జీ సంస్థ చైర్మన్ ఎమిరిటస్ గా సుభాష్ చంద్ర నియామకం

0
500

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తమ సంస్థకు చైర్మన్ ఎమిరిటస్ గా సుభాష్ చంద్రను ప్రకటించుకుంది. ఈ నియామకం ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తుంది. ” శ్రీ సుభాష్ చంద్ర తన నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయిష్టంగానే డైరెక్టర్ల బోర్డు ఆ రాజీనామాను ఆమోదించింది. తాను స్థాపించిన సంస్థలో 27 ఏళ్ళపాటు గడిపిన జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగినట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తమ సంస్థ అంతర్జాతీయంగా మీడియా రంగంలో ఎదగటం ఒక వ్యాపారిగా తన అభిరుచికి అద్దం పట్టిందని మెరుగైన రేపటికోసం చేసిన కృషి ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు” అంటూ కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
భారత టెలివిజన్ పితామహుడు గా భావించే శ్రీ సుభాష్ చంద్ర దూరదృష్టి జీ గ్రూప్ కి, ఇంకా చెప్పాలంటే యావత్ టీవీ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2011 లో న్యూయార్క్ లో జరిగిన 39వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. మీడియాలో ఎక్స్ లెన్స్ కు గాను డైరెక్టరేట్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడాయన.
కంపెనీ స్థాపించటం మొదలుకొని దాని ఉన్నతస్థాయికి కారకుడైన సుభాష్ చంద్ర సేవలకు గుర్తింపుగా గౌరవ సూచకంగా బోర్డు ఆయనను చైర్మన్ ఎమిరిటస్ గా ఉండాలని విజ్ఞప్తి చేసింది. దానికి ఆయన అంగీకరించారు. ఈ విధమైన సలహాదారు పాత్రలో ఆయన విశేష అనుభవం, దూరదృష్టి సంస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆయన మార్గదర్శనంలో సంస్థ ముందడుగు వేస్తుందని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ హోదాలో శ్రీ సుభాష్ చంద్ర ఎలాంటి వేతనమూ తీసుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here