పే చానల్ బ్రాడ్ కాస్టర్లు చందా ధరలు పెంచారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి నెలవారీ కేబుల్ చందా పెరగబోతోంది. ధరల నియంత్రణకు ప్రయత్నిస్తున్నట్టు రెండేళ్లకు పైగా చెబుతూ వచ్చిన ట్రాయ్ అనేక కోర్టు కేసుల తరువాత కూడా విఫలమై బ్రాడ్ కాస్టర్లకు తలొగ్గాల్సి వచ్చింది. చివరికి వినియోగదారుడే బలవుతున్నాడు. సగటున ఒక్కో చందాదారుడు ఇప్పుడు నెలకు 40 రూపాయల దాకా అదనపు చందా కట్టే పరిస్థితి వచ్చింది.
పే చానల్ యజమానులు బొకేల పేరుతో చందారుడి మీద భారం మోపుతున్నారన్న ఫిర్యాదులు రావటంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నించింది. 2020 జనవరి 1 న రెండో టారిఫ్ ఆర్డర్ – ఎన్టీవో 2.0 పేరుతో సవరణలకు శ్రీకారం చుట్టింది. గరిష్ఠ చిల్లర ధర 19 రూపాయలకు బదులు 12 రూపాయలు ఉండాలని, బొకే లో ఇచ్చేటప్పుడు డిస్కౌంట్ ఎర వేసి బిల్లు పెరిగేటట్టు చేయకూడదని చెప్పింది.
అదే సమయంలో ఒక ఇంట్లో ఒకటి మించి కనెక్షన్లు ఉంటే అదనపు కనెక్షన్ కు వసూలు చేసే కనీస ధర రూ.154 కు బదులు రూ.62 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. ఈ కనీస ధరలు ఇచ్చే చానల్స్ సంఖ్య 100 కు బదులు 200 కు పెంచాలని, ఇవి కాకుండా 26 దూరదర్శన్ చానల్స్ కూడా ఇవ్వాలని చెప్పింది. పంపిణీ సంస్థలు ఈ నిబంధనలను ఒప్పుకున్నాయి. కానీ పే చానల్ యజమానులు మాత్రం ధరల తగ్గింపుకు ససేమిరా అన్నారు.
దీంతో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. రెండేళ్లకు పైగా కోర్టులో నలిగిన తరువాత ట్రాయ్ కి అనుకూలంగానే తీర్పు వచ్చినా, అమలు చేయటంలో బ్రాడ్ కాస్టర్లు తెలివిగా వ్యవహరించి మళ్ళీ ధరల భారం మోపారు. ట్రాయ్ కి ఏం చేయాలో పాలుపోక చివరికి బ్రాడ్ కాస్టర్లకు తలొగ్గింది. మూడేళ్ళ తరువాత ఇప్పుడు ధరల పెంచుకునే అవకాశం పే చానల్స్ కు ఇచ్చినట్టయింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రాబోతున్నాయి. బ్రాడ్ కాసటర్లు కోరుకున్నట్టే గరిష్ఠ చిల్లర ధర మళ్ళీ రూ.19 అయింది. బొకేల షరతులు కూడా పోయాయి.
నవంబర్ 22 న వచ్చిన కొత్త టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా ఇప్పటికే జీ, సోనీ సంస్థలు పెంచిన ధరలు ప్రకటించాయి. త్వరలో స్టార్, వయాకామ్-18 కూడా ప్రకటిస్తాయి. జీ, సోనీ ప్రకటించిన బొకే ధరలు చూస్తుంటే బొకే ధరలు 10 నుంచి 15 శాతం దాకా పెరిగాయని తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువ కూడా పెరిగింది. ఉదాహరణకు సోనీ బొకే ధర ఇంతకుముందు రూ.31 ఉండేది. ఇప్పుడది రూ.43 అయింది. అంటే, 36 శాతం పెరిగినట్టు. ఆ విధంగా వినియోగదారులమీద భారం పెంచి, పే చానల్స్ కు మేలు చేయటం తప్ప ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ వల్ల ఒరిగిందేమీ లేదు.
బ్రాడ్ కాస్టర్ల వాదన ఏంటంటే, మూడేళ్ళుగా ధరలు పెంచలేదు గనుక ఆ మాత్రం పెంచటం భారమేమీ కాదన్నది. అన్నీ ధరలూ పెరుగుతున్న సమయంలో పే చానల్ ధరలు కూడా పెంచుకోవటం సమంజసమేనంటున్నారు. ప్రొడక్షన్ ఖర్చులు, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ బాగా పెరిగిన కారణంగా ఎ చానల్ ధరలు పెంచుతున్నామంటున్నారు. ఆ అ
అదే సమయంలో బ్రాడ్ కాస్టర్లు తమ చానల్స్ పంపిణీ చేసే సంస్థలకు వాటి గరిష్ఠ చిల్లర ధరమీద 45 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వవచ్చునని ట్రాయ్ చెప్పింది. అందువలన రకరకాల బొకేల ద్వారా చందాదారును ఆకట్టుకోవటానికి బ్రాడ్ కాస్టర్లు డీపీవోలకు ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. ఇందులో కారేజ్ ఫీజు కూడా కలిసే ఉంటుంది. మొత్తానికి పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు కూడా లాభంపొందేలా ట్రాయ్ ఈ టారిఫ్ ఆర్డర్ నిర్ణయించింది.
మూడేళ్ళుగా సాగిన వివాదం పరిష్కారమైనట్టు పైకి కనిపిస్తున్నా, బ్రాడ్ కాసటర్లకూ, ట్రాయ్ కి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని ఒప్పుకోక తప్పదు. ఈ బంధం వల్ల చందాదారు మీద భారం పెరిగి, పంపిణీ సంస్థలు ఎక్కువగా నష్టపోతాయి. చందాదారులు ఇతర మార్గాలు ఎంచుకునే అవకాశముంది. ఉత్తరాడిదిన ఉచిత డీటీహెచ్ వేదిక డీడీ ఫ్రీడిష్ కు ఇప్పటికే ఆదరణ పెరుగుతూ ఉండగా ఇకమీదట మరింతమంది అటువైపు వెళ్లవచ్చు. ఓటీటీ వేదికలకు మొగ్గు చూపుతున్నవాళ్ళు కూడా ఈ ధరల పెంపు వలన కేబుల్, డీటీహెచ్ వదిలేసి ఓటీటీకి వెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
