కేబుల్ చానల్స్ కు కఠిన నిబంధనలు సిఫార్స్ చేసిన ట్రాయ్

0
1021

టెలివిజన్ చానల్స్ ను ఇంటింటికీ అందించే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, డిటిహెచ్ ఆపరేటర్లు అందించే స్థానిక చానల్స్ విషయంలో ప్రభుత్వానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అనేక కఠిన నియమాలు సిఫార్సు చేసింది. ఒక్కో ఎమ్మెస్వో 15 లోకల్ చానల్స్ మించి ఇవ్వకూడదు. ఆ చానల్స్ నడుపుకోవాలంటే ముందుగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబి) కు తమ సంస్థ యాజమాన్య వివరాలన్నీ తెలియజేయాలి. న్యూస్ ప్రసారం చేయాలనుకుంటే కచ్చితంగా కంపెనీగా రిజిస్టర్ కావాలి. ఒక ఎమ్మెస్వో సొంత చానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమం/చానల్ మరో ఎమ్మెస్వో ద్వారా పంపిణీ జరగ కూడదు. ఇలాంటి కఠిన నిబంధనలతో ట్రాయ్ చేసిన సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం రాగానే అమలులోకి వస్తాయి.
ఎమ్మెస్వోలు నడిపే కేబుల్ చానల్స్ మీద ఎలాంటి నియంత్రణ ఉండాలో సూచించమని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ( ఎంఐబి) కోరగా 2014 నవంబర్ 19న ట్రాయ్ తన సిఫార్సులు పంపింది. అయితే, డిజిటైజషన్ పూర్తయ్యాక పరిస్థితులు చాలా మారాయి. అదే విధంగా డిటిహెచ్ ఆపరేటర్లు నడిపే సొంత చానల్స్ లేదా శాటిలైట్ కాని చానల్స్ మీద విడిగా 2019 నవంబర్ 13న ట్రాయ్ కొన్ని సిఫార్సులు చేసింది. డిటిహెచ్ నిబంధనలను ఆమోదిస్తూనే ఎంఐబి ఇదే తరహాలో ఎమ్మెస్వోలతో సహా అన్ని పంపిణీ వేదికలకూ ( డిటిహెచ్, ఎమ్మెస్వో, హిట్స్, ఐపిటీవీ) పనికొచ్చేలా నియమాలు సిఫార్సు చేయవలసిందిగా కోరింది.
దీంతో 2020 డిసెంబర్ 7 న ట్రాయ్ ఒక చర్చా పత్రం విడుదలచేసింది. ఈ రంగానికి సంబంధించిన వారందరూ తమ అభిప్రాయాలు తెతెలియజేయాలని కోరగా బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్లు, కొంతమంది వృత్తి నిపుణులు స్పందించి అభిప్రాయాలు వెల్లడించారు. వీటన్నిటినీ పరిశీలించి సమీక్షంచిన అనంతరం గతంలో ఎంఐబి వ్యక్తంచేసిన అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకొని ట్రాయ్ తన సిఫార్సులను ఎంఐబి కి పంపింది. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి:
(i) ఎంఐబి దగ్గర గాని పోస్టాఫీసులో గాని రిజిస్టర్ చేసుకున్న పంపిణీ సంస్థలు ( డిటిహెచ్, ఎమ్మెస్వో, కేబుల్ ఆపరేటర్, హిట్స్ ఆపరేటర్, ఐపిటీవీ) ఏవైనా సొంతగా ప్లాట్ ఫామ్ సర్వీసెస్ ( శాటిలైట్ చానల్స్ కానివి) నడుపుకోవటానికి అవకాశం ఉండాలన్న ఎంఐబి అభిప్రాయం పట్ల ట్రాయ్ కి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే పర్యవేక్షణకు, నియంత్రణకు వీలుండేలా వాటి యాజమాన్యం వివరాలను ఆ సంస్థలు వెల్లడించాలి. కేబుల్ టీవీ చట్టంలోని కార్యక్రమాల, ప్రకటనల నియమావళికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో వార్తలు ప్రసారం చేయాలనుకునే లేదా చేస్తున్న పంపిణీ సంస్థలు మాత్రం భారతీయ కంపెనీల చట్టం, 2013 కింద కంపెనీగా నమోదు చేసుకోవాలి.
(ii) ఒక ఎమ్మెస్వో లేదా హిట్స్ ఆపరేటర్ లేదా ఐపిటీవీ ఆపరేటర్ ఇచ్చే లోకల్ చానల్స్ సంఖ్య గరిష్ఠంగా 15 వరకు ఉండవచ్చు.
(iii) కేబుల్ చానల్స్ పంపిణీ చేయాలనుకునే అందరు ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమన్న ఎంఐబి వాదనతో ట్రాయ్ ఏకీభవిస్తున్నది. గతంలో ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్ సమయంలో ఆలస్యం కాకుండా ఉండాలని హోం మంత్రిత్వశాఖ వారి సెక్యూరిటీ క్లియరెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేయటానికి ఎంఐబి ఒప్పుకోవటాన్ని ట్రాయ్ సమర్థించింది. క్లియరెన్స్ వచ్చే లోపు ప్రసారమయ్యే కేబుల్ చానల్స్ జాతీయ భద్రతకు లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఆ కేబుల్ చానల్స్ ను ఉపసంహరించే అధికారం లేదా రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఎంఐబి కి ఉంటుంది. అదే విధంగా లోకల్ చానల్స్ ఇచ్చే అన్ని పంపిణీ సంస్థల సెక్యూరిటీ క్లియరెన్స్ ను సమీక్షించే సమయంలో వాటి యాజమాన్యంలో మార్పులను కూడా తెలుసుకోవాలని, యాజమాన్యంలో మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆ పంపిణీ సంస్థలు హామీ పత్రం ఇచ్చిన తరవాతనే స్థానిక చానల్స్ కు అనుమతి ఇచ్చేలా చూడాలని ట్రాయ్ సిఫార్సు చేసింది.
(iv) పంపిణీ సంస్థలు ప్రసారం చేసే చానల్స్ లేదా కార్యక్రమాలు కేవలం వాటి చందాదారులకు మాత్రమే పరిమితం కావాలన్న ఎంఐబి అభిప్రాయంతో ట్రాయ్ ఏకీభవిస్తోంది. భారతదేశంలో రిజిస్టర్ కాని (సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి డౌన్ లింకింగ్ అనుమతిలేని) విదేశీ చానల్స్ ప్రసారం చేయకూడదు.
(v) పంపిణీ సంస్థల ప్రసారాల విషయంలో ఎంఐబి అభిప్రాయాలని ట్రాయ్ సమర్థిస్తోంది.
(a) పంపిణీ సంస్థలు ( డిటిహెచ్, ఎమ్మెస్వో, హిట్స్ ఆపరేటర్, ఐపిటీవీ) ఏవైనా ప్రసారం చేసే కార్యక్రమాలు తమ పరిధిలోని చందాదారులకు ప్రత్యేకమైనవై ఉండాలి. అదే కార్యక్రమాన్ని లేదా చానల్ ని మరో పంపిణీ వేదిక ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పంచుకోవటానికి వీల్లేదు.
(b) పంపిణీ సంస్థలు ( డిటిహెచ్, ఎమ్మెస్వో, హిట్స్ ఆపరేటర్, ఐపిటీవీ) ప్రసారం చేసే కార్యక్రమం/చానల్ లో డిడి చానల్ గాని, విదేశీ చానల్ గాని, ఇతర చానల్స్ పాత ప్రసారాలతో తయారయ్యే చానల్ గాని ఉండకూడదు. ఏదైనా చానల్ తన పాత ప్రసారాలతో ఒక చానల్ తయారు చేసి పంపిణీ చేయటం కూడా కుదరదు.
(c) డిటిహెచ్ ఆపరేటర్/ ఎమ్మెస్వో/ హిట్స్ ఆపరేటర్/ ఐపిటీవీ తమ చానల్స్ లో వచ్చే కార్యక్రమాలు, లేదా తాము అందించే చానల్స్ మరే ఇతర పంపిణీ వేదికలోనూ ప్రసారం కావటం లేదని, తమ చందాదారులకు మాత్రమే ప్రత్యేకమని హామీపత్రం ఇవ్వాలి.
(d) ఒకవేళ అదే కార్యక్రమం లేదా అదే చానల్ మరో డిటిహెచ్ ఆపరేటర్/ ఎమ్మెస్వో/ హిట్స్ ఆపరేటర్/ ఐపిటీవీ లో ప్రసారమైతే ఆ ప్రసారాన్ని ఆపివేయటంతోబాటు అలాంటి చానల్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అదికారం ఎంఐబి కి ఉంటుంది.
(vi) ఎప్పటికప్పుడు ట్రాయ్ ఇచ్చే ఆదేశాలు, నియంత్రణలకు అనుగుణంగా డిటిహెచ్ ఆపరేటర్/ ఎమ్మెస్వో/ హిట్స్ ఆపరేటర్/ ఐపిటీవీ తమ చానల్స్ ను యాక్టివేట్/డీయాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(vii) డిటిహెచ్ ఆపరేటర్/ ఎమ్మెస్వో/ హిట్స్ ఆపరేటర్/ ఐపిటీవీ ప్రసారం చేసే చానల్స్ వర్గీకరణ విషయంలోనూ ఎంఐబి సిఫార్సులతో ట్రాయ్ ఏకీభవిస్తోంది:
(a) పంపిణీ సంస్థల చానల్స్ ను ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ (ఇపిజి) లో ” ప్లాట్ ఫామ్ సర్వీసెస్ “ అని పేర్కొనాలి. ట్రాయ్ ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా మార్చాలి.
(b) పంపిణీ సంస్థల చానల్స్ కు ధర నిర్ణయిస్తే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ లో ఆ ధర ప్రకటించాలి.
(c) శాటిలైట్ చానల్స్ నుంచి వేరు చేసి చూపేందుకు వీలుగా తెరమీద ప్లాట్ ఫామ్ సర్వీసెస్ అని ప్రకటించాలి. అది వినియోగదారుకు స్పష్టంగా కనిపించేలా ఏ సైజులో ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here