కేబుల్ వేసుకోవటానికి దారి హక్కు నియమాలు

0
1304

కరెంట్ స్తంభాలకు వేలాడే కేబుల్ వైర్లు చూసినప్పుడు చాలామంది అవి చట్ట విరుద్ధమనే అభిప్రాయంలో ఉంటారు. కానీ కేబుల్ వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకున్న కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు అది. దాన్నే రైట్ ఆఫ్ వే ( ఆర్ వో డబ్ల్యు) లేదా దారి హక్కు అంటారు. ప్రభుత్వ సంస్థల ఆస్తులను వాడుకుంటూ కేబుల్స్ వేసుకోవటానికి దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేకమైన అభ్యంతరం ఉంటే తప్ప హక్కు కల్పించాలి. వాటి నిర్వహణకు ఖర్చు అయ్యే పక్షంలో కొంత రుసుము వసూలు చేసుకోవచ్చు. ఇది కేవలం స్తంభాలకు వేసుకునే కేబుల్స్ కు మాత్రమే కాదు, భూగర్భ కేబుల్స్ కు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ భవనాలు, మరేదైనా స్థిరాస్తి మీదుగా కూడా కేబుల్స్ వేసుకోవచ్చు. వాటిని మరమ్మతులు చూసుకోవటానికి ప్రభుత్వ ఆవరణలో ప్రవేశించటానికి కూడా అనుమతి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం మన కేబుల్ సమాచారమ్ పాఠకుల కోసం…
దారి హక్కు ( రైట్ ఆఫ్ వే) కోసం కేబుల్ ఆపరేటర్ల నుండి వచ్చే అభ్యర్ధనలకు వేగంగా క్లియరెన్స్ ఇవ్వడానికి, సరైన రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని నెలకొల్పడానికి మార్గదర్శకాలు.
(కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995 లోని సెక్షన్ 4 బి (5) కింద}
కేబుల్ టీవీ సేవలను అందించడానికి, కేబుల్ ఆపరేటర్ {మల్టీ సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎస్ఓ) లేదా లోకల్ కేబుల్ ఆపరేటర్స్ (ఎల్‌సిఓ)}, ఎప్పటికప్పుడు కేబుల్స్ వేయడం అవసరం. అది భూగర్భం కావచ్చు, ఏదైనా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న స్థిరాస్తి మీద, పైన, వెంబడి కూడా కావచ్చు గనుక కేబుల్ ఆపరేటర్లకు సంబంధిత ప్రభుత్వ సంస్థ అనుమతి అవసరం. (ఎ) ఆ స్థలంలో భూగర్భంలో కేబుల్ వేయటానికి, నిర్వహించటానికి మరియు భూగర్భ తంతులు (బి) కేబుల్స్ లేదా స్తంభాలు పరిశీలించడానికి, మరమ్మతు చేయడానికి, మార్చడానికి లేదా తొలగించడానికి వీలుగా ఆ ఆస్తి ఆవరణలోకి ఎప్పటికప్పుడు ప్రవేశించడం అవసరం. అందువలన ఆ క్రమంలో అక్కడి ఆస్తిని పునరుద్ధరించటానికి , అయ్యే ఖర్చు చెల్లించే షరతులకు లోబడి ప్రభుత్వ సంస్థ అధికారి అనుమతించవచ్చు.

  1. అయితే, ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆ ప్రభుత్వ సంస్థ అధికారి కేబుల్ ఆపరేటర్ వేసిన భూగర్భ కేబుల్ లేదా పోల్ తొలగించటం గాని, స్థానం మార్చడం గాని అవసరమని భావిస్తే, అది తొలగించడానికి లేదా మార్చడానికి కేబుల్ ఆపరేటర్‌ను కోరవచ్చు. అప్పుడు ఆ అధికారి సూచించిన సమయంలోగా దాన్ని స్వంత ఖర్చుతో తొలగించటం లేదా స్థానమార్పిడి చెయ్యాలి.
  2. కేబుల్స్ వేయడానికి కేబుల్ ఆపరేటర్ల నుండి వచ్చిన దరఖాస్తుల మీద త్వరగా నిర్ణయం తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను నిర్దేశించవచ్చని కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995 లోని సెక్షన్ 4 బి (5) పేర్కొంది. అదే విధంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ నియంత్రణలో లేదా నిర్వహణలో ఉన్న ఏదైనా ఆస్తిలో పోల్స్ వేయటంలో ఎదురయ్యే వివాదాల పరిష్కారం అనుమతి నిరాకరణ తదితర అంశాలను కూడా ప్రస్తావించింది.
  3. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ క్రింది మార్గదర్శకాలు ఇచ్చింది. కేబుల్ ఆపరేటర్ల కు రైట్ ఆఫ్ వే (దారి హక్కు) సౌకర్యాన్ని మంజూరు చేయడం, కేబుల్ మౌలిక సదుపాయాలను భూగర్భంలో మరియు / లేదా గాలిలో ఏర్పాటు చేసుకోవటానికి, నిర్వహించుకోవటానికి, ఏదైనా ప్రభుత్వ సంస్థ నియంత్రణలో లేదా నిర్వహణలో ఉన్న ఆస్తిపై ఏర్పాటు, నిర్వహణ విషయంలో అనుమతి నిరాకరించడంతో సహా వివాదాల పరిష్కారం గురించి ప్రస్తావించింది.
  4. విధానం
    5.1 దారిహక్కు కోరుతూ కేబుల్ ఆపరేటర్ దరఖాస్తు సమర్పణ
    5.1.1 కేబుల్ ఆపరేటర్, భూగర్భ మరియు / లేదా గాలిలో కేబుల్ మౌలిక సదుపాయాల స్థాపన కోసం, ఏదైనా ప్రభుత్వ సంస్థ నియంత్రణలో లేదా నిర్వహణలో ఉన్న స్థిరాస్తిలో అవకాశ కోసం ఈ క్రింది వివరాలతో, సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి:
    (ఎ) ప్రభుత్వం మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ కాపీ, అనగా రూల్ 5 కింద స్థానిక కేబుల్ ఆపరేటర్ (ఎల్‌సిఓ) కు హెడ్ పోస్ట్ మాస్టర్, ఎమ్మెస్వో అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రం జతచేయాలి.
    (బి) భూగర్భ కేబుల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన భూమి ఎంతో పేర్కొనాలి;
    (సి) కేబుల్ ఆపరేటర్ తన పనులకు సంబంధించి మరేదైనా సమాచారం ఇవ్వదలచుకుంటే అది
    (డి) కేబుల్ ఆపరేటర్ చేపట్టే పనుల వలన ప్రభుత్వ సంస్థకు జరిగే నష్టాన్ని పూడ్చే బాధ్యత నిర్వర్తించటానికి హామీ
    5.1.2 దరఖాస్తుదారు ఏదైనా దరఖాస్తు రుసుము చెల్లించాలని ఆ ప్రభుత్వ సంస్థ ఆదేశిస్తే ఆ మొత్తం చెల్లించాలి
    5.2 దారి హక్కు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వ సంస్థ అనుసరించాల్సిన విధానం
    5.2.1 ప్రభుత్వ సంస్థ ఈ క్రింది అంశాలకు సంబంధించి దరఖాస్తును పరిశీలించాలి.
    ఎ) భూగర్భ కేబుల్ కోసం ఎంచుకున్న మార్గంలో అప్పటికే ఏదైనా కేబుల్ గాని మరేదైనా అవరోధం ఉంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించటం
    బి) భూగర్భ కేబుల్ మౌలిక సదుపాయాలకు అవసరమైన భూమి విస్తీర్ణం;
    సి) కేబుల్ పనుల వలన జరిగే నష్టాన్ని పూడ్చే బాధ్యత;
    d) కేబుల్ ఆపరేటర్ పనుల వలన ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని అంచనా వేయటం;
    5.2.2 పారా 5.1 కింద కేబుల్ ఆపరేటర్లు చేసిన దరఖాస్తు అందిన తేదీ నుండి 60 రోజులలోగా ప్రభుత్వ సంస్థ ఇలా స్పందించాలి:
    (ఎ) ప్రజల అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ, పునరుద్ధరణ ఛార్జీలు వసూలు చేస్తూ అనుమతి ఇవ్వాలి, లేదా.
    (బి) లిఖితపూర్వకంగా కారణాలు పేర్కొంటూ దరఖాస్తును తిరస్కరించాలి.
    తిరస్కారానికి కారణాలమీద మళ్ళీ తన అభిప్రాయం /అభ్యర్థన చెప్పుకునే అవకాశం దరఖాస్తుదారు అయిన కేబుల్ ఆపరేటర్‌కు ఇవ్వకుండా దరఖాస్తు తిరస్కరించకూడదు;
    దరఖాస్తును స్వీకరించిన 65 రోజులలోపు ఆ ప్రభుత్వ సంస్థ అధికారి అనుమతి ఇవ్వడంలో లేదా దరఖాస్తును తిరస్కరించడంలో విఫలమైతే అనుమతి మంజూరు చేసినట్టే లెక్క.
    కేబుల్ ఆపరేటర్ చేపట్టే పని వలన జరిగే నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ సంస్థ అధికారి కోరవచ్చు. అటువంటి నష్టాన్ని పునరుద్ధరించడానికి ఖర్చులకు బదులుగా ఆ మొత్తానికి బ్యాంక్ హామీ కూడా సెక్యూరిటీగా ఇవ్వాలని కోరవచ్చు.
    5.3 ప్రభుత్వ సంస్థ నుంచి దారి హక్కు అనుమతి పొందిన తరువాత పని చేపట్టడంలో కేబుల్ ఆపరేటర్ బాధ్యతలు
    5.3.1 పనులు ప్రారంభించటానికి ముందే, అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి 30 రోజుల్లోగా ప్రభుత్వ సంస్థ అధికారి నిర్ణయించిన బ్యాంక్ హామీని సమర్పించాలి. మరికొంత సమయం కావాలని కేబుల్ ఆపరేటర్ కోరితే ప్రభుత్వ సంస్థ తనకు సమ్మతమైతే ఒప్పుకోవచ్చు.
    5.3.2 కేబుల్ ఆపరేటర్ పాటించాల్సినవి:
    (ఎ) భూగర్భ లేదా గాలిలో కేబుల్ వేసే సమయంలోను, ఆ తరువాత ప్రజల అసౌకర్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
    (బి) కేబుల్ వేయటానికి ప్రభుత్వ సంస్థ అధికారి అనుమతి మంజూరు చేసే సమయంలో పేర్కొన్న షరతులకు కట్టుబడాలి.
    5.3.3 కేబుల్ ఆపరేటర్ తాను అనుసరించే కేబుల్ రూటింగ్ వివరాలను అందించాలి.
    5.3.4 భూగర్భ కేబుల్ వేయడం లేదా స్తంభాలు వేయటం, వాటిని నిర్వహించడం వరకే తప్ప ఈ అంశంలో కేబుల్ ఆపరేటర్‌కు ఎటువంటి హక్కూ ఉండదు.
    5.4 పనిని పర్యవేక్షించటానికి ప్రభుత్వ సంస్థకు అధికారాలు
    5.4.1 కేబుల్ ఆపరేటర్ అన్ని నిబంధనలనూ పాటిస్తున్నదీ లేనిదీ ప్రభుత్వ సంస్థ పర్యవేక్షించవచ్చు.
    5.4.2 ఆ పర్యవేక్షణ ఆధారంగా మరేవైనా సహేతుకమైన షరతులను విధించవచ్చు.
    5.4.3 తనకు ఇచ్చిన అనుమతుల షరతులను కేబుల్ ఆపరేటర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్టు ప్రభుత్వ సంస్థ నిర్థారణకు వస్తే, అది సమర్పించిన బాంకు హామీని పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోవచ్చు. కారణాలు పేర్కొంటూ, కేబుల్ ఆపరేటర్ కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవచ్చు.
    అయితే, కేబుల్ ఆపరేటర్ తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా మాత్రం చర్య తీసుకోరాదు.
    రాష్ట్రాలకు లేఖ:
    డిజిటజేషన్ సమయంలో 2017 జూన్ 16న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ మిట్టల్ అన్ని రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ (D.O. No. 2/10/2017-DAS) రాస్తూ రైట్ ఆఫ్ వే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం ఆపరేటర్లకు ఆ హక్కు ఉన్నదని చెబుతూ, ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరారు. ఈ మార్గదర్శకాలను కూడా లేఖతో జతపరచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here