సరైన సెట్ టాప్ బాక్స్ ఎంచుకోవటం ఎలా ?

0
509

డిజిటైజేషన్ లో ప్రసారాలనాణ్యత, అదనపు సౌకర్యాలు ఆధారపడేది సెట్ టాప్ బాక్స్ మీదనే కాబట్టి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటం చాలాముఖ్యం. తాత్కాలికంగా సెట్ టాప్ బాక్సులమీద పెట్టుబడి పెట్టేది ఎమ్మెస్వో అయినప్పటికీ కొనుగోలు చేసేది వినియోగదారుడే. మధ్యలో కొంతమేరకు ఆపరేటర్ కూడా బాధ్యత వహిస్తాడు. ఈ క్రమంలో డిజిటైజేషన్ మీద, అందులో సెట్ టాప్ బాక్సుల పాత్ర మీద, సెట్ టాప్ బాక్సుల పనితీరుమీద, సరైన సెట్ టాప్ బాక్సును ఎంచుకోవటం మీద సాధారణంగా వచ్చే అనేక అనుమానాలకు సమాధానాలిస్తూ ఈ వ్యాసం సాగుతుంది.
సెట్ టాప్ బాక్స్ అంటే ఏమిటి ?
సెట్ టాప్ బాక్స్ అంటే చందాదారు ఇంట్లో టీవీ సెట్ కు అనుసంధానమై ఉండే పరికరం. అది చందాదారునికి చెల్లింపు పద్ధతిమీద అతడు కోరుకున్న ఎన్ క్రిప్టెడ్ చానల్స్ చూసే అవకాశమిస్తుంది. ఈ సెట్ టాప్ బాక్స్ ప్రాథమిక విధి ఏంటంటే చందాదారు ఎంచుకుని చెల్లింపు జరిపిన చానళ్ళ సిగ్నల్స్ ను డీకోడ్ చేసి డిజిటల్ సిగ్నల్స్ ను అనలాగ్ సిగ్నల్స్ గా మార్చి టీవీ సెట్ మీద చూసేలా చేస్తుంది. స్మార్ట్ కార్డ్ లేదా వ్యూయింగ్ కార్డ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎటిఎం కార్డ్ లాగా పనిచేస్తుంది. ఇది సెట్ టాప్ బాక్స్ తో కలిసి వస్తుంది. నిర్దిష్ట కాలానికి చందాదారుడు ఏ చానల్స్ కు చందా కడతాడో ఆ చానల్స్ సిగ్నల్స్ మాత్రమే అందిస్తుంది. డిజిటల్ అడ్రెసిబిలిటీ లో చందాదారుడి వివరాలను నియంత్రించే అవకాశం ఉండటం వలన అతడి పాకేజ్ వివరాలు ఎప్పుడు కావాలన్నా ఎమ్మెస్వో తన డేటా బేస్ లో మార్చవచ్చు. అది నేరుగా గాని, ఆపరేటర్ సూచనమేరకు గాని జరుగుతుంది. సెట్ టాప్ బాక్స్ తో అనుసంధానమై ఉన్న ఏ స్మార్ట్ కార్డ్ ఫీచర్స్ మార్చాలన్నా సాధ్యమే కాబట్టి ఎప్పటికప్పుడు వినియీగదారును కోరిక మేరకు పాకేజీలలో మార్పులు సాధ్యమవుతాయి. ఏ చానల్స్ వద్దనుకున్నా, ఏవి కావాలనుకున్నా మార్పు చాలా సులభం. స్మార్ట్ కార్డ్ మార్చుకోనవసరం లేదు. డిజిటైజేషన్ లో భాగంగా పే చానల్స్ తో బాటు ఉచిత చానల్స్ కూడా ఎన్ క్రిప్ట్ చేసిన రూపంలో వినియోగదారులకు అందించాల్సి ఉన్నందున అదే సెట్ టాప్ బాక్స్ ద్వారా పే చానల్స్ తో బాటు ఉచిత చానల్స్ కూడా అందుతాయి.
ఒకవేళ సెట్ టాప్ బాక్సులో లోపం ఏర్పడితే వినియోగదారుడు నేరుగా సెట్ టాప్ బాక్సును ఆపరేటర్ నుంచి కొనుగోలు చేసే పక్షంలో కనీసం ఏడాది పాటు వారంటీ ఇవ్వాలి. వారంటీ ఉన్న సమయంలో దాని నిర్వహణకు గాని, మరమ్మతులకు గాని వినియోగదారుడు ఎంతమాత్రమూ చెల్లించాల్సిన అవసరంలేదు. కనీసం ఆపరేటర్ పంపిన టెక్నీషియన్ ఇంటికి వచ్చి వెళ్ళినందుకు కూడా ఎలాంటి చార్జీలూ చెల్లించకూడదు. ఒకవేళ అద్దెకొనుగోలు పద్దతి మీదగాని, అద్దెకుగాని సెట్ టాప్ బాక్స్ తీసుకొని ఉన్నా ఆ సమయంలో మరమ్మతులకు, నిర్వహణకు ఎలాంటి చెల్లింపులూ చేయనవసరం లేదు.
ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన ఫీచర్లు :
సెట్ టాప్ బాక్స్ కొనుగోలు సమయంలోనే అందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి కొనుగోలు చేశాక దాన్ని కొన్ని ఏళ్లపాటు ఉపయోగించుకుంటారు కాబట్టి వీలైనంత వరకు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దిగువ పేర్కొన్న ఫీచర్లు ఉంటే అది చాలా ఉత్తమమైన సెట్ టాప్ బాక్స్ గా పరిగణించవచ్చు:

  1. టీవీ ట్యూనర్
  2. ఎంపెగ్-2
  3. ఎంపెగ్-4
  4. ఇంటర్నెట్ బ్రౌజింగ్
  5. హెచ్ డి ఎమ్ ఐ మాడ్యూల్
  6. డాల్బీ 1 సామర్థ్యం
  7. హై డెఫినిషన్
  8. ఎఫ్ ఎం రేడియో స్పీకర్ ఔట్
  9. యు ట్యూబ్
  10. వీడియో ప్లేయర్
  11. ఫొటో వ్యూయర్
  12. ఈ- గవర్నెన్స్
  13. ఎంపి 3 ప్లేయర్
  14. వీడియో ఆన్ డిమాండ్
  15. వీడియో కాన్ఫరెన్సింగ్
  16. 3 డి
  17. మల్టీ మీడియా రిమోట్
  18. 3డి మాజిక్ ( 2డి కంటెంట్ ను 3డి గా మార్చేది )
    మొత్తంగా చూస్తే సెట్ టాప్ బాక్స్ లో ఉండాల్సిన లక్షణాలివి
    (1) ఇంటరాక్టివిటీకి అవకాశం కల్పించే నెట్ వర్క్
    (2) నెట్ వర్క్ ఇంటర్ ఫేస్ – దీనివలన సెట్ టాప్ బాక్స్ కు నెట్ వర్క్ తో అనుసంధానం ఏర్పడి సర్వర్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది
    (3) ఇన్ కమింగ్ సిగ్నల్ ను పట్టుకునే ట్యూనర్
    (4) డీకోడర్ – స్టోరేజ్ స్థలాన్ని, డిస్క్ బాండ్ విడ్త్ ని, నెట్ వర్క్ బాండ్ విడ్త్ ని ఆదా చేయటానికి ఇది అవసరం నెట్ వర్క్ ద్వారా కార్యక్రమాన్ని సెట్ టాప్ బాక్స్ కి పంపటానికి ముందు ఎన్ కోడ్ అవుతుంది. అంటే కంప్రెషన్ కి గురవుతుంది. అందువలన చందాదారుడు తన దగ్గర ఒక డీకోడర్ పెట్టుకొని డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.అప్పుడే టీవీలో చూడటం వీలవుతుంది మోడెమ్ చేసే పని ఇదే. ఈ డీకోడింగ్ నే డీమాడ్యులేషన్ అని కూడా అంటారు. ఎంపెగ్-2 కంటే ఎంపెగ్-4 కంప్రెషన్ టెక్నాలజీ వలన నెట్ వర్క్ బాండ్ విడ్త్ లో 40 శాతం తక్కువ వాడబడుతుంది.
    (5) బఫర్ – నెట్ వర్క్ లో జాప్యం కారణంగా ఏర్పడే సమస్య. వీడియో స్ట్రీమ్ కచ్చితంగా వచ్చే సమయం ఒక్కోసారి లెక్కించటం, అంచనావేయటం సాధ్యం కాదు. అందువలన ప్రేక్షకునికి అవిచ్ఛిన్నంగా ఎడతెగని ప్రసారం అందటానికి వీలుగా వీడియో, డేటా స్ట్రీమ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెకెన్ల ముందే అందుకోవటం ఉంటుంది. అంటే, ప్రేక్షకుడు చూడటానికి కొద్ది క్షణాలముందే అందుతుంది. అందువలన ప్రేక్షకుడికి అందాల్సిన స్ట్రీమింగ్ లో ఒడిదుడుకులున్నప్పటికీ సెట్ టాప్ బాక్స్ లేదా డీకోడర్ ఆ ఒడిదుడుకులు కనబడకుండా చేస్తుంది. బఫర్ లో కొంత అదనపు సమయం ఉంటుంది
    (6) సింక్రనైజేషన్ సాఫ్ట్ వేర్ / హార్డ్ వేర్ : వీడియో, ఆడియో స్ట్రీమ్స్ ప్రేక్షకుడు చూడటానికి ముందే ఒకదానితో ఒకటి అనుసంధానం ( సింక్రనైజ్) కావాలి. మెటాడేటా లాంటివి కూడా సింక్రనైజ్ కావాలి
    (7) మిడిల్ వేర్
    (8) ప్లాట్ ఫామ్
    (9) అప్లికేషన్స్
    (10) రిటర్న్ పాత్ లేదా బాక్ చానల్ .
    సెట్ టాప్ బాక్స్ లో ఉండే సాధారణ ఫీచర్లు
    ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్
    ఇది చానల్స్ లో ప్రసారమవుతున్న ప్రస్తుత కార్యక్రమం, ఆ తరువాత రాబోయే కార్యక్రమం తదితర వివరాలను తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. తెర దిగువన ఈ సమాచారం తెలుస్తూ ఉండటం అటు ప్రేక్షకులకు, ఇటు చానల్స్ కు ఎంతో ఉపయోగకరం. పరోక్షంగా చానల్స్ తమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవటం ద్వారా ప్రేక్షకులు ఆ కార్యక్రమం కోసం అదే చానల్ కొనసాగించేందుకు కూడా దోహదపడుతుంద
    ఫేవరేట్స్
    ఈ ఫీచర్ ద్వారా వినియీగదారుడు తనకు ఇష్టమైన చానల్స్ ను ఎంచుకోవచ్చు. వందలాది చానల్స్ మధ్య వాటిని సులభంగా ఎంచుకొని చూసేందుకు వీలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం వెబ్ బ్రౌజర్స్ లో వాడే బుక్ మార్క్స్ లాంటిదే ఇది కూడా.
    టైమర్
    ఈ టైమర్ వలన వినియోగదారుడు నిర్దిష్ట సమయాల్లో సెట్ టాప్ బాక్స్ ఒక చానల్ నుంచి ఒక చానల్ కు మారటం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ముఖ్యంగా వినియోగదారుడు ఇంట్లో లేనప్పుడు ఒకటికంటే ఎక్కువ చానల్స్ రికార్డ్ చేసుకోవటానికి సాయపడుతుంది. అయితే, విసిఆర్ లేడా డివిడి రికార్డర్ ను సైతం వినియోగదారుడు ప్రోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సెట్ టాప్ బాక్స్ స్కార్ట్ లింక్ ద్వారా విసిఆర్ లేడా డివిఆర్ కి రికార్డింగ్ మొదలెట్టాల్సిందిగా ఒక కంట్రోల్ సిగ్నల్ ని పంపుతుంది. కాబట్టి వినియోగదారుడు సెట్ టాప్ బాక్స్ ను ప్రోగ్రామ్ చేస్తే అది సరైన సమయంలో సరైన చానల్ కి మారి విసిఆర్ లేదా డివిఆర్ ని మేల్కొలుపుతుంది.
    పేరెంటల్ లాక్స్
    పిల్లలు చూడకూడదనుకున్న చానల్స్ వాళ్ళు చూడకుండా చేయటానికి వీలుగా తల్లిదండ్రులు వాటిని లాక్ చేయవచ్చు. ఇందుకోసం ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ( పిన్ ) వాడతారు. కొన్ని బాక్సులు అన్ని చానల్స్ నూ ఆపేస్తాయి. మరికొన్ని బాక్సులు ఎంపిక చేసిన చానల్స్ మాత్రమే నిలిపివేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here