న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సంఘం నుంచి తప్పుకున్న టీవీ9

0
794

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్ బి డి ఎ) నుంచి వైదొలగుతున్నట్టు టీవీ 9 సీఈవో బారుణ దాస్ ఆ సంఘానికి లేఖ రాశారు. బార్క్ రేటింగ్స్ మరింత ఆలస్యం కావటానికి ఆ సంఘం వైఖరే కారణమని ఆయాన ఆరోపించారు. బార్క్ రేటింగ్స్ డేటా ఇచ్చే ముందు అన్నీ సరిచూసుకొని పూర్తిపారాదర్శకంగా ఉండేట్టు చూసుకోవాలని ఎన్ బిడిఎ ఒక పత్రికాప్రకటన జారీచేయటం కేవలం మరింత ఆలస్యం చేయాలన్న లక్ష్యంతోనేనని ఆ లేఖలో బరుణ్ దాస్ ఆరోపించారు.

రేటింగ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఏవీ ఆరోపించకపోగా, ఒక్క న్యూస్ చానల్స్ కు మాత్రమే అభ్యంతరం ఉండటం అర్థరహితమని ఆయన విమర్శించారు. ఎన్ బి డి ఎ బోర్డులో కొందరు సభ్యుల ఈ అనుమానాలను తాము సమర్థించబోవటం లేదని, ఇది కేవలం కొందరు సభ్యుల అభిప్రాయం మాత్రమే తప్ప మెజారిటీ అభిప్రాయం కాదన్నారు. ఏడాదిగా రేటింగ్స్ లేకపోవటంతో న్యూస్ చానల్స్ ఆదాయం, విశ్వసనీయత దెబ్బతిన్న తరుణంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశం వెంటనే అమలు చేయాలని కోరటానికి బదులు ఇంకా బార్క్ ను శంకించటమేమటాని బరుణ్ దాస్ ప్రశ్నించారు. అసలు రేటింగ్స్ ఇవ్వటం ఎన్ బి డి ఎ కు ఇష్టమున్నదో లేదో తెలియని పరిస్థితి ఉందని, అందుకే ఈ వైఖరికి నిరసనగా సంఘంలో ఉన్న పూర్తి స్థాయి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తమ నెట్ వర్క్ తప్పుకుంటున్నదని స్పష్టం చేశారు. తమ సభ్యత్వ రుసుములో మిగిలిన మొత్తాన్ని సంఘం నియమాలకు అనుగుణంగా వాపస్ చేయాలని కూడా టీవీ 9 సీఈవో ఆ లేఖలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here