జియోతో తాడోపేడో తేల్చుకునే జాతీయ స్థాయి ఉద్యమం

0
539

ఇది కేబుల్ పరిశ్రమ భయపడిందే అయినా ఆశించింది మాత్రం కాదు. కేబుల్ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి ఇప్పుడు జియో నడుం బిగించింది. కేబుల్ ఆపరేటర్లను, చిన్న ఎమ్మెస్వోలను శాశ్వతంగా మూసెయ్యటానికి పావులు కదుపుతోంది. చందాదారులను ఆకట్టుకునే విధంగా తాత్కాలికంగా ఆకర్షణీయమైన స్కీములు ప్రకటించటం ఒకవైపు, కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి వ్యాపారం నుంచి తరిమేయటం మరోవైపు ఏకకాలంలో సాగించి ఉక్కిరిబిక్కిరిచేసి ఆధిపత్యం నిలబెట్టు కోవటానికి పథకం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే తాను సొంతం చేసుకున్న హాత్ వే, డెన్ సాయంతో బాక్సులు మారుస్తూ మరోవైపు సొంత కేబుల్ నెట్ వర్క్ వేస్తూ కేబుల్ ఆపరేటర్లను భయపెడుతోంది.
కారుచౌక ధరలతో చందాదారులను ఆకట్టుకోవటానికి అతి తక్కువ ధరలకే కేబుల్ టీవీ ఇవ్వటానికి జియో ముందుకొచ్చింది. నిజానికి అది నష్టమే అయినా ఆరునెలలపాటు ఆ నష్టాన్ని భరించటానికి సిద్ధమైంది. దీర్ఘకాలంలో ధరలు పెంచుతుందన్న వాస్తవాన్ని చందాదారుడు గ్రహించేలోగా తాత్కాలిక ప్రయోజనాలతో ఊరించి ఆకట్టుకోవటం జియో వ్యూహం. దాదాపు అన్ని పేరున్న స్టాండర్డ్ డెఫినిషన్ ( ఎస్ డి) చానల్స్ నూ కలిపి నెలకు వందరూపాయలకే ఇస్తుండగా, హెచ్ డి చానల్స్ అయితే రూ. 200 గా నిర్ణయించింది. పైగా, ఇన్ స్టలేషన్ చార్జీలు గాని సెట్ టాప్ బాక్స్ చార్జీలుగాని ఉండవు.

పరిశ్రమ వర్గాలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే, ఈ ఆఫర్ పరిమితకాలానికే వర్తిస్తుంది. అందువలన ఈ ఆరు నెలలు పూర్తవగానే చందాదారులు మళ్లీ పాత లెక్కప్రకారమే కట్టాల్సి ఉంటుంది. కొత్త స్కీము గురించి హాత్ వే ఇప్పటికీ ముంబయ్ లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి హౌసింగ్ సొసైటీలకు లేఖలు రాసింది. స్థానిక పోటీదారులను వ్యాపారం లోనుంచి తరిమేసేందుకే జియో హాత్ వే ఈ వ్యూహం పన్నినట్టు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అలా ఆకట్టుకున్న చందాదారులందరినీ ఆ తరువాత జియో ఫైబర్ చందాదారులుగా మార్చుకోవచ్చునన్నదే ఈ వ్యూహం అని తెలుస్తోంది. జియో ఈ మధ్యనే ఫైబర్ బ్రాడ్ బాండ్ టారిఫ్ కూడా అతి తక్కువ స్థాయిలో రూ. 399 నుంచి ఉండేట్టు ప్రకటించింది.

చందాదారుడు కేవలం రూ.600 కడితే చాలు, అదే ఆరునెలల చందా, బాక్స్, ఇన్ స్టలేషన్. హెచ్ డి కనెక్షన్ కావాలనుకుంటే ఆరు నెలలకు రూ. 1000 కట్టాలి. అందులోనే బాక్స్ ధర, ఇన్ స్టలేషన్, ఆరు నెలల చందా కలిసి ఉంటాయి. ఈ హెచ్ డి ప్లాన్ లో స్టార్ ఇండియా, జీ,సోనీ, డిస్కవరీ, యుటీవీ, టీవీ9 చానల్స్ తోబాటు దాదాపు అన్ని ముఖ్యమైన స్పోర్ట్స్ చానల్స్ కూడా అందుతాయి.

మామూలుగా స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్ అందించే పాకేజ్ ధర రూ. 320 కాగా ఇప్పుడు రూ. 100 కే అందుతోంది. అంటే దాదాపు 70% డిస్కౌంట్ కి ఇస్తున్నట్టు లెక్క. ఇక హెచ్ డి పాకేజ్ విషయానికొస్తే, ఇప్పటిదాకా దాని ధర రూ. 422. కానీ ఇప్పుడు ఇవ్వజూపుతున్న ధర రూ. 200 మాత్రమే. అంటే హెచ్ డి పాకేజ్ కి 50% పైగా డిస్కౌంట్ ఇస్తున్నట్టు. ఈ ఆరునెలల కాలం మామూలు కేబుల్ ఆపరేటర్ ఎలాగూ ఈ పోటీని తట్టుకోవటం సాధ్యం కాదు గనుక వ్యాపారం మూసేసుకోక తప్పదు. జియోకి కావాల్సింది అదే. ఇప్పటికే ముంబయ్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఈ ఆకర్షణీయమైన పాకేజ్ ప్రకటించింది.

చాపకింద నీరులా జియో బాక్సులు
హాత్ వే, డెన్ సంస్థలు ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుల స్థానంలో జియో బాక్సులు పెడుతున్నాయి. గడిచిన ఆరు నెలలకాలంలో డెన్ నెట్ వర్క్స్, హాత్ వే తమ పరిధిలో ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుల స్థానంలో జియో బ్రాండ్ బాక్సులు పెడుతూ వస్తున్నాయి. గడువు ముగిసిన స్టాండర్డ్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్ స్థానంలో ఆపరేటర్లతో మోడల్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్ చేసుకోకపోవటం, బ్రాండ్ మార్చటానికి స్పష్టమైన కారణాలేవీ చెప్పకుండా బలవంతంగా ఆపరేటర్లమీద రుద్దటంలోనే జియో రహస్యపు ఎజెండా అర్థమవుతోంది.

ఎవరైనా స్థానిక కేబుల్ ఆపరేటర్లు అభ్యంతరం చెబితే ప్రీ పెయిడ్ పోర్టల్ లోకి వాళ్ళకు అనుమతిలేకుండా చేసి చందాదారులకు అందించే సేవలకు హాత్ వే, డెన్ అంతరాయం కలిగిస్తున్నాయి. అదే సమయంలో దొడ్డిదారిన కొంతమంది డమ్మీ ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ పరిశ్రమలో అవాంఛనీయ ధోరణులకు పూనుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో జియోకు, బ్రాడ్ కాస్టర్లకు మధ్య ఉన్న ఒప్పందాలను, డెన్, హాత్ వే సంస్థల ఎమ్మెస్వో లైసెన్స్ ప్రస్తుత స్థితిని తెలియజేసే పత్రాలను బహిర్గతం చేయాలని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ఫౌండేషన్ డిమాండ్ చేయటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కేవలం వాటాలు కొనుగోలు చేసిన ఒప్పందంతోనే ఏ సంస్థ అయినా తన సెట్ టాప్ బాక్సులు పెట్టే వీలుంటుందా అనే ప్రశ్నకు కూడా ట్రాయ్, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, జియో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

బెదరింపులు, కేబుల్ కత్తిరింపులుమధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఉజ్జయిని, భోపాల్ నగరాలలో జియో తన సొంత కేబుల్ వెవేసుకోవటంతోబాటు స్థానిక ఆపరేటర్ల కేబుల్స్ కోసివేస్తున్నట్టు అక్కడి ఆపరేటర్లు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆ రాష్ట్ర రాజధానిలో ధర్నాకు దిగారు. అన్యాయంగా, అనైతికంగా వ్యవహరిస్తూ కేబుల్ ఆపరేటర్లను తొలగించేందుకు జియో ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. ఆపరేటర్ల కేబుల్స్ కత్తిరించటం ద్వారా భయపెట్టి, ప్రజలకు కేబుల్ సేవల్లో అంతరాయం కలిగించి ఆపరేటర్లకు చెడ్దపేరుతెచ్చే ప్రయత్నం చేస్తోందని కూడా మధ్య ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.

నిజానికి జియో దాదాపు 150 మంది కేబుల్ ఆపరేటర్లతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు దానికి భిన్నంగా సొంత వ్యాపారం కోసం కేబుల్ వేసుకుంటూ మా కేబుల్ కత్తిరిస్తోందని మధ్యప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం పేర్కొంది. జియో తన వైఖరి మార్చుకోకపోతే దీన్ని దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని, ఆపరేటర్లతో కుదుర్చుకున్న. ఒప్పందాలను ఉల్లంఘించినందుకు కోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా ఉందని సంఘం తేల్చిచెప్పింది.

ఇలాంటి అవాంఛనీయ ధోరణులతో కేబుల్ పరిశ్రమను ధ్వంసం చేయటానికి పూనుకున్న జియో విషయంలో ఎక్కడికక్కడ చిన్న పాటి ఉద్యమాలు చేస్తే సరిపోదనే అభిప్రాయం ఇప్పుడు కేబుల్ పరిశ్రమలో ఏర్పడింది. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో ఎదురైన అనుభవాలు మరికొద్దిరోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎదురవుతాయన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాచాల్సిన సమయం వచ్చింది. తెలుగు రాష్ట్రాలు కూడా మేల్కొని ఉద్యమించకపొతే కేబుల్ వ్యాపారమే మిగలకపోవచ్చు. ఎక్కడికక్కడ ఉద్యమిస్తూ జాతీయస్థాయి ఉద్యమంలో భాగస్వాములైతే తప్ప జియో ఆగడాలకు, దూకుడుకు కళ్ళెం వేయటం, కేబుల్ వ్యాపారాన్ని కాపాడుకోవటం సాధ్యం కాకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here