీకరించినమీదట సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కొన్ని 2014 నవంబర్ 19న ఒక సారి, ఆ తరువాత 2019 నవంబర్ 13న మరో సారి సిఫార్సులు పంపింది. అయితే, మంత్రిత్వశాఖ ఇందులో కొన్ని సిఫార్సులమీద అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఇప్పుడు తాజాగా ట్రాయ్ మళ్ళీ ఒక చర్చాపత్రం విడుదలచేసింది. అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తగా ఇప్పుడు ట్రాయ్ వాటిని పునఃపరిశీలిస్తూ కొత్త చర్చాపత్రం విడుదలచేసింది. నిజానికి డిటిహెచ్ విషయంలో ఇప్పటికే నిబంధనలు సిఫార్సు చేయగా ఇప్పుడు వాటినే ఎమ్మెస్వోల వంటి మిగతా పంపిణీ సంస్థలకు కూదా వర్తింపజేసేలా చూడాలని, ఏకరూపత సాధించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
కేబుల్ చానల్స్ నడిపే సంస్థ 2013 నాటి కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉండాలని గతంలో ట్రాయ్ నిర్దేశించగా అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ఈ ఒక్క విషయంలో అభ్యంతరం లేవనెత్తింది. ఎమ్మెస్వోల విషయంలో అలాంటి నిబంధన పెట్టినా పరవాలేదు గాని చిన్న చిన్నపట్టణాలలో, గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ నిర్వహించుకునే వారికి ఇలాంటి నిబంధన విధించటం సరికాదని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ అభిప్రాయపడిందీ నిబంధన తప్పనిసరి చేయటం వలన సొంత వ్యాపారంగా, భాగస్వామ్య వ్యాపారంగా కేబుల్ సంస్థ నడుపుకునేవారికి ఇబ్బందికరం అవుతుందన్నది కమిటీ అభిప్రాయం. ఇప్పుడు ట్రాయ్ చర్చాపత్రం ద్వారా సేకరించిన అభిప్రాయాల ఆధారంగా చేయబోయే సిఫార్సు ఎలా ఉంటుందో ముందుముందు తెలుస్తుంది.

అయితే, టాయ్ కి ఈ విషయంలో అభ్యంతరాలున్నాయి. ఒకవేళ కంపెనీ గా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన విధించకపోతే వాళ్లు నడిపే వానల్ యాజమాన్యం వివరాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ఎలానిర్ణయించాలన్నది ప్రశ్నార్థకమవుతుందని ట్రాయ్ అంటోంది. అన్ని విషయాలూ పూర్తిగా వెల్లడించి నమోదు చేసుకున్నవారిని మాత్రమే స్థానిక చానల్స్ నడుపుకునేలా మంత్రిత్వశాఖ అనుమతించాలన్నది ట్రాయ్ అభిప్రాయం. ఈ విషయాన్ని నిన్న విడుదలచేసిన చర్చాపత్రంలో ట్రాయ్ స్పష్టం చేసింది.
గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సు ప్రకారం ఒక్కొ ఎమ్మెస్వో గరిష్ఠంగా 15 చానల్స్ ప్రసారం చేయవచ్చు. అయితే, ఆ ఎమ్మెస్వో పరిధిలోని కేబుల్ చానల్స్ కూడా ఈ సంఖ్యలోకే వస్తాయి. స్థానిక కేబుల్ ఆపరేటర్లు సొంత చానల్స్ నడుపుకోవాలంటే వాటిని ఎమ్మెస్వోకు పంపి, అక్కడినుమ్చి ఎన్ క్రిప్ట్ చేసిన శాటిలైట్ చానల్స్ తో కలిసి అందుకోవాల్సి ఉంటుంది. అందువలన ఒక ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి నడిపే మొత్తం చానల్స్ సంఖ్య గరిష్ఠంగా 15 ఉండాలని సిఫార్సు చేసింది. డిటిహెచ్ విషయంలో కూడా ట్రాయ్ ఇదే విధమైన సిఫార్సు చేసింది. పంపిణీ చేసే మొత్తం శాటిలైట్ చానల్స్ సంఖ్యలో 3% లేదా 15 లో ఏది ఎక్కువైతే ఆ సంఖ్యనే పరిమితిగా పెట్టింది. అంటే 400 చానల్స్ ఇచ్చే డిటిహెచ్ ఆపరేటర్ 12 మాత్రమే స్థానిక చానల్స్ ఇవ్వవచ్చు. 500 అయితే 15, 600 అయినా 15 మాత్రమే ఇచ్చే వీలుంటుంది. ఇప్పుడు ఎమ్మెస్వోలకు కూదా ఇదే పద్ధతి పెట్టే ఆలోచనలో ట్రాయ్ ఉంది.
వినియోగదారుల ప్రయోజనాలు, విలువలతో కూడిన వ్యాపార విధానాలు, సులువుగా వ్యాపారం చేసుకోవటం, కార్యక్రమాల, ప్రకటనల నియమావళిని కాపాడటం దృష్ట్యా ఎమ్మెస్వోలు తాము అందించే చానల్స్ సంఖ్యలో 5% వరకు, కేబుల్ ఆపరేటర్లు 1% వరకు స్థానిక చానల్స్ నడుపుకునే అవకాశం ఇవ్వాలన్న మంత్రిత్వశాఖ సూచనమీద ఇప్పుడు ట్రాయ్ కసరత్తు మొదలైంది.
అయితే, ఇలా నియంత్రణను సడలించటం వలన సంప్రదాయ బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలు పక్కదారిపట్టే పరిస్థితి రాకూడదన్నది ట్రాయ్ అభిప్రాయం. ఎమ్మెస్వోలు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు నడుపుకోదగిన చానల్స్ విషయంలో విడివిడిగా చెప్పటం కూదా సరికాదని, ఆ నిర్ణయాధికారాన్ని ఎమ్మెస్వోలలు, ఆపరేటర్ల ఉమ్మడి నిర్ణయానికే వదిలి వేయాలని ట్రాయ్ సూచిస్తోంది. మొత్తంగా చుసినప్పుడు ఆ చానల్స్ లో ప్రసారమయ్యే అంశాలకు బాధ్యత తీసుకోవాల్సింది ఎమ్మెస్వో మాత్రమే కాబట్టి నిర్ణయాధికారాన్ని ఎమ్మెస్వోకు అప్పగించటం మీదనే ట్రాయ్ పట్టుబడుతోంది.
ట్రాయ్ చర్చా పత్రం పూర్తిగా చదవాలనుకున్నవారు ఇక్కడ చూడవచ్చు: https://trai.gov.in/sites/default/files/CP_07122020_0.pdf
స్పందించాలనుకుంటే ఈ నెల 14 లోగా పంపాల్సిన మెయిల్ ఐడి లు: advbcs-2@trai.gov.in లేదా sapna.sharma@trai.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here