తప్పుదారి పట్టించే ప్రకటనలమీద ఫిర్యాదులు, ఆస్కీ పరిష్కారం

0
515

టీవీలలో వచ్చే ప్రకటనలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని, పోటీ ఉత్పత్తులను తక్కువ చేసే విధంగా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుల మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్ద్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఆస్కీ) దర్యాప్తు జరిపింది. కొన్ని సంస్థలు స్వయంగా ఆ ప్రకటనలను వెనక్కి తీసుకోగా, మరికొన్ని సంస్థలు అందులో తప్పేమీ లేదన్నట్టుగా వాదించాయి. మొత్తం 250 కి పైగా ఫిర్యాదులు రాగా 23 సంస్థలు తమకు తాముగా ఉపసంహరించుకున్నాయి. 228 ప్రకటనల మీద కన్స్యూమర్ కంప్లెయిట్స్ కౌన్సిల్ సుమోటోగా దర్యాప్తు చేసి అందులో 209 కేసులలో తప్పు జరిగినట్టు నిర్థారించింది.

ఉపసంహరించుకున్న ప్రకటనలను పక్కనబెడితే, తప్పు జరిగినట్టు తేలిన వాటిలో 162  హెల్త్ కేర్ రంగానికి సంబంధించినవి కాగా 47 విద్యారంగానికి సంబంధించినవి. మిగిలినవి ఆహారం, శీతలపానీయాలు తదితర విభాగాల ప్రకటనలు. కొన్ని బ్రాండ్ల ప్రకటనలు చూద్దాం:

హిందుస్తాన్ యూనిలివర్ ( బ్రూ ఇన్ స్టంట్)

టీవీలోను, యుట్యూబ్ లోను ప్రసారమవుతున్న ఈ ప్రకటనలో ” టీ నీకు అంత ఎక్కువ శక్తి నివ్వదు” అనే మాట వాడటం సృజనాత్మక చిత్రీకరణ కిందికి రాదని దర్యాప్తు తేల్చింది. కాఫీ తయారీకి నూరు శాతం పాలు వాడాలని అందులో సూచించారు. ఈ ప్రకటనలో అనవసరంగా మొత్తంగా టీ మీద దుష్ప్రచారం చేయటాన్ని సిసిసి దర్యాప్తు బృందం తప్పుపట్టింది. మెట్లెక్కి సూట్ కేసులు మోసుకురావటమన్నది రోజువారీ ఇళ్లలో జరిగేదే కాబట్టి సృజనాత్మక చిత్రీకరణ ముసుగులో ఇలా తప్పించుకోవాలనుకోవటం కుదరదని తేల్చి చెప్పింది. కెఫిన్ గాని, పాలు గాని ఆ స్థాయిలో శక్తినివ్వలేవని కూడా పేర్కొంది.

సుజుకి మోటర్ సైకిల్ ఇండియా ( సుజుకి ఆక్సెస్ 125)

ఇప్పుడు బిఎస్ 6 టెక్నాలజీతో తక్కువ తాగుతుంది అంటూ తక్కువ పెట్రోల్ అవసరమన్న ప్రకటన అతిగా చెప్పటమేనని  వినియోగదారుల ఫిర్యాదుల మండలి (సిసిసి) అభిప్రాయపడింది. ఈ ప్రకటన సారాంశంతో మండలి ఏకీభవించలేదు. తక్కువ ఇంధనంతో పనిచేస్తుందని చెప్పటాన్ని తప్పు పట్టింది. అందుకు తగిన ఆధారాలు చూపలేదని కూడా అభిప్రాయపడింది.

కియా మోటర్స్ (కియా సెల్టోస్)

ఇందులో ఒక యువతి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చెస్తూ ఉంటుంది. తన ప్రాక్టీస్ లక్ష్యాలుగా చెత్త బుట్ట, గోడ మీద పెయింటింగ్, గంట, గేట్, తలుపులు, కారు అద్దాల లాంటివి ఎంచుకుంటూ ఉంటుంది. అందులో ప్రభుత్వ, ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ఉంటాయి. ఆ తరువాత అక్కడ పార్క్ చేసి ఉన్న కియా సెల్టోస్ ఎంచుకున్నా, అదే చేసే శబ్దానికి ఉలిక్కిపడుతుంది. నిరాశ చెంది వెళ్ళిపోతుంది.  అయితే, ఈ ప్రకటనలోని దృశ్యాలు జీవితంలో ఒక భాగమన్న వాదనతో సిసిసి ఏకీభవించలేదు.

కోల్గేట్-పామోలివ్ (కోల్గేట్ స్వర్ణ వేద్ శక్తి)

నోరు స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతూ, నోటి అపరిశుభ్రత వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశముందన్నది ఆ ప్రకటన సారాంశం. నోటిలో క్రిములు చేరితే మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్య..ఇలా ఎన్నీ వ్యాధులు వస్తాయని, కోల్గేట్ వేద శక్తి రోజూ వాడితే ఆ క్రిములు నోట్లోనే నాశనమవుతాయి కాబట్టి ఈ వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చునని చెబుతుంది. అయితే, ఇందుకు ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయిందని సిసిసి అభిప్రాయపడింది. ఇది తప్పుదారిపట్టించేలా, అయోమయంగా, అతిశయోక్తితో కూడి ఉందని త్రోసిపుచ్చింది.

ఫాస్ట్ ట్రాక్ 24గం. వెయిట్ లాస్ సెంటర్ 

డెహ్రాడూన్ లోని కేంద్రం ఒక్కటే  బరువు తగ్గాలన్న మహిళల కలను సాకారం చేస్తుందని. అది కూడా నెలరోజుల్లోనే సాధ్యమని ఆ ప్రకటన చెబుతుంది.  కానీ అలా ఒక కాలపరిమితిలో తగ్గటాన్ని ఏ విధంగానూ సోదాహరణంగా వివరించలేకపోయిందని సిసిసి అభిప్రాయపడింది.  గరిష్ఠంగా  11  నెలల్లో 64 కిలోల బరువు తగ్గటమన్నది కూడా ఎలాంటి ఆధారమూ లేని ప్రకటనగా పేర్కొంది. ఆరోగ్య స్థితితో సంబంధం లేకుండా ప్రతి కస్టమర్ కూ అది సాధ్యమేనన్న ధోరణిలో అతిశయోక్తితో ప్రకటన సాగటం పట్ల సిసిసి అభ్యంతరం వ్యక్తం చేసింది.

వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వోడాఫోన్ రెడ్ ఎక్స్)

డేటా స్పీడ్ 50% అదనపు వేగంతో ఉంటుందని, అపరిమిత డేటా ఉంటుందని చెబుతూ, ఎలాంటి డిస్ క్లెయిమర్ లేకపోవటం కేవలం తప్పుదారి పట్టించటమేనని పేర్కొంది. కస్టమర్లు అంతా వాడుకుంటే అది ఎలా సాధ్యమవుతుందో తెలిసినా తప్పుదారిపట్టించటం తగదని సిసిసి అభిప్రాయపడింది. అందుకు తగిన విధంగా సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేసిందో చెప్పటంలో కూడా సంస్థ విఫలమైనట్టు పేర్కొంది.

ఆస్కీ చర్యలు తీసుకున్న బ్రాండ్లలో ఇవి కొన్ని మాత్రమే. అయితే, ఇలాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినా పరిశీలించి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే ముఖ్యమని ఆస్కీ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here