బ్రాడ్ కాస్టర్లలో అయోమయం: 10న కోర్టు ఆదుకుంటుందా?

0
557

టీవీ బ్రాడ్ కాస్టర్లు ఇప్పుడు గందరగోళంలో పడ్దారు. తగ్గింపుధరలు ప్రకటించటానికి ట్రాయ్ పెట్టిన గడువు 10వ తేదీ (సోమవారం) తో పూర్తి కాబోతున్నది. ఆ ఉత్తర్వులు అపాలంటూ బొంబాయి హైకోర్టులో పెట్టుకున్న దరఖాస్తు మీద విచారణ మొదలుకాలేదు. గురు, శుక్రవారాల్లో నిరాశే ఎదురైంది. సోమవారం నాడు ట్రాయ్ చెప్పిన విధంగా టారిఫ్ ప్రకటించటమా, కోర్టు తీర్పు వస్తుందేమో ఎదురు చూడటమా అనే విషయంలో అయోమయంలో పడ్డారు.

ఈ ఏడాది జనవరి 1న ట్రాయ్ రెండో కొత్త టారిఫ్ ఆర్డర్ ఇస్తూ చానల్ ధరలమీద, బొకేల ధరలమీద పరిమితులు విధించటం తెలిసిందే. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టుకెళ్ళినా స్టే దొరకలేదు. తీర్పు రిజర్వ్ అయింది. అయితే, ట్రాయ్ కూడా సంయమనం పాటిస్తూ లాక్ డౌన్ సమయంలో తన ఆదేశాల అమలుకు పట్టుబట్టలేదు. ఆరు నెలలు ఓపికపట్టాక జులై 24న బ్రాడ్ కాస్టర్లకు ఆదేశాలిస్తూ ఆగస్టు 10 లోగా ధరలు ప్రకటించాలని చెప్పింది. దీనిమీద బ్రాడ్ కాస్టర్లు బొంబాయి కోర్టులో మళ్ళీ దరఖాస్తు చేసుకోగా ఇంకా విచారణే మొదలుకాలేదు.

ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లు కోర్టు విచారణ, తీర్పు దాకా ఆగితే ట్రాయ్ తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. సోమవారం లోగా ట్రాయ్ చెప్పిన కొత్త ధరలతో బొకేలు రూపొందింది ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ ప్రకటిస్తే వాటితోబాటే రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ కూడా వెబ్ సైట్స్ లో అప్మ్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్ ) దాన్ని డౌన్ లోడ్ చేసి సంతకం చేసి పంపితే అది అమలులోకి వచ్చినట్టే. ఇంతకుముందు చర్చల తరువాత సంతకాలు చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు.

 కానీ బ్రాడ్ కాస్టర్లు అలా తలొగ్గుతారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. గడువులోగా ట్రాయ్ ఉత్తర్వులు పాటించకుండా కోర్టు ఆదేశాలకోసం ఎదురుచూడటానికే మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ముగ్గురో, నలుగురో చిన్న బ్రాడ్ కాస్టర్లు మాత్రమే ట్రాయ్ కొత్త ఆదేశాలు పాటించారు. ట్రాయ్ చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్టే కనబడుతోంది. 10 లోగా మరోమారు హెచ్చరిస్తుందా, లేదా 10 వరకు వేచి చూస్తుందా అనేది తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here