లాక్ డౌన్ సమయంలో డిటిహెచ్ ఆదాయం పెరుగుదల

0
592

కోవిడ్-19 వలన ఎన్నో రంగాలు దెబ్బతిన్నప్పటికీ లాభపడిన అతికొద్ది విభాగాలాలో డిటిహెచ్ ఒకటి. ప్రముఖ డిటిహెచ్ సంస్థలు ఆదాయాన్ని పెంచుకోగలగటం చూస్తే వాళ్ళ చందాల ఆదాయం లాక్ డౌన్ సమయంలో గణనీయంగా పెరిగినట్టు స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు ఆతిథ్య రంగం, దుస్తులు లాంటి అనేక రంగాలు జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చుకున్నప్పుడు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు 70-90% ఆదాయం కోల్పోయాయి.
డిటిహెచ్ సంస్థలలో కూడా అత్యధికంగా ఆదాయం పెంచుకోగలిగింది ఎయిర్ టెల్ డిజిటల్. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దీని ఆదాయం 23.4% పెరిగింది. అంతకు ముందు త్రైమాసికం (జనవరి-మార్చి) కాలంతో పోల్చినప్పుడు ఈ పెరుగుదల స్పష్టంగా కనబడింది. ఆదాయం పెరుగుదలను అంకెల్లో చెప్పాలంటే రూ. 603.5 కోట్ల నుంచి 744.8 కోట్లకు పెరిగింది. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న సన్ గ్రూప్ వారి సన్ డైరెక్ట్ డిటిహెచ్ సంస్థ కూడా ఈ సమయంలో 5.4% పెరుగుదల నమోదు చేసుకుంది. అంటే రూ. 205 కోట్ల నుంచి రూ. 216 కోట్లకు పెరిగింది. ఇక డిష్ టీవీ చూస్తే రూ. 791.5 కోట్ల నుంచి రూ.776.6 కోట్లకు పెరగటం ద్వారా 1.9% పెరుగుదల నమోదు చేసుకుంది.
ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలను విశ్లేషిస్తే, ప్రేక్షకులు లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితమై మరిన్ని చానల్స్ కు చందా కట్టటం, ప్రీమియం పాకేజీల వైపు మొగ్గు చూపటం, అంతకుముందు డిటిహెచ్ ఉన్నా, దాన్ని పక్కనబెట్టి కేబుల్ వాడుతున్నవాళ్ళు కూడా మళ్ళీ డిటిహెచ్ పునరుద్ధరించటం లాంటి సంఘటనలు ఎక్కువగా కనిపించాయి. నెలల తరబడి ఇళ్ళకే పరిమితమైన సమయంలో కాలక్షేపం కోసం కొంతమంది, కరోనా గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనే ఆలోచనలో మరికొందరు ఇలా డిటిహెచ్ ని గరిష్టంగా వాడుకోవటానికి ప్రయత్నించటం ఈ పరిస్థితికి దారితీసినట్టు అర్థమవుతోంది. అదే సమయంలో గమనించాల్సిన విషయమేంటంటే డిటిహెచ్ ఆపరేటర్లు అందరూ ఒకే స్థాయిలో ప్రయోజనం పొందలేదు. ప్రీమియం చానల్స్ అత్యధికంగా ఉన్న ఎయిర్ టెల్ డిజిటల్, టాటా స్కై బాగా లబ్ధి పొందగా మిగిలినవాటి అదనపు ఆదాయం నామమాత్రంగా ఉంది.
టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ లాభ పడటానికి మరో ప్రధాన కారణం ఇటీవల ట్రాయ్ ప్రకటించిన కొత్త టారిఫ్ ఆర్డర్ ను ఈ సంస్థలు అమలు చేయటం. ఈ ఆర్డర్ ప్రకారం నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద చెల్లించే రూ.130 కి తప్పనిసరి డిడి చానల్స్ సహా 100 ఉచిత చానల్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు అదే ధరకు 200 చానల్స్ ఇవ్వాలని ట్రాయ్ నిర్దేశించటంతో ఈ సంస్థలు దాన్ని అమలుచేశాయి. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నప్పుడు రెండో కనెక్షన్ నుంచి 40% మాత్రమే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు వసూలు చేయాలన్న నిబంధనను అమలు చేయటం వలన మరికొందరు చందాదారులను ఆకట్టుకోగలిగాయి.
ధరలో ఎలాగూ పెద్దగా తేడా లేనప్పుడు ఎక్కువమంది చందాదారులు డిటిహెచ్ వైపు వెళ్ళటం ద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రీమియం, హెచ్ డి చానల్స్ చూసే అవకాశాన్ని వాడుకోదలచుకున్నారు. పాత స్థానం కోసం కష్టపడుతున్న డిష్ టీవీ కరోనా కష్టకాలంలో సైతం తన చందాదారుల సంఖ్యలో కొంత పెరుగుదల నమోదు చేసుకోగలిగింది. ఇళ్లలో ఉండి మరింత వినోదం పొందాలనుకునేవారిని డిటిహెచ్ సంస్థలన్నీ బాగానే ఆకట్టుకోగలిగాయనటానికి వాటి ఆదాయంలో పెరుగుదలే నిదర్శనం. అదే సమయంలొ ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కేబుల్ రంగం ఆశించిన స్థాయిలో బ్రాడ్ బాండ్ ను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here