స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ లోకి రిలయెన్స్ ?

0
791

రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్, రిలయెన్స్ జియో ద్వారా స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు ధ్రువపడుతున్నాయి. క్రీడా ప్రసార హక్కులు సొంతం చేసుకునే ప్రక్రియలో తొలి అడుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో పాల్గొనటంతోనే పడుతుందని భావిస్తున్నారు. ఈ వేలం ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశముంది. ఇప్పటికే స్పోర్ట్స్ కి సంబంధించిన బృందాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్ లో యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసి డెంట్ గా ఉన్న అనిల్ జయరాజ్ ను స్పోర్ట్స్ బిజినెస్ సీఈ వో గా తీసుకున్నారు. ఆయన నెట్ వర్క్ 18, టీవీ 18 ఎండీ అయిన రాహుల్ జోషికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 న స్టార్ స్పోర్ట్స్ నుంచి తప్పుకొని 16 న కొత్త బాధ్యతలు తీసుకుంటారు. స్పోర్ట్స్ ఛానల్ ప్రారంభించటామన్నది టీవీ 8 వారి బ్రాడ్ కాస్టింగ్ విభాగమైన నెట్ వర్క్ 18 ద్వారా జరుగుతుందని తెలుస్తోంది. దీనికి వయాకాయం 18 లో మెజారిటీ వాటాలున్నాయి. టీవీ 18 ఆధ్వర్యంలో ప్రస్తుతం భారతదేశంలో న్యూస్, నాన్-న్యూస్ కలిపి మొత్తం 57 చానల్స్ నడుస్తున్నాయి. ఈ ఛానల్స్ లో జనరల్ ఎంటర్టైన్మెంట్, మూవీస్, రీజినల్ , కిడ్స్, ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్, , యూత్ . మ్యూజిక్ చానల్స్ ఇందులో ఉన్నాయి. ఒక్క స్పోర్ట్స్ మాత్రమే లేకపోవటం ప్రధానమైన లోటుగా కనిపిస్తూ వచ్చింది. టీవీ18, వయాకామ్ కలసి 51:49 నిష్పత్తి వాటాలతో చేసుకున్న జాయింట్ వెంచర్ ఒప్పంద ఫలితమే వయాకామ్ 18. కొంతకాలంగా ఈ గ్రూప్ స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్ లో ప్రవేశించాలని ఆలోచిస్తూ వస్తున్నప్పటికీ, ఇందులో ఇమిడి ఉన్న భారీ పెట్టుబడి దృష్ట్యా కాస్త నిదానిస్తూ వచ్చింది. కానీ రిలయెన్స్ జియో రంగా ప్రవేశం చేశాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు విడత అది ఐపీఎల్ డిజిటల్ హక్కులు, బీసీసీఐ మీడియా హక్కులకోసం పోటీ పడింది కూడా. ఈసారి జరగబోయే ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో జియో అటు డిజిటల్, ఇటు టీవీ హక్కుల కోసం వేలంలో పాల్గొనే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. 2018 లో రిలయెన్స్ జియో టీమిండియా ఆడే ఆటలకు ఐదేళ్ళ నాన్ – ఎక్స్ క్లూజివ్ డిజిటల్ హక్కులకోసం ఐదేళ్ళ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. భారతదేశపు సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్ వీ ఒ డీ) మార్కెట్ మీద మీడియా పార్టనర్స్ ఏషియా ఇచ్చిన నివేదిక ప్రకారం ఈసారి ఐపీఎల్ హక్కుల కోసం డిస్నీ, అమెజాన్, ఫేస్ బుక్, జియో, సోనీ పోటీ పడే అవకాశముంది. గూగుల్ తో కలిసి జియో తన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ను అందుబాటు ధరలో విడుదల చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకోవటం జియో కు చాలా ముఖ్యం. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ సంఖ్యను భారీగా పెంచే అవకాశమున్న ఈ కొత్త ఫోన్ వలన ఇప్పుడు 76 కోట్ల స్మార్ట్ ఫోన్ల సంఖ్యకు మరో 50 కోట్లు జోడించవచ్చునని భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకు ఐపీఎల్ ఒక అందివచ్చిన అవకాశం అవుతుంది. ఇంతకీ ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని గమనించాలి. ఐపీఎల్ 2020 డిస్నీ+హాట్ స్టార్ లో 26 కోట్లమందికి చేరింది. ఈ అద్భుతమైన స్పందనతో వచ్చిన ఆనందంతో 2021 కి డిస్నీ+హాట్ స్టార్ 26 నుంచి 28 కోట్ల మందిని లక్ష్యంగా చేసుకుంది. ఈ సంకీయను 3, 4 రేట్లు పెంచుకోవటానికి అవసరమైన మౌళికసదుపాయాలను జియో సిద్ధం చేసి పెట్టిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ జియో నిజంగానే ఐపీఎల్ హక్కులు కొనుక్కోగలిగితే టోర్నమెంట్ స్థాయి కనీవినీ ఎరుగని విధంగా పెరిగిపోతుంది. ఇంతకు ముందెన్నడూ కనీసం ఊహకు సైతం అందని స్థాయిగా తయారవుతుందని భావిస్తున్నారు. టీవీ విషయానికొస్తే, ఈ అంకెలు మరింత భారీగా ఉన్నాయి. ఐపీఎల్ 2020 ని 40 కోట్ల 50 లక్షలమంది వీక్షించారు. అంటే, భారతదేశపు మొత్తం ప్రేక్షకులలో సగమన్నమాట. ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ ఇండియా ఐపీఎల్ 2021 మొదటి 26 మాచ్ ల ద్వారా 35.2 కోట్లమందిని చేరుకుంది. 2022 వరకు ఐదేళ్ళపాటు ఐపీఎల్ హక్కులు సొంతం చేసుకోవటానికి స్టార్ ఇండియా రూ. 16347.5 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది. ఐపీఎల్ మొదటి పదేళ్ళకోసం సోనీ చెల్లించిన మొత్తానికి ఇది రెట్టింపు కావటం విశేషం. అప్పట్లో స్టార్ ఈ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకున్నప్పుడు నష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి. కానీ ఆ అంచనాలు తప్పని రుజువైంది. ఒకవైపుదూకుడుగా మార్కెటింగ్ చేయటం, మరోవైపు డిజిటల్ కూడా తోడై చందాల ఆదాయాన్ని, ప్రకటనల ఆదాయాన్ని విపరీతంగా పెంచేశాయి. దీంతో స్టార్ లాభాలతోనే మిగులుతుందని అర్థమైపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here