టారిఫ్ ఆర్డర్ అమలు ఆలస్యమైతే చందారులు నష్టపోతారు: ట్రాయ్

0
541

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జనవరిలో ప్రకటించిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు ఆలస్యమయ్యే కొద్దీ, చందాదారులు ఎక్కువ నష్టపోతారని ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిటిహెచ్ ఆపరేటర్లు పూర్తిగాను, ఎమ్మెస్వోలు పాక్షికంగాను అమలు పరచగా బ్రాడ్ కాస్టర్లు అత్యధికశాతం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. తుది విచారణ సాగుతూ ఉండగా త్వరలోనే తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ట్రాయ్ చైర్మన్ ఒక టెలికామ్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు ఆలస్యమైతే వివక్షాపూరిత విధానాలు మళ్ళీ తలెత్తుతాయన్నారు.

జనవరిలో జారీచేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ ( ఎన్ టి వో 2.0 ) ను ఇప్పటికే ఎమ్మెస్వోలలో హిట్స్, హాత్ వే, డెన్ సహా కొంతమంది స్వతంత్ర ఎమ్మెస్వోలు అమలు చేయగా మరికొందరు ఇంకా కోర్టు తీర్పు కోసమే ఎదురుచూస్తున్నారని శర్మ వ్యాఖ్యానించారు. అయితే ఆలస్యమయ్యేకొద్దీ వ్యాపార కార్యకలాపాలన్నీ త్రిశంకు స్వర్గంలో పడతాయని ఆయన అభిప్రాయపడ్దారు. కొత్త ఆదేశాలు అమలు చేస్తే 2017 తరువాత ఏర్పడిన సామరస్యత కొనసాగుతుందన్నారు. ఇప్పటికే అనేక లిటిగేషన్లతో కూరుకుపోయిన పరిశ్రమ చందాదారులమీద భారాన్ని కొనసాగిస్తూ వస్తున్నదన్నారు.

తీర్పు వచ్చేదాకా ఆగమని చెప్పిన బొంబాయ్ హైకోర్టు ఈ నెలలో వేగంగా విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లొనే తీర్పు వెలువడుతుందన్న సంకేతాలు కూడా ఇవ్వటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీర్పు వెలుఅవడే వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని బొంబాయి హైకోర్టు సూచించటంతో ట్రాయ్ అందుకు కట్టుబడి ఉంటానని కోర్టుకు హామీ ఇచ్చింది.

నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద ఇవ్వాల్సిన వంద చానల్స్ సంఖ్యను రెండొందలకు పెంచటం, ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే, అదనపు కనెక్షన్ కు 40%మాత్రమే వసూలు చేయాలన్న ట్రాయ్ నిబంధనతో ఆపరేటర్లు కినుక వహించారు. కొంతమంది ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు ఈ విషయం మీద కోర్టుకెళ్ళారు. బొకేలో ఉంచే చానల్స్ గరిష్ఠ ధర రూ. 12 గా నిర్ణయించటం మీద, బొకే డిస్కౌంట్ 33% కి పరిమితం చేయటం మీద బ్రాడ్ కాస్టర్లు అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పుడు అందరూ బొంబాయ్ హైకోర్టు తీర్పు కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here