“టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ కు ఉమ్మడి చట్టాలు వద్దు”

0
850

టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ రంగాలకు ఒకే విధమైన న్యాయసూత్రాలు అమలు చేయాలన్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదనను బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టెలికాం రంగాన్ని నియంత్రించటానికి ఏర్పడిన ట్రాయ్ పరిధిలోకి ఆ తరువాత బ్రాడ్ కాస్టింగ్ రంగాన్ని కూడా చేర్చటం తెలిసిందే. ఈ రెండు రంగాల సమస్యలు వేరువేరుగా ఉన్నా, ట్రాయ్ ఆధ్వర్యం లోనే బ్రాడ్ కాస్టింగ్ కూడా కొనసాగటం మీద ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ రంగాన్ని నియంత్రించటం కోసం ఈ రంగంలోని నిపుణులతో బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (బ్రాయ్) ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.

ఇలా ఉండగా ట్రాయ్ రెండు రంగాలకూ న్యాయసూత్రాలు ఉమ్మడిగా అమలు చేసే దిశలో ఒక ప్రతిపాదన మీద అభిప్రాయ సేకరణకు పూనుకుంది. జనవరిలో ఒక చర్చాపత్రం జారీ చేసి సంబంధితులందరి అభిప్రాయాలూ కోరింది. బ్రాడ్ కాసటర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఫ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఐఎ ఎంఏఐ ), డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డి ఎన్ పి ఏ), అసోసియేషన్ ఆఫ్ రేడియో ఆపరేటర్స్ (ఎఆర్ ఒ ఐ), ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడీసీఎఫ్) తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ట్రాయ్ ప్రతిపాదనను తిరస్కరించాయి.

టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ రంగాలను వేరు వేరు నిబంధనలు అవసరమని, ఒకే గాటన కట్టే వీల్లేదని ఈ సంస్థలు స్పష్టం చేశాయి. కన్వర్జెన్స్ కోసం కలపాలని అనుకోవటం ఇప్పటికిప్పుడు తొందరపాటు చర్య అవుతుందని కూడా చెప్పాయి. అసలు సమస్యల మీద సరైన అవగాహన లేకపోవటం వల్లనే ట్రాయ్ ఇలాంటి ప్రతిపాదన చేసినట్టు ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి. మొత్తంగా బ్రాడ్ కాస్టింగ్ రంగాన్ని నియంత్రించటానికి ‘బ్రాయ్’ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మరో సారి స్పష్టం చేసినట్టయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here