కొన్ని చానల్స్ మూసేస్తాం: సోనీ బాటలో జీ

0
526

సోనీ సంస్థ కొన్ని చానల్స్ మూసేసిన నేపథ్యంలో జీ గ్రూప్ కూడా అదే బాటలో నడవబోతున్నట్టు స్పష్టమైంది. జీ ఇంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్  లిమిటెడ్ మేమేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా ఈ మేరకు సూచనప్రాయంగా వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఆదాయ వ్యయాలను బేరేజు వేసుకుంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే కొన్ని చానల్స్ మూసి వేయగా, ఇప్పుడు భారత్ లోనూ అదే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఈ విషయంలో త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందన్నారు.

వాటా దారుల విషయంలో ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ నుంచి ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోయిందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని జీవనోపాథి కోల్పోయినవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారని గుర్తు చేశారు.

వినియోగదారులు నగదు ఆదా చేసుకోవటం మీద దృష్టి పెట్టటంతో చానల్స్ ఆదాయం బాగా తగ్గిపోయిందని, వినియోగదారుల నిర్ణయాల ఫలితంగా ప్రకటనలు ఇచ్చే సంస్థలు కూడా ఖర్చు తగ్గించుకున్నాయని అన్నారు. నిజానికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే చానల్స్ మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఉందన్నారు. ఇలా ప్రకటనదారులు వెనకడుగు వేయటంతో చానల్స్ పరిస్థితి దెబ్బతిన్నదన్నారు.

మరోవైపు చదువుకున్న మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు స్ట్రీమింగ్ వేదికలైన అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఒటిటి వేదికలతో తమ వినోద అవసరాలు తీర్చుకోవటం మొదలుపెట్టటం కూడా కొన్ని చానల్స్ ను దెబ్బతీసిందన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ చానల్స్ విషయంలో ఇలాంటి ప్రభావం ఎక్కువగా కనబడుతోందన్నారు. అయితే, తమ గ్రూప్ ఇటీవలి కాలంలో జీ5 లో పెట్టుబడులు పెంచటాన్ని ప్రస్తావిస్తూ, కాలానికి అనుగుణంగా ఒటిటి వేదిక ద్వారా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఇలా ఉండగా ట్రాయ్ ఇచ్చిన తాజా టారిఫ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తే పే చానల్ ఆదాయం కనీసం 30% తగ్గుతుందన్న మార్కెట్ అంచనాలు కూడా జీ గ్రూప్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. లాభదాయకం కాని చానల్స్ ను మూసివేయక తప్పకపోవచ్చు. స్టార్ కూడా స్టార్ వాల్డ్ చానల్ మూసివేస్తామని పరోక్షం గా చెప్పింది. జీ గ్రూప్ మాత్రం మూసి వేసిన చానల్స్ ను తన ఒటిటి వేదిక లో ఇవ్వటం ద్వారా ఆదాయం కోల్పోకుండా చూడాలన్న ఆలోచనలో ఉంది. ” ప్రేక్షకులు టీవీ నుంచి ఒటిటి కి మారతారే తప్ప మాయమైపోరుగా” అంటున్నారు జీ ఎండీ పునీత్ గోయెంకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here